ఉద్యోగమంటే ఏమనుకున్నావ్ ?
– ఉద్యోగం మాని రాజకీయాలు చేసుకో..
– కమిషనర్ సురేంద్రపై జిల్లా కలెక్టర్ కోనశశిధర్ ఫైర్
– బిల్లుల చెల్లింపు, కార్యాలయం ఫైళ్లపై విచారణ చేపట్టండి
– పబ్లిక్‌హెల్త్ ఎస్‌ఈ, ఆర్‌డీఎంఏకు ఆదేశం
అనంతపురం న్యూసిటీ/అర్బన్ : ‘అంతా నీ ఇష్టారాజ్యమైంది. నగర పాలక సంస్థని భ్రష్టు పట్టిస్తున్నావ్. బిల్లులు చేయవద్దని చెప్పినా ఎందుకు చేశావ్? ఉద్యోగం మానేసి రాజకీయాలు చేసుకో. నీవు ఈఈ మాత్రమే. నీపై అధికారి ఎస్‌ఈ అందుబాటులో ఉన్నారు. ఇన్‌చార్జి కమిషనర్ కమిషనర్‌గా నీవు ఉండటం కరెక్ట్ కాదు. ఎస్‌ఈ ఉండగా నిన్నెలా కొనసాగిస్తున్నారు... ఈ – ప్రొక్యూర్‌మెంట్ బిల్లులు మినహా ఏ తరహా బిల్లులు చేయవద్దని ఇదివరకే నీకు చెప్పాను. అయినా ఎలా చేశావ్. ఉద్యోగమంటే ఏమనుకున్నావ్. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన నిన్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదు’’ అంటూ కలెక్టర్ కోన శశిధర్ నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ సురేంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతిపై సాక్షి పత్రికలో గత కొన్ని రోజులుగా ప్రచురితమైన కథనాలపై కలెక్టర్ స్పందించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ బుధవారం రెవెన్యూభవన్‌లో జేసీ లక్ష్మీకాంతం, ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్ మునిసిపల్ ఆర్‌డీ విజయలక్ష్మిలో కలిసి కమిషనర్ సురేంద్రబాబు, ఎస్‌ఈ సత్యనారాయణ, సిబ్బందితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిపార్ట్‌మెంట్ పనులకు ఏవిధంగా బిల్లులిచ్చావని కమిషనర్‌ను ప్రశ్నించారు. టెండర్ పనులు మినహా మిగితా వాటిని ఇవ్వలేదని ఆయన సమాధానం ఇచ్చారు. సీనియారిటీ ప్రాతిపదికన బిల్లులిచ్చావా అని ఆరా తీయగా, అందుకు కమిషనర్ అవునని సమాధానం ఇచ్చారు. అకౌంటెంట్ దేవశంకర్‌ను ఆరా తీస్తే డిస్‌ఆర్డర్‌లో ఇచ్చామని చెప్పారు.
దీంతో కమిషనర్‌పై కలెక్టర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఈ, ఎస్‌ఈ, కమిషనర్‌గా నీవే సంతకాలు చేసి, సరైన సమాధానం ఇవ్వకపోతే ఎలాగని ప్రశ్నించారు. బిల్లులు విచారణ జరిపిన తర్వాత ఇవ్వమని చెబితే రూ. కోట్ల బిల్లులు ఏవిధంగా ఇచ్చావని ధ్వజమెత్తారు. అందుకు కమిషనర్ నోట మాట రాలేదు. ఇక నుంచి నగరపాలక సంస్థలో బాక్స్‌టెండర్, నామినేషన్ పనులు వద్దన్నారు. ఈ ప్రొక్యూర్మెంట్, ఎమర్జెన్సీ, శానిటేషన్, డీజిల్, విద్యుత్ పనులకు మాత్రమే బిల్లులు చేయాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన బిల్లుల చెల్లింపుపై విచారణ చేయాలని పబ్లిక్‌హెల్త్ ఎస్‌ఈ శ్రీనాథ్‌రెడ్డిని ఆదేశించారు. కార్యాలయం ఫైళ్లపై విచారణ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని మునిసిపల్ ఆర్‌డీ విజయలక్ష్మిని ఆదేశించారు. ఫైళ్లను గంటలోపు మునిసిపల్ ఆర్‌డీ, పబ్లిక్‌హెల్త్ ఎస్‌ఈకు అందజేయాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. ఇన్‌చార్జ్ కమిషనర్‌గా ఉన్న నీవు కమిషనర్ వాహనాన్ని ఏవిధంగా వినియోగిస్తావని ప్రశ్నించారు.
తేడాలొస్తే ఇంటికి పంపిస్తా
నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వర్తిస్తూ, కార్పొరేషన్ పరువును తీస్తున్నారంటూ కమిషనర్, అధికారులు, సిబ్బందిపై కలెక్టర్ మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చేస్తే ఎంతటి వారినైనా ఇంటికి పంపిస్తానని హెచ్చరించారు. పారిశుద్ధ్య పనులు సక్రంగా నిర్వహించని కారణంగా నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తే రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.