develops
-
బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు.. చిన్నప్పుడు పడిన ఇబ్బందే ప్రేరణ!
Satyajith Mittal: చిన్న పిల్లల బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు మిట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ గ్రాడ్యుయేట్ సత్యజిత్ మిట్టల్. చిన్నప్పుడు తాను పడిన ఇబ్బంది వేరే పిల్లలు పడకూడదన్న ఉద్దేశంతో వినూత్న షూ రూపొందించి విజయవంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న పిల్లల పాదాలకు అనుగుణంగా విస్తరించగలిగే వినూత్న బూట్ల శ్రేణి మ్యాజిక్ షూను అభివృద్ధి చేసింది ఆయన స్థాపించిన షూ కంపెనీ అరెట్టో (Aretto). ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! చిన్నప్పుడు పడిన ఇబ్బందే.. మ్యాజిక్ షూ ఆవిష్కరణ కోసం సత్యజిత్‌కు తన చిన్ననాటి అనుభవం ప్రేరణనిచ్చింది. చిన్నప్పుడు తన అన్నయ వాడిన బూట్లను సత్యజిత్‌కు ఇచ్చేవారు. అయితే ఆ బూట్లు సత్యజిత్‌కు చాలా వదులు అయ్యేవి. దాంతో నడవడానికి ఆయన చాలా ఇబ్బంది పడేవారు. అప్పటి నుంచి మంచి నాణ్యత గల బూట్లు ధరించాలని ఎప్పుడూ కలలు కనేవాడు. ఆ సమయంలో భారతదేశంలో అవి చాలా తక్కువగా ఉండేవి. ప్రతి ముగ్గురిలో ఒకరు తమ చిన్నతనంలో ఏదో ఒక సమయంలో తమకు సరిపోని సైజు షూ ధరించి ఇబ్బందులు పడినవాళ్లు ఉంటారు. పిల్లలు పెరిగేకొద్దీ వారి పాదాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు కొన్ని రోజులకే ఎక్కువ జతల బూట్లు కొనాల్సి వస్తోంది. ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం కనుక్కున్నారు సత్యజిత్. పెరుగుతున్న పాదాల సైజ్‌కు అనుగుణంగా విస్తరించే మ్యాజిక్ షూను రూపొందించారు. ఇది మధ్యతరగతి కుటుంబాలకు తల్లిదండ్రులకు మేలు కలిగిస్తోంది. ఇవి కొంటే పదే పదే కొత్త బూట్లు కొనాల్సిన అవసరం ఉండదు. నిరంతర పరిశోధనలు, పోడియాట్రిస్ట్ (పాదాలకు సంబంధించిన వైద్య నిపుణులు)లతో సంప్రదింపుల ద్వారా సత్యజిత్ పిల్లల పాదాల అనాటమీ గురించి లోతైన అవగాహన పొందాడు. వారి పాదాలు పెద్దలకు భిన్నంగా ఉంటాయని, వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన బూట్లు అవసరమని గ్రహించాడు. ఈ జ్ఞానంతో రెండేళ్ల పాటు కష్టపడి మ్యాజిక్ షూను రూపొందించాడు. ఈ ఘనతను సాధించిన ప్రపంచంలోని మొట్టమొదటి బ్రాండ్ అరెట్టో. దీనికి భారత ప్రభుత్వం నుంచి పేటెంట్‌ను పొందింది ఆ కంపెనీ. అలాగే యూకే, యూఎస్ఏ, జపాన్‌తో సహా 20 కంటే ఎక్కువ దేశాల్లోనూ పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది. ఎనిమిది నెలల్లో రూ.80 లక్షలకుపైగా గతేడాది ఆయన ప్రారంభించిన ఫుట్‌వేర్ బ్రాండ్ అరెట్టో కేవలం ఎనిమిది నెలల్లోనే 6,000 యూనిట్లకు పైగా విక్రయించి రూ.80 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. తమ బ్రాండ్ షూ తయారీకి థర్మోప్లాస్టిక్ రబ్బర్ రీసైకిల్ మెటీరియల్, స్థానికంగా లభించే త్రీడీ అల్లికల మెటీరియల్‌ని ఉపయోగిస్తున్నారు. సత్యజిత్ పుణెలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి చెందిన చిన్ననాటి స్నేహితురాలు, క్లాస్మేట్ అయిన కృతిక లాల్‌ను సహ వ్యవస్థాపకురాలిగా చేర్చుకున్నారు. అరెట్టో 0-2, 5-7, 5-9 సంవత్సరాల వయసు పిల్లలకు బూట్లను అందిస్తోంది. ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్లో విక్రయిస్తున్నప్పటికీ, త్వరలో ఆఫ్‌లైన్ స్టోర్లను ప్రారంభించాడానికి కంపెనీ కసరత్తు చేస్తోంది. ఈ బ్రాండ్ షూలు తొమ్మిది స్టైల్స్, ఐదు సైజులు, నాలుగు కేటగిరీల్లో అందుబాటులో ఉన్నాయి. డిజైన్‌ను బట్టి ధరలు రూ.1,699 నుంచి రూ.2,899 వరకు ఉంటాయి. ఈ బ్రాండ్ బూట్లు 18 మిల్లీ మీటర్ల వరకు విస్తరించవచ్చు. వారి అమ్మకాలలో ఎక్కువ భాగం వారి వెబ్సైట్ ద్వారా వస్తాయి. వారు ఇటీవల నైకాలో కూడా అమ్మడం ప్రారంభించారు. ఇవికాక పిల్లల కార్నివాల్‌లు, పిల్లల షూ ప్రదర్శనలు, పాఠశాల, ఇతర పాప్-అప్ ఈవెంట్లలో పాల్గొంటారు. అరెట్టో కంటే ముందు, సత్యజిత్ స్క్వాట్ ఈజ్ అనే బ్రాండ్‌ను స్థాపించారు. ఇది భారతీయ టాయిలెట్లను సులభంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఈ వెంచర్ అతనికి కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. -
