అట్టడుగు ఆక్రందనలు వినాలి! | no development in who are depending on the scheduled casts | Sakshi
Sakshi News home page

అట్టడుగు ఆక్రందనలు వినాలి!

Published Fri, Sep 5 2014 12:23 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

అట్టడుగు ఆక్రందనలు వినాలి! - Sakshi

అట్టడుగు ఆక్రందనలు వినాలి!

ఈ అరవై ఐదేళ్ల స్వాతంత్య్ర ఫలాలలో దళితులకు దక్కిందే తక్కువ. అది కూడా పై పొరలలో ఉన్న మాల, మాదిగలకే దక్కింది. కానీ ఎస్సీలలో అట్టడుగున ఉన్న, ముఖ్యంగా మాల, మాదిగల మీద ఆధారపడి జీవిస్తున్న కులాలలో ఎలాంటి అభివృద్ధి కనిపించదు. వారి బతుకులు మరీ దుర్భరం.

‘నీవు చేస్తున్న పనిలో ఎప్పుడైనా సందేహం వస్తే నిన్ను నీవు పరీక్షించుకో! ఆసరా కోసం ఎదురుచూస్తున్న ఒక నిరుపేద ముఖాన్ని గుర్తుచేసుకో. అన్ని రకాలుగా బలహీనుడైపోయిన ఒక నిస్సహాయుడిని కళ్ల ముందు ఊహించుకో. అటువంటి అభాగ్యునికి నీవు అనుసరించబోయే మార్గం ఉపయోగపడు తుందా? అతని జీవనగమ్యానికి ఇది చేయూతనిస్తుందా? ఈ కార్యక్రమం ఆకలితో అలమటిస్తున్న కోట్లాది మందిలో ఒక భరోసాను నింపుతుందా? ఇది నిజమని భావిస్తే నీ సందేహాలన్నీ పటాపంచలవుతాయి...’ అన్నారు భారత స్వాతంత్య్రోద్యమ సారథి గాంధీ.  నూటికి నూరు శాతం కాకున్నా ఒక మేరకు ఆ స్ఫూర్తిని మన రాజ్యాంగంలో ఇమడ్చగలిగారు.
 
దళితులలో ఆత్మ విశ్వాసం
ఆధునిక సమాజం అట్టడుగున ఉన్న వారిని మరింత అడుగుకు నెట్టే ప్రయత్నం చేసింది. కానీ స్వపరిపాలన కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం మాత్రం ఈ అంశం మీద కొంత భిన్నంగా ఆలోచిస్తున్నది. తెరాస అధినేత కె. చంద్రశేఖరరావు పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత, ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అట్టడుగు వర్గాలైన దళితుల కోసం ఇటీవల ఆయన చూపుతున్న శ్రద్ధాసక్తులు మహాత్మా గాంధీ అంత్యోదయ సిద్ధాంతానికి బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. అంబేద్కర్ కన్న కలలను సాకారం చేయడంలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి దళితులలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్నది.
 
హైదరాబాద్‌లో  పేదలూ, దళితులూ నివసించే బోయిగూడ కాలనీని ఇటీవల ఆయన సందర్శించి, ఇళ్లు నిర్మించి ఇస్తామని వారికి హామీ ఇవ్వడం మరొక ముందడుగు. పల్లెలలో నివసించే నిరుపేద వ్యవసాయాధార దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి ఇవ్వడానికి ఉద్దేశించిన పథకం దేశంలోనే అద్భుతమైన స్పందనకు కారణమైంది. నగరాలలోని దళితుల కోసం మరొక వినూత్న పథకం రూపొందించాలన్న కేసీఆర్ ఆలోచన కూడా త్వరలో కార్యరూపం దాల్చబోతున్నది. ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రీ ఇంతటి శ్రద్ధ చూపించిన దృష్టాంతాలు లేవు.
 
అణగారిపోతున్న ఉపకులాలు
సముద్రం లోతు తెలియనట్టే;  వివక్ష, అణచివేత, దారిద్య్రం, అవమానాల లోతు కూడా తెలియదేమో! వెలివేతకు గురై అంటరాని వారిగా మిగిలి ఉన్న వారి జీవితాలలో దారుణమైన చీకటి అలుముకుని ఉంది. ఇంకొక వాస్తవం ఏమిటంటే, ఇవే కులాలలో ఇంకా అట్టడుగున పడి కనిపించని సమూహాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే అంటరాని తనం, కుల వివక్ష షెడ్యూల్డ్ కులాల మధ్యన కూడా కొనసాగుతోంది. ‘కుల సమస్య, ఉపకులాల సమస్య వేర్వేరుగా చూడడానికి వీలులేదు. కులమనే విష వృక్షానికి కాసిన కాయలే ఈ విపరీత ధోరణులు. పైనున్న కులాలు కింది కులాలను అణచివేయడం, వివక్ష ప్రదర్శించడం నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ లక్షణం.
 
కుల నిర్మూలన ద్వారానే కులాలు, ఉప కులాలు అంతరించిపోతాయి’ అని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. షెడ్యూల్డ్ కులాలలో తమ కింద అణచివేతకు గురవుతున్న వారిని అభివృద్ధిలో తమ వెంట తీసుకువెళ్ల వలసిన బాధ్యత పైన ఉన్న కులాలకు ఉంటుందని కూడా ఆయనే చెప్పారు. ఈ చింతనతోనే తెలంగాణలో ఉన్న షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి గురించి కొత్త దృక్పథంతో ఆలోచించాలి. ఎస్సీలు అనగానే మనకు మాదిగలు, మాలలే గుర్తుకు వస్తారు. వీరి జనాభా కూడా ఎక్కువే. ఇదే వర్గానికి చెందిన మిగిలిన వారి జనాభా గుర్తించదగినంతగా ఉండదు. ఈ అరవై ఐదేళ్ల స్వాతంత్య్ర ఫలాలలో దళితులకు దక్కిందే తక్కువ. అది కూడా పై పొరలలో ఉన్న మాల, మాదిగలకే దక్కింది. కానీ ఎస్సీలలో అట్టడుగున ఉన్న, ముఖ్యంగా మాల, మాదిగల మీద ఆధారపడి జీవిస్తున్న కులాలలో ఎలాంటి అభివృద్ధి కనిపించదు.
 
నిలువనీడ లేదు
తెలంగాణ ప్రభుత్వం ఈ అంశం మీద దృష్టి సారించవలసిన అవసరం ఉంది. మాదిగ ఉపకులాలైన డక్కలి, చిందు, మాప్టిన్, బైండ్ల; మాల ఉపకులాలైన గుర్రపుమాల, మాలమాష్టి, మాల జంగం, మిత్తులయ్యోర్లు, పంబాల, బ్యాగరి వంటి కులాలు అధ్వానస్థితిలో ఉన్నాయి. వీరితో పాటు గోసంగి, బుడిగె జంగాలు, హోలియ దాసరి, మోచి, ధోర్ వంటి కులాలు కూడా అట్టడుగున పడి ఉన్నాయి. డక్కలి కులం దయనీయ స్థితిలో ఉంది. ఇక్కడ పేర్కొన్న కులాలవారు ఎక్కువగా సంచార జీవనం సాగిస్తుంటారు. డక్కలి, మాప్టిన్, గుర్రపుమాల, మాష్టి వంటి కులాలు చదువుకు, ఉపాధికి సుదూరంగా ఉండిపోయాయి. ఇళ్లు లేకపోవడం మరొకటి. వీరు సేద్యంలోగానీ, ఇతర రంగాలలో గానీ ఉత్పత్తిలో ప్రత్యక్ష భాగస్వాములు కారు.
 
