ప్రభుత్వ హామీలు బుట్టదాఖలు
కోర్టు తీర్పులను ధిక్కరిస్తున్న వివిధ శాఖలు
నిరాశ్రయులుగా మారుతున్న అంతర్గాం కార్మికులు
రామగుండం : ప్రభుత్వాలు మారుతున్నా మండలంలోని అంతర్గాం స్పిన్నింగ్, వీవింగ్ మిల్లు కార్మికుల తలరాతలు మాత్రం మారడం లేదు. స్పిన్నింగ్, వీవింగ్ మిల్లు లాకౌట్ అరుు ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ కార్మికులకు వీఆర్‌ఎస్ మాత్రం చెల్లించలేదు. అలాగే సొసైటీకి డిపాజిట్ చేసిన నిధులకు 10 గుంటల నివేశన స్థలాలు కార్మికులకు అప్పగించాల్సి ఉన్నా.. తమ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1966లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బర్మా, కాందీశీకులకు (శరణార్థులు) ఉపాధి నిమిత్తం ప్రతి కార్మికుడిని మిల్లులో షేర్ హోల్డర్‌గా చేర్చుకునేందుకు రూ.7,200 డిపాజిట్ చేసి దశల వారీగా వేతనాల్లో కోత విధించారు. ఇందులో ప్రతి కార్మికుడికీ 10 గుంటల విస్తీర్ణంలో క్వార్టర్ సౌకర్యం కల్పించారు. సుమారు 500 ఎకరాల్లో వెయ్యి క్వార్టర్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ ఐదు వందల క్వార్టర్లు మాత్రమే నిర్మించారు.
1966లో 96 ఎకరాల్లో వీవింగ్ మిల్లు, 53 ఎకరాల్లో స్పిన్నింగ్ మిల్లును నిర్మించారు. 28 ఏళ్ల క్రితమే మిల్లుల్లో నష్టాలు రావడంతో లాకౌట్ ప్రకటించారు. దీంతో స్పిన్నింగ్ మిల్లు కార్మికులకు వీఆర్‌ఎస్ కింద ఫైనల్ బిల్లు ఇచ్చినప్పటికీ వీవింగ్ మిల్లు కార్మికులకు మాత్రం ఎలాంటి బకాయిలూ చెల్లించలేదు. మూడేళ్ల క్రితం ఉమ్మడి ప్రభుత్వం హయూంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్ర తి కుటుంబానికీ ఐదు గుంటల స్థలం ఇవ్వాలని ఆదేశాలు జారీచేశా రు. అది ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. మిల్లు భూములను విక్రయించేందుకు జేసీ (జాయింట్ కలెక్టర్) స్థాయి అధికారిని లిక్విడేటర్‌గా నియమించినప్పటికీ ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు.
శిథిలావస్థలో క్వార్టర్లు
50 ఏళ క్రితం నిర్మించిన క్వార్టర్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో వరద నీరు పైకప్పు నుంచి ఇంట్లోకి రావడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. మిల్లులు ప్రారంభ సమయంలో తమను షేర్ హోల్డర్లుగా చేర్చుకొని ఇప్పుడు కనీసం తమ క్వార్టర్లకు పట్టాలు ఇవ్వడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
30 ఏళ్లుగా ఎదురుచూస్తున్నం
ఇళ్ల స్థలాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నాం. మా కుటుంబాల్లో పెళ్లీడుకొచ్చిన యువతీ, యువకులకు సంబంధాలు రావడం లేదు. ఒకవేళ వచ్చినా అంతర్గాం అని చెప్పగానే వెనుకడగు వేస్తున్నారు. మాకు క్వార్టర్లు ఇచ్చిన అధికారులు.. వాటిపై అధికారం మాత్రం ఇవ్వకపోవడం శోచనీయం. - ఇండిబిల్లి నూకాలమ్మ, స్పిన్నింగ్ మిల్లు బాధితురాలు
ఇల్లు సొంతమని చెప్పులేకపోతున్నం
నలభై ఏళ్ల క్రితం ఇక్కడికి వలస వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాం. మాకు పిల్లలు ఇక్కడే పుట్టారు. ఇక్కడ ఉపాధి కరువైనా ఇక్కడినుంచి వెళ్లలేకపోతున్నాం. మా కొడుకులే ఉపాధి నిమిత్తం వేరే చోటికి వెళ్లి రాత్రికి తిరిగి వస్తున్నారు. ఇక్కడి వాతావరణానికి మరోచోటికి వెళ్లలేకపోతున్నాం. - కె.పేరమ్మ, వీవింగ్ మిల్లు బాధితురాలు
ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
మిల్లు భూములను ముందుగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అప్పుడే లిక్విడేటర్‌కు వాటిని విక్రయించే అధికారం ఉంటుంది. లేదంటే వాటిని విక్రయించే అధికారం ప్రభుత్వానికి ఉండదు. ఇప్పటికీ వీవింగ్ మిల్లు కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల ఊసే లేదు. ఉద్యమాలు చేసినా కాందీశీక కార్మిక కుటుంబాలు నిరాశ్రయులవుతున్నారుు. - జయకుమార్, స్పిన్నింగ్ మిల్లు కార్మికుడు
ప్రభుత్వాలు మారుతూనే ఉన్నారు..
ఇరవై ఏళ్లుగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా నివాసముంటు న్న భూములకు హక్కుదారులుగా గుర్తించడం లేదు. ప్రతి రాజకీయ పార్టీ మమ్మల్ని ఓటుబ్యాంకుగానే గుర్తిస్తున్నారు తప్పా తమ సమస్యలపై స్పందించే నాయకుడు కరువయ్యాడు. ప్రభుత్వ ఆదేశాలను సైతం అధికారులు అమలుచేయకపోవడం దురదృష్టకరం - ఇండిబిల్లి రవీందర్‌కుమార్, కాందీశీకుల సంఘం ఉపాధ్యక్షుడు