హైదరాబాద్, న్యూస్‌లైన్ : సీడబ్ల్యూసీ సమావేశం సమయంలో తెలంగాణపై కేంద్ర నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించి ఆనక సమైక్యవాదినని ప్రకటించుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు శుక్రవారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు గోవర్ధన్‌రెడ్డి, సీహెచ్ ఉపేంద్ర మాట్లాడుతూ.. తెలంగాణ ప్రకటన వచ్చిన అనంతరం ఏడు రోజులు చీకటి గదుల్లో కూర్చు న్న సీఎం కుట్రలు పన్ని సమైక్యవాద కృత్రిమ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. విలేకరుల సమావేశంలో చెప్పిన సమస్యలన్నీ ఆయనకు గతంలో తెలియ దా? అని వారు ప్రశ్నించారు. సోనియా భిక్షతో సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం ఆమె ఇచ్చిన మాటనే వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసిన సీఎం ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.