ఇద్దరూ అవకాశవాదులే: టీజేఏసీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన విపక్ష నేత చంద్రబాబు.. ఇద్దరూ అవకాశవాదులేనని, దగుల్బాజీలేనని తెలంగాణ జేఏసీ విరుచుకుపడింది. దార్శనికత చూపాల్సిన వీరు రెచ్చగొట్టే ప్రసంగాలతో ఇరు ప్రాంతాల ప్రజల్లో ద్వేషాలు పెంచుతున్నారని ధ్వజమెత్తింది. సీఎంకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాలని సవాల్ చేసింది. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) ఆధ్వర్యంలో కె.గోవర్ధన్ అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ సాధన సభ జరిగింది.
తెలంగాణ ఏర్పాటుకు విఘ్నాలు రాకుండా ఉండాలంటూ జేఏసీ హైదరాబాద్‌లోనే తెలంగాణ శాంతి యజ్ఞాన్ని నిర్వహించింది. వేర్వేరు చోట్ల జరిగిన ఈ కార్యక్రమాల్లో తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ కోసం సకల జనుల సమ్మె జరిగినప్పుడు నిర్ణయం తన చేతుల్లో లేదని, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని చెప్పిన కిరణ్ ఇప్పుడు మాట మారుస్తున్నారని అన్నారు. జేఏసీ నేతలు లాలయ్య, నాగేష్ పటేల్ దంపతులు శాంతి యజ్ఞం చేశారు. జేఏసీ కో చైర్మన్ వి.శ్రీనివాస్ గౌడ్, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు.
‘ఇక ఎవరితరం కాదు..’ : తెలంగాణను వెనక్కుతిప్పటం ఇక కాంగ్రెస్ కోర్ కమిటీ తరం కూడా కాదని కోదండరాం పేర్కొన్నారు. కిరణ్ ఫాక్షనిస్టని జేఏసీ నేత మల్లేపల్లి లక్ష్మయ్య మండిపడ్డారు. తెలంగాణలోని మిగతా జిల్లాల్లో లేని భయాందోళనలు హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు ఎందుకని న్యూడెమోక్రసీ నేత ఎస్.వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. సీమాంధ్రలో అహేతుక ఉద్యమం నడుస్తోందని మానవ హక్కుల వేదిక నేత జీవన్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఈ సభలో టీజేఏసీ నేతలు టీఎన్జీవో నేతలు దేవీప్రసాద్, శ్రీనివాసగౌడ్, చంద్రన్న వర్గం నేతలు వి.సంధ్య, ఎన్.బ్రహ్మయ్య, చిట్టిపాటి వెంకటేశ్వర్లు తదితరులు ప్రసంగించారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టాలని, పోలవరం ప్రాజెక్టును ఆపాలని తీర్మానాలు చేశారు.