డీఆర్డీవో శానిటైజర్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌పై యుద్ధంలో డీఆర్డీవో మరో ముందడుగు వేసింది. వేర్వేరు ఉపరితలాల నుంచి వైరస్‌లను తొలగించేందుకు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో శానిటైజింగ్ యంత్రాలను అభివృద్ధి చేసింది. ఢిల్లీలోని డీఆర్డీవో సంస్థ ‘ద సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (సీఎఫ్ఈఈఎస్)’అభివృద్ధి చేసిన ఈ యంత్రాల్లో ఒకటి అవసరమైన చోటుకు మోసుకెళ్లేది కాగా, రెండోది చక్రాలపై ఉంచి తరలించగలిగేది. మంటలు ఆర్పేందుకు పనికొచ్చే యంత్రాలను రీడిజైనింగ్ చేయడం ద్వారా తాము ఈ శానిటైజింగ్ యంత్రాలను అభివృద్ధి చేసినట్లు డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. పోర్టబుల్ యంత్రం ద్వారా ఒక శాతం హైపోక్లోరైట్ ద్రావణాన్ని చల్లవచ్చని, బ్యాక్‌ప్యాక్ ద్వారా తీసుకెళ్లగలమని వివరించింది. గాలితోపాటు ద్రావణాన్ని కూడా చేర్చి స్ప్రే చేయడం దీని ప్రత్యేకతని తెలిపింది. ఒక యంత్రం ద్వారా దాదాపు 300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో శానిటైజేషన్ చేపట్టవచ్చని పేర్కొంది. చక్రాలపై ఉంచి తరలించగల రెండో యంత్రంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని మాత్రమే పొగమంచు మాదిరిగా మార్చి పిచికారీ చేసేందుకు ఏర్పాట్లు ఉంటాయని తెలిపింది. ఒక్కోటి 3,000 చదరపు మీటర్ల విస్తీర్ణాన్నిశుభ్రం చేయగలదని వివరించింది. 50 లీటర్ల ద్రావణాన్ని నింపుకోగల ట్యాంకు ఇందులో ఉంటుందని.. 12నుంచి 15 మీటర్ల దూరం వరకూ పిచికారీ చేయవచ్చని తెలిపింది. ఢిల్లీ పోలీసులకు ఇప్పటికే ఈ యంత్రాలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. -
వరి ఉత్పత్తిలో రికార్డ్ సృష్టించిన చైనా శాస్త్రవేత్త
-
పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చండి
అనంతపురం అర్బన్ : అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పారిశుద్ధ్య కల్పనలో అనంతపురం జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కలెక్టర్ కోన శశిధర్... ప్రత్యేక అధికారులకు సూచించారు. ఆదివారం రాత్రి కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో పారిశుద్ధ్య మెరుగుదలపై జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్‌తో కలిసి ప్రత్యేక అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అవరోధానల్లోనూ అవకాశాలను వెతుక్కుని సానుకూల ఫలితాలు సాధించినప్పుడే ప్రజల్లో నమ్మకాన్ని పెంచగలమన్నారు. ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన డివిజన్లలో పర్యటించి గుర్తించిన పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులు, ఇతరాత్ర అవసరమైన వాటిని కమిషనర్‌కు తెలియజేయాలన్నారు. కార్పొరేటర్ల సహకారం తీసుకోవాలన్నారు. డివిజన్లలో జ్వరాలతో బాధపడుతున్న వారి వివరాలను కంట్రోల్ వెంటనే అందించాలన్నారు. సమాచారం అందుకున్న వెంటనే వైద్యాధికారులను అక్కడికి పంపిచాలని డీఎంహెచ్ఓని ఆదేశించారు. అవసరమైతే అక్కడక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. మునిసిపల్ కార్పొరేషన్‌లోని ఉద్యోగులు, సిబ్బందికి బయోమెట్రిక్‌ను వారంలోగా ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ మల్లీశ్వరిదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డెంగీపై అప్రమత్తంగా ఉండండి జిల్లావ్యాప్తంగా డెంగీ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. విషజ్వరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. జరగరానిది జరిగితే అందుకు బాధ్యులైన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో డీఎంహెచ్ఓ వెంకటరమణ, అధికారులతో సమీక్షించారు. అధికారులు అందజేసిన నివేదికలను పరిశీలించారు. సమావేశంలో ఆరోగ్య అధికారులు దోసారెడ్డి, జయమ్మ పాల్గొన్నారు. -
ఐక్యతతో అన్ని రంగాల్లో విజయం
ధర్మవరం అర్బన్ : ఈడిగ కులస్తులందరూ ఐకమత్యంతో కదిలితే అన్ని రంగాల్లో విజయం మనదే.. రాజకీయంగా ఈడిగలు రాణించాలంటే కలసికట్టుగా ఉద్యమించినప్పుడే రాజకీయంగా, సామాజికంగా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామని ఈడిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బి.కిరణ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ఆదివారం ధర్మవరంలోని ఎన్జీవో హోంలో ఈడిగ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీశైలం సుధాకర్‌గౌడ్ అధ్యక్షతన ప్రతిభగల ఈడిగ విద్యార్థినీవిద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. ముఖ్య అతిథి, జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌గౌడ్, డైట్ ప్రిన్సిపల్ మునెయ్య, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరిబాబుగౌడ్, జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శంకర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, శ్రీ రేణుకా ఎల్లమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు పాలచెర్ల ఆదినారాయణ, కార్యదర్శి నాగేశ్వరరావు, ఈడిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పి.జి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పదో తరగతి, ఇంటర్లో ఈడిగ విద్యార్థినీ విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపారన్నారు. వారికి సర్టిఫికెట్, మెమెంటోతోపాటు నగదు బహుమతులు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థినీవిద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌గౌడ్‌ను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం నాయకులు, ఈడిగ ఉద్యోగస్తుల సంఘం, ఈడిగ సంక్షేమ సంఘం నాయకులు, కులస్థులు పాల్గొన్నారు. -
'23 కోట్లతో బస్ స్టేషన్ల ఆధునీకరణ'
తాండూరు: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల్లోని ఆర్టీసీ బస్ స్టేషన్లను ఆధునీకరించనున్నట్టు రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లా తాండూరు బస్టాండ్ ఆధునీకరణ పనులను ఆయన ప్రారంభించారు. తాండూరు నుంచి గానుగాపూర్ నూతన బస్సు సర్వీసు ప్రారంభించారు. 10 జిల్లాల్లోని 95 డిపోల పరిధిలో ఉన్న బస్టాండ్లను రూ.23 కోట్ల నిధులతో ఆధునీకరించనున్నట్టు మహేందర్‌రెడ్డి చెప్పారు. -
ప్రశాంత రాష్ట్రంతోనే అభివృద్ధి: కిరణ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రశాంత పరిస్థితుల్లో ఉండే రాష్ట్రమే అభివృద్ధికి బాటలు వేయగలుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నిరుపేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించేందుకు కృషి చేస్తున్న తమ ప్రభుత్వానికి ప్రగతి ప్రయాణంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 67వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకలకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో, మత సామరస్యాన్ని కాపాడటంలో రాజీలేకుండా ముందుకు వెళుతున్నామన్నారు. నిజాయితీ, పారదర్శకమైన పాలన ద్వారా అన్ని రంగాల్లో ప్రగతిని సాధించి, ప్రతి ఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని, ఏ పథకం అమలు చేసినా పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామని చెప్పారు. భగవంతుని దయ వల్ల రాష్ట్రంలో ముందుగానే మంచి వర్షాలు పడినందున ఖరీఫ్ సీజన్లో మంచి పంటలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జలాశయాలన్నీ పూర్తిగా నిండాయని, విద్యుత్ పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని చెప్పారు. గత తొమ్మిదేళ్లలో ఈ ఏడాది తలసరి ఆదాయం జాతీయసగటు కన్నా ఎక్కువగా నమోదయిందని, జాతీయ స్థాయిలో పేదరికం శాతం 21.9గా ఉంటే మన రాష్ట్రంలో 9.2 శాతానికి తగ్గిందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టం తెచ్చి ఆయా వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డా బంగారుతల్లి కావాలనే ఉద్దేశంతో బంగారు తల్లి అనే పథకాన్ని ప్రారంభించామని, ఇప్పటివరకు ఈ పథకం కింద 50వేల మందిని నమోదు చేసుకున్నామని చెప్పారు. ఎవరు అధికారంలో ఉన్నా ఈ పథకాన్ని అమలుచేసి తీరాలనే లక్ష్యంతో పథకానికి చట్టబద్ధత కూడా కల్పించామన్నారు. ఇందిరమ్మ బాటలో ఇచ్చిన హామీలలో ఎక్కువ శాతం నెరవేర్చామని, మిగిలినవి త్వరలోనే నెరవేరుస్తామన్నారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ.16,500 కోట్లను రుణాలుగా ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. పారిశ్రామిక పెట్టుబడుల్లో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానానికి చేరుకుందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మంత్రులు బొత్స సత్యనారాయణ, దానం నాగేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, డీజీపీ దినేశ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక శాఖ శకటానికి మొదటి బహుమతి స్వాతంత్య్రదిన వేడుకల సందర్భంగా రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను తెలిపేవిధంగా ప్రదర్శించిన శకటాల్లో సాంస్కృతిక శాఖకు మొదటి బహుమతి లభించింది. అటవీశాఖ, ఉద్యానశాఖల శకటాలకు ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి. మహిళ, శిశు సంక్షేమ శాఖ శకటానికి ప్రోత్సాహక బహుమతి లభించింది. పరేడ్‌కు సంబంధించి సాయుధ విభాగంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏపీఎస్పీ 16వ బెటాలియన్, సాధారణ విభాగంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల విద్యార్థులకు మొదటి బహుమతులు లభించాయి. నేషనల్ గ్రీన్ కాప్స్ విద్యార్థులు ప్రోత్సాహక బహుమతికి ఎంపికయ్యారు. విధి నిర్వహణలో విశిష్ట సేవలందించిన పోలీసు అధికారులు, సిబ్బంది పలువురికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం పతకాలను బహూకరించారు. పాపం.. ఎస్సీ గురుకులాల విద్యార్థులు: వేడుకల సందర్భంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీకి చెందిన 600 మంది విద్యార్థులు ‘భారతీయం’ పేరిట ప్రత్యేక ప్రదర్శనకు సిద్ధమయ్యారు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో వర్షం మొదలైంది. అయినప్పటికీ తమ నెలరోజుల సాధనను ప్రదర్శించి సీఎం అభినందనలు పొందాలన్న ఆశతో ఆ చిన్నారులందరూ వర్షంలో తడుస్తూనే ఆయన ప్రసంగాన్ని విన్నారు. సీఎం ప్రసంగం అయిపోగానే చిన్నారులు నృత్య రూపకాన్ని అరగంటపాటు వర్షంలోనే ప్రదర్శించారు. సీతాకోక చిలుకలను తలపించే ఆకర్షణీయమైన దుస్తులు ధరించిన చిన్నారులు చేసిన ఈ ప్రదర్శన ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. కానీ సీఎం తన ప్రసంగం ముగియగానే నిష్ర్కమించడంతో చిన్నారుల ఆశలు ఆవిరయ్యాయి.