Satyajith Mittal: చిన్న పిల్లల బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు మిట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ గ్రాడ్యుయేట్ సత్యజిత్ మిట్టల్. చిన్నప్పుడు తాను పడిన ఇబ్బంది వేరే పిల్లలు పడకూడదన్న ఉద్దేశంతో వినూత్న షూ రూపొందించి విజయవంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న పిల్లల పాదాలకు అనుగుణంగా విస్తరించగలిగే వినూత్న బూట్ల శ్రేణి మ్యాజిక్ షూను అభివృద్ధి చేసింది ఆయన స్థాపించిన షూ కంపెనీ అరెట్టో (Aretto).
ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్‌టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ!
చిన్నప్పుడు పడిన ఇబ్బందే..
మ్యాజిక్ షూ ఆవిష్కరణ కోసం సత్యజిత్‌కు తన చిన్ననాటి అనుభవం ప్రేరణనిచ్చింది. చిన్నప్పుడు తన అన్నయ వాడిన బూట్లను సత్యజిత్‌కు ఇచ్చేవారు. అయితే ఆ బూట్లు సత్యజిత్‌కు చాలా వదులు అయ్యేవి. దాంతో నడవడానికి ఆయన చాలా ఇబ్బంది పడేవారు. అప్పటి నుంచి మంచి నాణ్యత గల బూట్లు ధరించాలని ఎప్పుడూ కలలు కనేవాడు. ఆ సమయంలో భారతదేశంలో అవి చాలా తక్కువగా ఉండేవి.
ప్రతి ముగ్గురిలో ఒకరు తమ చిన్నతనంలో ఏదో ఒక సమయంలో తమకు సరిపోని సైజు షూ ధరించి ఇబ్బందులు పడినవాళ్లు ఉంటారు. పిల్లలు పెరిగేకొద్దీ వారి పాదాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు కొన్ని రోజులకే ఎక్కువ జతల బూట్లు కొనాల్సి వస్తోంది. ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం కనుక్కున్నారు సత్యజిత్. పెరుగుతున్న పాదాల సైజ్‌కు అనుగుణంగా విస్తరించే మ్యాజిక్ షూను రూపొందించారు. ఇది మధ్యతరగతి కుటుంబాలకు తల్లిదండ్రులకు మేలు కలిగిస్తోంది. ఇవి కొంటే పదే పదే కొత్త బూట్లు కొనాల్సిన అవసరం ఉండదు.
నిరంతర పరిశోధనలు, పోడియాట్రిస్ట్ (పాదాలకు సంబంధించిన వైద్య నిపుణులు)లతో సంప్రదింపుల ద్వారా సత్యజిత్ పిల్లల పాదాల అనాటమీ గురించి లోతైన అవగాహన పొందాడు. వారి పాదాలు పెద్దలకు భిన్నంగా ఉంటాయని, వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన బూట్లు అవసరమని గ్రహించాడు. ఈ జ్ఞానంతో రెండేళ్ల పాటు కష్టపడి మ్యాజిక్ షూను రూపొందించాడు. ఈ ఘనతను సాధించిన ప్రపంచంలోని మొట్టమొదటి బ్రాండ్ అరెట్టో. దీనికి భారత ప్రభుత్వం నుంచి పేటెంట్‌ను పొందింది ఆ కంపెనీ. అలాగే యూకే, యూఎస్‌ఏ, జపాన్‌తో సహా 20 కంటే ఎక్కువ దేశాల్లోనూ పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది.
ఎనిమిది నెలల్లో రూ.80 లక్షలకుపైగా
గతేడాది ఆయన ప్రారంభించిన ఫుట్‌వేర్ బ్రాండ్ అరెట్టో కేవలం ఎనిమిది నెలల్లోనే 6,000 యూనిట్లకు పైగా విక్రయించి రూ.80 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. తమ బ్రాండ్ షూ తయారీకి థర్మోప్లాస్టిక్ రబ్బర్ రీసైకిల్ మెటీరియల్, స్థానికంగా లభించే త్రీడీ అల్లికల మెటీరియల్‌ని ఉపయోగిస్తున్నారు. సత్యజిత్ పుణెలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి చెందిన చిన్ననాటి స్నేహితురాలు, క్లాస్‌మేట్ అయిన కృతిక లాల్‌ను సహ వ్యవస్థాపకురాలిగా చేర్చుకున్నారు.
అరెట్టో 0-2, 5-7, 5-9 సంవత్సరాల వయసు పిల్లలకు బూట్లను అందిస్తోంది. ఇప్పుడు ఎక్కువగా ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నప్పటికీ, త్వరలో ఆఫ్‌లైన్ స్టోర్‌లను ప్రారంభించాడానికి కంపెనీ కసరత్తు చేస్తోంది. ఈ బ్రాండ్ షూలు తొమ్మిది స్టైల్స్, ఐదు సైజులు, నాలుగు కేటగిరీల్లో అందుబాటులో ఉన్నాయి. డిజైన్‌ను బట్టి ధరలు రూ.1,699 నుంచి రూ.2,899 వరకు ఉంటాయి. ఈ బ్రాండ్ బూట్లు 18 మిల్లీ మీటర్ల వరకు విస్తరించవచ్చు. వారి అమ్మకాలలో ఎక్కువ భాగం వారి వెబ్‌సైట్ ద్వారా వస్తాయి. వారు ఇటీవల నైకాలో కూడా అమ్మడం ప్రారంభించారు. ఇవికాక పిల్లల కార్నివాల్‌లు, పిల్లల షూ ప్రదర్శనలు, పాఠశాల, ఇతర పాప్-అప్ ఈవెంట్‌లలో పాల్గొంటారు.
అరెట్టో కంటే ముందు, సత్యజిత్ స్క్వాట్ ఈజ్ అనే బ్రాండ్‌ను స్థాపించారు. ఇది భారతీయ టాయిలెట్‌లను సులభంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఈ వెంచర్ అతనికి కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు..
Comments
Please login to add a commentAdd a comment