కుట్రదారు కావొద్దు : డిప్యూటీ సీఎం దామోదర
సీఎం కిరణ్‌పై డిప్యూటీ సీఎం దామోదర మండిపాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. హైకమాండ్‌ను ధిక్కరించిన వారిని చరిత్ర క్షమించబోదని హెచ్చరించారు. సీఎం వ్యాఖ్యలతోపాటు రాష్ట్రం సమైక్యంగా ఉంచాలంటూ సీఎం, పీసీసీ చీఫ్ చేసిన సంతకాలపై హైకమాండ్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సైన్యాన్ని నడిపించే కమాండర్... కుట్రదారుడు కాకూడదని, ఒకవేళ కుట్రదారుడైతే సైన్యం ముందుకు సాగదంటూ సీఎంను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. డిసెంబర్ నాటికి రెండు రాష్ట్రాల ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు.
విభజన కోసం ఐదున్నర దశాబ్దాలుగా పోరాడుతున్న తెలంగాణ ప్రజలు మాత్రమే కారకులు తప్ప వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు కానేకాదన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం తెలంగాణ ఉద్యమ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై సుదీర్ఘంగా మాట్లాడారు. మంత్రి ప్రసాద్‌కుమార్, ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, భూపాల్‌రెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్, టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ, ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్, ప్రధాన కార్యదర్శి క్రాంతి, శైలేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్న కార్యక్రమంలో రెండు గంటలకుపైగా దామోదర ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
మా అస్తిత్వం, స్వయం పాలన కోసమే..
తెలంగాణలో అడుగడుగునా ఉల్లంఘనలే జరిగాయి. అందుకే మా తెలంగాణ మాకు కావాలే అని కోరుతున్నాం. తెలంగాణ అసమానతల కోసం కాదు. మా అస్తిత్వం, ఆత్మగౌరవం, స్వయం పాలనకు సంబంధించిన ఉద్యమం. మేం అడుగుతోంది కొత్త రాష్ట్రం కాదు. పాత తెలంగాణ రాష్ట్రమే. తెలంగాణ కంటే 18 రాష్ట్రాలు చిన్నవిగా ఉన్నాయి. ఆనాడు ముల్కీ నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టివేస్తే జై ఆంధ్రా ఉద్యమం పేరిట కొత్త రాష్ట్రం కావాలని ఉద్యమించారు. వాళ్లే నాలుగు దశాబ్దాల తర్వాత ఇప్పుడు సమైక్య రాష్ట్రం కావాలంటున్నారు? మీకెందుకు సమైక్య రాష్ట్రం? హైదరాబాద్‌లోని మీ ఆస్తులను, వ్యాపారాలను కాపాడుకోవడానికా?
సీమాంధ్రుల అంగీకారంతోనే తెలంగాణ
1999 నుంచి తెలంగాణ కావాలని కాంగ్రెస్ కోరుతోంది. అప్పట్లో 41 మంది ఎమ్మెల్యేలు సోనియాగాంధీని కలిసి విజ్ఞప్తి చేశారు. 2004, 2009 ఎన్నికల మేనిఫెస్టోలో మూడు ప్రాంతాల నాయకుల అంగీకారంతో ‘తెలంగాణ’ అంశాన్ని పొందుపరిచాం. ఆ మేనిఫెస్టోకు ఏఐసీసీ ఆమోదం కూడా తెలిపింది. ఈ చారిత్రక నేపథ్యం, పార్టీ మేనిఫెస్టో, ఆ తర్వాత యూపీఏ ఎజెండా, రాష్ట్రపతి ప్రసంగంలో పొందుపర్చిన కారణంగానే తెలంగాణ ఇవ్వాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. సీఎం, పీసీసీ చీఫ్ సహా అందరినీ సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నారు. అంతేతప్ప ఎవరిని అడిగి తెలంగాణ ఇచ్చారంటే ఎలా?
సమస్యలకు సృష్టికర్తలెవరు?
రాష్ట్రం విడిపోతే ఎన్నో సమస్యలు వస్తాయంటున్నారు. అసలు ఈ సమస్యలన్నింటికీ కారకులెవరు? 56 ఏళ్ల సమైక్య పాలనలో 44 ఏళ్లు సీమాంధ్రులే పాలించారు కదా! 12 ఏళ్లు మాత్రమే తెలంగాణ వాళ్లు పాలించారు. ఈరోజు నదీ జలాల వివాదం, విద్యుత్ సంక్షోభం, హైదరాబాద్ నగర ఇబ్బందులని అంటున్నారు? ఇన్నాళ్లూ పాలించింది మీరే కదా!
హైకమాండ్‌ను ధిక్కరిస్తే చరిత్ర క్షమించదు
హెకమాండ్‌ను ధిక్కరించినట్లు వ్యవహరించే వాళ్లను చరిత్ర క్షమించబోదు. కొందరు (సీఎంను ఉద్దేశించి) అన్నీ తానే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. పార్టీని ఎవరు ధిక్కరించినా వారికి వ్యతిరేకంగా, పార్టీకి అండగా తెలంగాణ నాయకులమంతా నిలబడతాం. హైకమాండ్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కిరణ్ సీఎంగా కొనసాగాలో వద్దో ఆయన విచక్షణకే వదిలేస్తున్నా. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివసిస్తున్న కుటుంబాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వారంతా హైదరాబాదీలే. వాళ్లను ఇక్కడ్నుంచి పొమ్మనే హక్కు ఎవరికీ లేదు. తెలంగాణలో నివసిస్తున్న వారెవరూ సెటిలర్లు కారు. అంతా హైదరాబాదీలే. వారికి భద్రత కల్పిస్తాం, తోడుగా ఉంటాం. సీమాంధ్ర ఉద్యోగుల విషయంలో నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకుంటారు. ఇంకా ఏమైనా అభ్యంతరాలుంటే ఆంటోనీ కమిటీకి నివేదిస్తే త్వరలోనే నివృత్తి చేస్తుంది.
విడిపోతే సమస్యలు నిజమే
రాష్ట్రం విడిపోతే తెలంగాణలో నీరు, విద్యుత్ సమస్యలు వస్తాయనేది నిజమే. 1,500 నుంచి 2వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఇప్పటికే ఉంది. ఎత్తిపోతల పథకాలు వస్తే మరింత కొరత వస్తుంది. మరి దీనికి కారకులు మీరు (సీమాంధ్ర పాలకులు, కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి) కాదా? గోదావరి, కృష్ణా నీటిని వాడుకోవాలంటే కచ్చితంగా చాలా విద్యుత్ అవసరం. ప్రాణహిత-చేవెళ్ల, ఎల్లంపల్లి, కంతనపల్లి, దేవాదుల ప్రాజెక్టు అయినా సరే.. ఈనాటి వరకు తెలంగాణకు విద్యుత్ అవసరమనే విషయాన్ని ఎందుకు ఆలోచించలేదు? దీన్ని ఏమనుకోవాలి? కృష్ణా, గోదావరిపై 40 వేల కోట్లు వెచ్చిస్తే 6 వేలకు పైగా మెగావాట్లు విద్యుత్ అవసరం అవుతుందనే సంగతి మాకు తెలుసు. టీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరడంలో తప్పులేదు. ఎవరు ఇష్టం ఉంటే ఏ పార్టీలోనైనా చేరే అవకాశముంది. నేను సోనియాగాంధీ దయతో డిప్యూటీ సీఎం అయ్యాను. ఆమె ఏ బాధ్యతలు అప్పగించినా కార్యకర్తగా శిరసావహిస్తా.