రగిలిన తెలంగాణ | Telangana agitations raised by chief minister kiran kumar reddy's comments | Sakshi
Sakshi News home page

రగిలిన తెలంగాణ

Published Sat, Aug 10 2013 2:17 AM | Last Updated on Thu, Jul 11 2019 5:37 PM

రగిలిన తెలంగాణ - Sakshi

రగిలిన తెలంగాణ

రాష్ట్ర విభజన ప్రకటనపై సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం తెలంగాణ జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. సీఎం తెలంగాణ వ్యతిరేకిగా మారారని మండిపడ్డారు, సీఎం తీరును నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మలు దహనం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవిధంగా కిరణ్ వ్యవహరిస్తున్నారని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
 
 న్యూస్‌లైన్ నెట్‌వర్‌‌క :వరంగల్ జిల్లా హన్మకొండ చౌరస్తాలో టీఆర్‌ఎస్ యువజన విభాగం కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మకు చెప్పులు వేసి హైమాస్ట్ లైట్ స్తంభానికి ఉరివేశారు. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు కిరణ్  దిష్టిబొమ్మను దహనం చేశారు. కురవి, నర్సింహులపేట, పాలకుర్తి, దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట, పరకాల, గీసుగొండ, బచ్చన్నపేట, నర్మెట, మద్దూరు మండల కేంద్రాల్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలను తెలంగాణవాదులు దహనం చేశారు. ఈ ఆందోళనల్లో టీఆర్‌ఎస్, కేయూ జేఏసీ, టీజేఏసీ, బీసీ జేఏసీ, టీఎస్‌జేఏసీ, ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
 
  కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీలతోపాటు పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. రెండు ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, చెన్నూరు, నిర్మల్, ఉట్నూర్, కడెం, జన్నా రం, బోథ్, ఇచ్చోడ, దండెపెల్లి, లక్సెట్టిపేట మండలాల్లో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగురామన్న, టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి పాల్గొన్నారు.  మందమర్రిలో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.
 
  ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామగిరిలో టీజేఎస్‌ఎఫ్, బీడీఎస్‌ఎఫ్ ఆధ్యర్యంలో సీఎం దిష్టిబొమ్మకు నిప్పుపెట్టారు. కనగల్ మండలంలోని రేగట్టే గ్రామంలో జేఏసీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మకు శవయాత్ర చేపట్టి అనంతరం దహనం చేశారు.
 
  నిజామాబాద్ నగరంలో టీఆర్‌ఎస్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద నాయకులు, కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మకు ఉరివేసి ఊరేగింపు నిర్వహించారు. వేల్పూర్, కామారెడ్డి , నిజామాబాద్ మండలంలోని ధర్మారం(బి)లో, ఎల్లారెడ్డిలో  టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సీఎం దిష్టి బొమ్మలను కార్యకర్తలు  దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో సీఎం దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. సిరికొండ మండల కేంద్రంలో టీఆర్‌ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.  
 
  మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులతోపాటు వివిధ పార్టీలకు చెందిన ప్రజా
 ప్రతినిధులు భగ్గుమన్నారు. సీఎం మాటల్లో సీమాంధ్ర ఆధిపత్య ధోరణి కనిపిస్తుందని మానవహక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు మదు కాగుల పేర్కొన్నారు. సీఎం తన క్యాంపు ఆఫీసు నుంచే సీమాంధ్ర ఉద్యమాన్ని నడిపిస్తున్నారిని తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి  సీమాంధ్ర ప్రాంత ఉద్యమానికి వత్తాసు పలుకుతున్నాడని ఆయనను  బర్తరఫ్ చేయాలని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నకేశవ్ డిమాండ్ చేశారు.  సీఎం  ప్రాంతీయవాదిలా మాట్లాడుతూ అనవసర రాద్దాంతం చేస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. సీఎంను డిస్మిస్ చేయాలని బీజేపీ నాయకులు నాగూరావు నామాజీ డిమాండ్ చేశారు.  
 
  మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో తెలంగాణ పీఆర్టీయూ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ఎదురుగా సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. సదాశివపేట, మెదక్ బస్టాండుల ఎదుట, నంగనూరు మండలం రాంపూర్ క్రాస్‌రోడ్డు వద్ద, జోగిపేటలో, అంథోల్ మండలం ఎర్రారం గ్రామంలో, నాందేడ్-అకోలా రహదారిపై  గజ్వేల్, వెల్దుర్తిలో, జహీరాబాద్‌లో జేఏసీ నాయకులు  సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు.
 
  టీఆర్‌ఎస్, జేఏసీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్  జిల్లా వ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గోపగాని శ ంకర్‌రావు, తిప్పన సైదులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం, కొత్తగూడెం రుద్రంపూర్‌లో జేఏసీ నాయకులు, పాల్వంచ తెలంగాణ నగర్‌లో టీఆర్‌ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఇల్లెందు పట్టణంలో టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మధిర నియోజకవర్గం ముదిగొండలో టీఆర్‌ఎస్ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో టీఆర్‌ఎస్ నాయకులు నిరసన ర్యాలీ
 నిర్వహించారు. తెలంగాణపై సీఎం వ్యాఖ్యలను రంగారెడ్డి జిల్లాలోని తెలంగాణవాదులు, వివిధ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. సీఎం వ్యాఖ్యలు ఉద్యమకారులను రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలంగాణ జేఏసీ జిల్లా తూర్పు విభాగం కన్వీనర్ సంజీవరావు ధ్వజమెత్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement