సీఎంను బర్తరఫ్ చేయాలి
10, 11, 12న నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలు: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ఒక ప్రాంతానికి కొమ్ముకాసేలా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కు రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని, వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం డిమాండ్ చేశారు. జేఏసీ కో చైర్మన్లు మల్లేపల్లి లక్ష్మయ్య, వి.శ్రీనివాస్‌గౌడ్, అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, మాదు సత్యం తదితరులతో కలిసి హైదరాబాద్‌లోని జేఏసీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని ధిక్కరించే విధంగా మాట్లాడిన కిరణ్ వెంటనే రాజీనామా చేయాలని, లేకుంటే అధిష్టానమే ఆయన్ను పదవి నుంచి తప్పించాలని కోరారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో దిష్టిబొమ్మలను దహనం చేయాలని, తెలంగాణవ్యాప్తంగా నిరసనలను చేపట్టాలని కోదండరాం పిలుపునిచ్చారు.