కులాల సాంస్కృతిక చరిత్ర, పుట్టుకల గురించి తరాతరాలుగా గానం చేస్తూ మాలమాదిగల దగ్గర యాచించి, వారు ఇచ్చింది తింటూ బతుకుతున్నారు. ఇటీవల కాలంలో కళాప్రదర్శనలకు ఆదరణ తగ్గిపోయింది. దీనితో చాలామంది బిచ్చగాళ్లుగా, అంతకంటే కడు దుర్భరమైన స్థితికి దిగజారిపోయారు. 2013లో హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ముగ్గురు పసికందులు కన్నుమూశారు. సొంత ఇళ్లు లేక, అద్దె ఇళ్లలో ఉండే స్తోమత లేక, ప్లాస్టిక్ కవర్‌ల కింద, ఫ్లెక్సీల కింద బతుకులీడుస్తున్న ఫలితమిది. ఈ విషాదం మచ్చుకు మాత్రమే. ఇటీవల యునిసెఫ్ ఇచ్చిన వివరాల ప్రకారం భారతదేశంలో మాతాశిశువుల మరణాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వాస్తవాలను గమనిస్తే దళితులలోని అట్టడుగు కులాలలో ఈ తరహా మరణాలు ఎక్కువని అర్థమవుతుంది. ఈ విషయాన్ని ఒక అధికారి ధ్రువీకరించారు కూడా.
 
అందుకే దళితుల అభివృద్ధికి ప్రధానమైన కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం చిట్టచివరి వాడి నుంచి మొదలుపెట్టి వారందరిని ప్రగతిలో భాగం చేయాలి. వీరి జనాభా కూడా తక్కువే. వీరివి 15 నుంచి 20 వేల కుటుంబాలు మాత్రమేనని అంచనా. ఇటీవల జరిగిన ఇంటింటి సర్వే ద్వారా ఇందుకు సంబంధించిన వాస్తవాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వంతో పాటు మాల, మాదిగలలో ఉన్న విద్యావంతులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు కూడా ఈ అంశం మీద దృష్టి పెట్టాలి. భూమి, ఇల్లు, పిల్లలకు చదువు, ఆసక్తినిబట్టి యువకులకు వృత్తి శిక్షణ ఇచ్చినట్టయితే కేవలం రెండు మూడు సంవత్సరాలలోనే వీరు కూడా మిగిలిన ఎస్సీ కులాల మాదిరిగానే తలెత్తుకుని నిలబడతారు.
 
ఇది జాతీయ సమస్య
ఈ కులాల వారు ఇప్పటివరకు కళల మీద, వైద్యం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇతర సాంస్కృతిక విషయాలతో భుక్తి గడుపుకున్నారు. మారుతున్న పరిస్థితులను బట్టి అవన్నీ వారికి దూరమైనాయి. కాబట్టే బతుకు తెరువు విషయంలో ఆత్మ విశ్వాసం లోపించింది. నిజానికి మాల, మాదిగలే చాలా చోట్ల దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. అందుకే ఆశ్రీత కులాలను పోషించడం కష్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రం నుంచి ప్రత్యేక సాయాన్ని కూడా అర్థించవచ్చు. నిజానికి ఈ సమస్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు పరిమితమైనది కాదు. ఇది జాతీయ సమస్య. అయినా బాహ్య ప్రపంచానికి తెలియని సమస్య.
 
సబ్‌ప్లాన్ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూపొందించిన చట్టంలో కూడా దళితులను సమాజంలోని అన్ని వర్గాలతో సమానంగా అభివృద్ధి చేయడానికీ, అంతరాలను తొలగించడానికీ తోడ్పడాలని స్పష్టంగా ఉంది. అదే విధంగా షెడ్యూల్డ్ కులాలలోని అన్ని కులాల మధ్య సమానత్వాన్ని సాధించడానికి ఈ చట్టం ఉపకరించాలని కూడా పేర్కొన్నారు. ఈ ఆశ్రీత కులాల శ్రేయస్సుకు ప్రత్యేక పథకాలను రూపొందించడానికీ, అమలు చేయడానికీ తెలంగాణ రాష్ట్రం కృషి చేస్తే చరిత్ర సృష్టించినట్టు అవుతుంది. త ద్వారా అట్టడుగు వర్గాల మదిలో తెలంగాణ తొలి ప్రభుత్వం శాశ్వత స్థానం ఏర్పరచుకోగలుగుతుంది.

 (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement