సాక్షి, హైదరాబాద్: ప్రశాంత పరిస్థితుల్లో ఉండే రాష్ట్రమే అభివృద్ధికి బాటలు వేయగలుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నిరుపేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించేందుకు కృషి చేస్తున్న తమ ప్రభుత్వానికి ప్రగతి ప్రయాణంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 67వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకలకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో, మత సామరస్యాన్ని కాపాడటంలో రాజీలేకుండా ముందుకు వెళుతున్నామన్నారు.
నిజాయితీ, పారదర్శకమైన పాలన ద్వారా అన్ని రంగాల్లో ప్రగతిని సాధించి, ప్రతి ఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని, ఏ పథకం అమలు చేసినా పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామని చెప్పారు. భగవంతుని దయ వల్ల రాష్ట్రంలో ముందుగానే మంచి వర్షాలు పడినందున ఖరీఫ్ సీజన్‌లో మంచి పంటలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జలాశయాలన్నీ పూర్తిగా నిండాయని, విద్యుత్ పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని చెప్పారు. గత తొమ్మిదేళ్లలో ఈ ఏడాది తలసరి ఆదాయం జాతీయసగటు కన్నా ఎక్కువగా నమోదయిందని, జాతీయ స్థాయిలో పేదరికం శాతం 21.9గా ఉంటే మన రాష్ట్రంలో 9.2 శాతానికి తగ్గిందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టం తెచ్చి ఆయా వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డా బంగారుతల్లి కావాలనే ఉద్దేశంతో బంగారు తల్లి అనే పథకాన్ని ప్రారంభించామని, ఇప్పటివరకు ఈ పథకం కింద 50వేల మందిని నమోదు చేసుకున్నామని చెప్పారు. ఎవరు అధికారంలో ఉన్నా ఈ పథకాన్ని అమలుచేసి తీరాలనే లక్ష్యంతో పథకానికి చట్టబద్ధత కూడా కల్పించామన్నారు. ఇందిరమ్మ బాటలో ఇచ్చిన హామీలలో ఎక్కువ శాతం నెరవేర్చామని, మిగిలినవి త్వరలోనే నెరవేరుస్తామన్నారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ.16,500 కోట్లను రుణాలుగా ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. పారిశ్రామిక పెట్టుబడుల్లో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానానికి చేరుకుందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మంత్రులు బొత్స సత్యనారాయణ, దానం నాగేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, డీజీపీ దినేశ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సాంస్కృతిక శాఖ శకటానికి మొదటి బహుమతి
స్వాతంత్య్రదిన వేడుకల సందర్భంగా రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను తెలిపేవిధంగా ప్రదర్శించిన శకటాల్లో సాంస్కృతిక శాఖకు మొదటి బహుమతి లభించింది. అటవీశాఖ, ఉద్యానశాఖల శకటాలకు ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి. మహిళ, శిశు సంక్షేమ శాఖ శకటానికి ప్రోత్సాహక బహుమతి లభించింది. పరేడ్‌కు సంబంధించి సాయుధ విభాగంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏపీఎస్పీ 16వ బెటాలియన్, సాధారణ విభాగంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల విద్యార్థులకు మొదటి బహుమతులు లభించాయి. నేషనల్ గ్రీన్ కాప్స్ విద్యార్థులు ప్రోత్సాహక బహుమతికి ఎంపికయ్యారు. విధి నిర్వహణలో విశిష్ట సేవలందించిన పోలీసు అధికారులు, సిబ్బంది పలువురికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం పతకాలను బహూకరించారు.
పాపం.. ఎస్సీ గురుకులాల విద్యార్థులు: వేడుకల సందర్భంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీకి చెందిన 600 మంది విద్యార్థులు ‘భారతీయం’ పేరిట ప్రత్యేక ప్రదర్శనకు సిద్ధమయ్యారు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో వర్షం మొదలైంది. అయినప్పటికీ తమ నెలరోజుల సాధనను ప్రదర్శించి సీఎం అభినందనలు పొందాలన్న ఆశతో ఆ చిన్నారులందరూ వర్షంలో తడుస్తూనే ఆయన ప్రసంగాన్ని విన్నారు. సీఎం ప్రసంగం అయిపోగానే చిన్నారులు నృత్య రూపకాన్ని అరగంటపాటు వర్షంలోనే ప్రదర్శించారు. సీతాకోక చిలుకలను తలపించే ఆకర్షణీయమైన దుస్తులు ధరించిన చిన్నారులు చేసిన ఈ ప్రదర్శన ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. కానీ సీఎం తన ప్రసంగం ముగియగానే నిష్ర్కమించడంతో చిన్నారుల ఆశలు ఆవిరయ్యాయి.
ప్రశాంత రాష్ట్రంతోనే అభివృద్ధి: కిరణ్‌కుమార్‌రెడ్డి
Published Fri, Aug 16 2013 2:53 AM | Last Updated on Mon, Aug 13 2018 4:01 PM
Advertisement