అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పారిశుద్ధ్య కల్పనలో అనంతపురం జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కలెక్టర్ కోన శశిధర్... ప్రత్యేక అధికారులకు సూచించారు.
అనంతపురం అర్బన్ : అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పారిశుద్ధ్య కల్పనలో అనంతపురం జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కలెక్టర్ కోన శశిధర్... ప్రత్యేక అధికారులకు సూచించారు. ఆదివారం రాత్రి కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో పారిశుద్ధ్య మెరుగుదలపై జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్‌తో కలిసి ప్రత్యేక అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అవరోధానల్లోనూ అవకాశాలను వెతుక్కుని సానుకూల ఫలితాలు సాధించినప్పుడే ప్రజల్లో నమ్మకాన్ని పెంచగలమన్నారు. ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన డివిజన్లలో పర్యటించి గుర్తించిన పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
కార్మికులు, ఇతరాత్ర అవసరమైన వాటిని కమిషనర్‌కు తెలియజేయాలన్నారు. కార్పొరేటర్ల సహకారం తీసుకోవాలన్నారు. డివిజన్లలో జ్వరాలతో బాధపడుతున్న వారి వివరాలను కంట్రోల్ వెంటనే అందించాలన్నారు. సమాచారం అందుకున్న వెంటనే వైద్యాధికారులను అక్కడికి పంపిచాలని డీఎంహెచ్‌ఓని ఆదేశించారు. అవసరమైతే అక్కడక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. మునిసిపల్ కార్పొరేషన్‌లోని ఉద్యోగులు, సిబ్బందికి బయోమెట్రిక్‌ను వారంలోగా ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ మల్లీశ్వరిదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
డెంగీపై అప్రమత్తంగా ఉండండి
జిల్లావ్యాప్తంగా డెంగీ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. విషజ్వరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. జరగరానిది జరిగితే అందుకు బాధ్యులైన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, అధికారులతో సమీక్షించారు. అధికారులు అందజేసిన నివేదికలను పరిశీలించారు. సమావేశంలో ఆరోగ్య అధికారులు దోసారెడ్డి, జయమ్మ పాల్గొన్నారు.