surendrababu
-
ఆర్టీసీ బదిలీల్లో అయిన వారికే అందలం!
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో ఇటీవల జరిగిన డిపో మేనేజర్ల బదిలీల్లో భారీగా పైరవీలు చోటు చేసుకున్నాయనే విమర్శలొస్తున్నాయి. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు హయాంలోనైనా పారదర్శకంగా బదిలీలు జరుగుతాయని భావించిన అధికారులకు ఇటీవల జరిగిన ఈ బదిలీలు నిరాశే మిగిల్చాయి. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులున్న వారిని అందలమెక్కించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీర్ఘకాలంగా ఒకే జోన్లో విధులు నిర్వహిస్తున్న వారికి..నిబంధనలకు విరుద్ధంగా అదే జోన్లో మళ్లీ పోస్టింగులివ్వడమే ఇందుకు నిదర్శనమని కొంతమంది అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా ఆర్టీసీలో 32 మంది డిపో మేనేజర్లకు స్థాన చలనం కల్పించారు. ఈ బదిలీల్లో అధికార పార్టీ నేతల సిఫార్సులకే ప్రాధాన్యత ఇచ్చారని ఆర్టీసీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సాధారణంగా బదిలీలు చేసేటప్పుడు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఎలాంటి కౌన్సిలింగ్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఐదుగురు డీఎంలకు ఒకే జోన్లో పోస్టింగులివ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎండీ సురేంద్రబాబుకు తెలియకుండా ఓ ఉన్నతాధికారి రాజకీయ పైరవీలకు ప్రాధాన్యత ఇచ్చారని, తన వర్గం వారికి పోస్టింగులిచ్చారని ప్రచారం జరుగుతోంది. విజయవాడ చుట్టుపక్కల విధులు నిర్వహించిన డిపో మేనేజర్లు కార్పొరేట్ కార్యాలయంలో పోస్టింగులు దక్కించుకోవడమే ఇందుకు నిదర్శనం. డీఎంల బదిలీలతో పాటు 12 మంది సూపర్వైజర్లకు పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతుల్లోనూ నచ్చిన వారికి ఇష్టం వచ్చిన చోట పోస్టింగులిచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీలో డీఎంలు, డీవీఎంల బదిలీల్లో దీర్ఘకాలం పాటు ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారిని జోన్ మార్చి పోస్టింగులిస్తామని ముందు యాజమాన్యం ప్రకటించినా.. ఆ తర్వాత అవేమీ పట్టించుకోలేదు. డీవీఎంల బదిలీల్లోనూ పైరవీలు.. ప్రస్తుతం డివిజనల్ మేనేజర్ల బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఈ డీవీఎంల బదిలీల్లోనూ పైరవీలు ప్రారంభమైనట్లు సమాచారం. మంత్రి పేషీ రంగంలోకి దిగి వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉన్నతాధికారులు ఆర్టీసీ ఎండీని తప్పుదోవ పట్టిస్తున్నారని, వాస్తవాలు దాచి బదిలీల్లో తమ వర్గం వారికి న్యాయం చేసేలా వ్యవహారాలు నెరపుతున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చర్చలు విఫలం..ఆర్టీసీలో సమ్మె సైరన్
-
ఆర్టీసీలో సమ్మె సైరన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో(ఏపీఎస్ఆర్టీసీ) సమ్మె సైరన్ మోగనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు సై అంటున్నారు. సమ్మె తేదీలను బుధవారం ప్రకటిం చాలని నిర్ణయించారు. మంగళవారం విజయవాడలో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు, ఈడీలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మెకు సిద్ధమవు తున్నామని చర్చల అనంతరం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైవీ రావు, పలిశెట్టి దామోదరరావు మీడియాకు తెలియచేశారు. కార్మికులను రెచ్చగొట్టేలా యాజమాన్యం నిర్ణయాలు ఫిట్మెంట్ 50 శాతం ఇవ్వాలని తాము కోరుతుండగా, 20 శాతానికి మించి ఇచ్చేది లేదంటూ ఆర్టీసీ యాజమాన్యం మొండికేయడాన్ని ఉద్యోగులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీలో నష్టాలకు ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలే కారణమని, నష్టాలు, అప్పులను ప్రభుత్వమే భరించాలని ఉద్యోగులు తేల్చిచెబుతున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల కంటే కేటగిరీల వారీగా 20 నుంచి 30 శాతం తక్కువ జీతభత్యాలతో పనిచేస్తున్నామని, అయినా సర్కారు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. వేతన సవరణలో ఉన్న డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే ఆర్టీసీలోని ఎనిమిది సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడ్డాయని, ఎన్ఎంయూని కూడా కలుపుకుని ముందుకు వెళ్తామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం సమ్మె తేదీని ప్రకటించేందుకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో చేపట్టబోయే సమ్మె సన్నాహక షెడ్యూల్‌ను కూడా ప్రకటించాలని నిర్ణయించారు. యాజమాన్యం ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు సంస్థలో సిబ్బందిని కుదించేలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని నేతలు ఆరోపిస్తున్నారు. సెక్యూరిటీ, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల్లో సిబ్బందిని తగ్గించడం, యూనియన్‌కు ఇచ్చే రాయితీలను రద్దు చేయడం వంటి చర్యలు కార్మికులను రెచ్చగొట్టేలా ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వం ఫిట్మెంట్ తదితర డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించకపోతే సమ్మె తప్పదని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మంగళవారం జరిగిన చర్చల్లో ఎంప్లాయీస్ యూనియన్ పే కమిటీ సభ్యులు వైవీ రావు, ఎం హనుమంతరావు, పి.సుబ్రహ్మణ్యం రాజు, ఆవుల ప్రభాకర్, జీవీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
సంక్రాంతికి సమ్మె తప్పదు!
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. సంక్రాంతి పండక్కి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. జనవరి 4 తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసి ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలతో ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎంప్లాయిస్ యూనియన్ నేతలు సోమవారం ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, ఎండీ సురేంద్రబాబులను కలిసి సమ్మె నోటీసును అందించారు. జనవరి 13 తర్వాత సమ్మెకు వెళతామని యాజమాన్యానికి తేల్చి చెప్పడంతో యాజమాన్యం ఆందోళన చెందుతోంది. ఆర్టీసీ కార్మికులకు ప్రతి నాలుగేళ్లకోమారు జరగాల్సిన వేతన సవరణ 2017 ఏప్రిల్ 1 నుంచి జరగలేదు. అప్పట్లో యాజమాన్యం ఆర్టీసీ నష్టాలను సాకుగా చూపి 19% మధ్యంతర భృతితో సరిపెట్టారు. వేతన సవరణ గడువు దాటి 17 నెలలు కావడం, ఇప్పటికే చర్చలు పలుమార్లు వాయిదా పడటంతో కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుండటంపై కార్మికులు మండిపడుతున్నారు. ఫిట్మెంట్ 50% ఇవ్వాల్సిందేనని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఎంప్లాయిస్ యూనియన్ నేతలు సమ్మె నోటీసిచ్చారు. ఈ నోటీసుకు ఆర్టీసీలో మిగిలిన సంఘాలు మద్దతు ప్రకటించాయని ఈయూ నేతలు ప్రకటించారు. అయితే జనవరి 3న ఆర్టీసీ యాజమాన్యం ఈయూ నేతలతో వేతన సవరణపై చర్చలు జరపనుంది. సమ్మె నోటీసులో 18 డిమాండ్లు ఈయూ నేతలు ఇచ్చిన సమ్మె నోటీసులో 18 డిమాండ్లు ఉన్నాయి. ఫిట్మెంట్ 50 శాతంతో పాటు అలవెన్సులు వంద శాతం ఇవ్వాలని, డీజిల్ కొనుగోలుకు రాయితీ, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సిబ్బంది కుదింపు చర్యలు ఉపసంహరించుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. యాజమాన్యం రెండ్రోజుల్లో చర్చలు జరిపేందుకు హామీ ఇచ్చిందని, కార్మికులకు అనుకూలంగా నిర్ణయాలు లేకుంటే సమ్మె తప్పదని ఈయూ నేతలు వైవీ రావు, పద్మాకరరావులు మీడియాకు వివరించారు. జనవరి 4న ఆర్టీసీలో అన్ని సంఘాలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈయూ నేతలు ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్యను కలిసి సమ్మె నోటీసు అందించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈయూ నేతలు సమాధానమివ్వగా, సీఎం చంద్రబాబు రూ.20 కోట్లు కేటాయిద్దామని తనకు చెప్పారని వర్ల రామయ్య యూనియన్ నేతలతో వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఆర్టీసీ ఎండీగా సురేంద్రబాబు బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఎన్వి సురేంద్రబాబు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఆయనను కలసి అభినందనలు తెలిపారు. అనంతరం డీజీపీ మాలకొండయ్యతో కలసి సురేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణికులకు మంచి సేవలు అందించడానికి కృష్టి చేస్తానన్నారు. ఆర్టీసీని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముకాకుండా చూస్తానని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీగా పనిచేసిన డీజీపీ మాలకొండయ్య మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు ఎంతో సమన్వయంతో పనిచేస్తున్నారని అభినందించారు. -
ఉద్యోగమంటే ఏమనుకున్నావ్ ?
– ఉద్యోగం మాని రాజకీయాలు చేసుకో.. – కమిషనర్ సురేంద్రపై జిల్లా కలెక్టర్ కోనశశిధర్ ఫైర్ – బిల్లుల చెల్లింపు, కార్యాలయం ఫైళ్లపై విచారణ చేపట్టండి – పబ్లిక్‌హెల్త్ ఎస్ఈ, ఆర్డీఎంఏకు ఆదేశం అనంతపురం న్యూసిటీ/అర్బన్ : ‘అంతా నీ ఇష్టారాజ్యమైంది. నగర పాలక సంస్థని భ్రష్టు పట్టిస్తున్నావ్. బిల్లులు చేయవద్దని చెప్పినా ఎందుకు చేశావ్? ఉద్యోగం మానేసి రాజకీయాలు చేసుకో. నీవు ఈఈ మాత్రమే. నీపై అధికారి ఎస్ఈ అందుబాటులో ఉన్నారు. ఇన్చార్జి కమిషనర్ కమిషనర్‌గా నీవు ఉండటం కరెక్ట్ కాదు. ఎస్ఈ ఉండగా నిన్నెలా కొనసాగిస్తున్నారు... ఈ – ప్రొక్యూర్మెంట్ బిల్లులు మినహా ఏ తరహా బిల్లులు చేయవద్దని ఇదివరకే నీకు చెప్పాను. అయినా ఎలా చేశావ్. ఉద్యోగమంటే ఏమనుకున్నావ్. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన నిన్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదు’’ అంటూ కలెక్టర్ కోన శశిధర్ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ సురేంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతిపై సాక్షి పత్రికలో గత కొన్ని రోజులుగా ప్రచురితమైన కథనాలపై కలెక్టర్ స్పందించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ బుధవారం రెవెన్యూభవన్‌లో జేసీ లక్ష్మీకాంతం, ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్ మునిసిపల్ ఆర్డీ విజయలక్ష్మిలో కలిసి కమిషనర్ సురేంద్రబాబు, ఎస్ఈ సత్యనారాయణ, సిబ్బందితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిపార్ట్మెంట్ పనులకు ఏవిధంగా బిల్లులిచ్చావని కమిషనర్‌ను ప్రశ్నించారు. టెండర్ పనులు మినహా మిగితా వాటిని ఇవ్వలేదని ఆయన సమాధానం ఇచ్చారు. సీనియారిటీ ప్రాతిపదికన బిల్లులిచ్చావా అని ఆరా తీయగా, అందుకు కమిషనర్ అవునని సమాధానం ఇచ్చారు. అకౌంటెంట్ దేవశంకర్‌ను ఆరా తీస్తే డిస్ఆర్డర్లో ఇచ్చామని చెప్పారు. దీంతో కమిషనర్‌పై కలెక్టర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఈ, ఎస్ఈ, కమిషనర్‌గా నీవే సంతకాలు చేసి, సరైన సమాధానం ఇవ్వకపోతే ఎలాగని ప్రశ్నించారు. బిల్లులు విచారణ జరిపిన తర్వాత ఇవ్వమని చెబితే రూ. కోట్ల బిల్లులు ఏవిధంగా ఇచ్చావని ధ్వజమెత్తారు. అందుకు కమిషనర్ నోట మాట రాలేదు. ఇక నుంచి నగరపాలక సంస్థలో బాక్స్టెండర్, నామినేషన్ పనులు వద్దన్నారు. ఈ ప్రొక్యూర్మెంట్, ఎమర్జెన్సీ, శానిటేషన్, డీజిల్, విద్యుత్ పనులకు మాత్రమే బిల్లులు చేయాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన బిల్లుల చెల్లింపుపై విచారణ చేయాలని పబ్లిక్‌హెల్త్ ఎస్ఈ శ్రీనాథ్‌రెడ్డిని ఆదేశించారు. కార్యాలయం ఫైళ్లపై విచారణ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని మునిసిపల్ ఆర్డీ విజయలక్ష్మిని ఆదేశించారు. ఫైళ్లను గంటలోపు మునిసిపల్ ఆర్డీ, పబ్లిక్‌హెల్త్ ఎస్ఈకు అందజేయాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. ఇన్చార్జ్ కమిషనర్‌గా ఉన్న నీవు కమిషనర్ వాహనాన్ని ఏవిధంగా వినియోగిస్తావని ప్రశ్నించారు. తేడాలొస్తే ఇంటికి పంపిస్తా నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వర్తిస్తూ, కార్పొరేషన్ పరువును తీస్తున్నారంటూ కమిషనర్, అధికారులు, సిబ్బందిపై కలెక్టర్ మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చేస్తే ఎంతటి వారినైనా ఇంటికి పంపిస్తానని హెచ్చరించారు. పారిశుద్ధ్య పనులు సక్రంగా నిర్వహించని కారణంగా నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తే రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
సురేంద్రబాబు బాధ్యతల స్వీకారం
విజయవాడ సిటీ : నగర ఇన్చార్జి పోలీసు కమిషనర్‌గా ఎన్.వి. సురేంద్రబాబు బుధవారం రాత్రి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సీపీ గౌతమ్ సవాంగ్ వ్యక్తిగత కారణాలపై 13 రోజులు సెలవు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఇన్చార్జిగా సురేంద్రబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 7 గంటల సమయంలో కమిషనరేట్‌కు చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టారు. డీసీపీలు ఎల్.కాళిదాసు, జి.వి.జి.అశోక్‌కుమార్ సహా అధికారులతో సమావేశమై కమిషనరేట్ పరిస్థితులపై సమీక్షించారు. ఉదయం రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ మార్కెట్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదం గురించి అధికారులను అడిగి వివరాలు తెలసుకున్నారు. గతంలో నగర సీపీగా పనిచేసిన సురేంద్రబాబుకు ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. తన హయాంలో రౌడీలపై ఉక్కుపాదం మోపారు. సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడే వారిని అణచివేయడంలో ఆయన తనదైన ముద్ర చూపించారు. రాష్ట్రంలో నేడు కలకలం రేపుతున్న కాల్‌మనీ, వడ్డీ వ్యాపారంపై తొలుత కొరడా ఝళిపించిన వ్యక్తి సురేంద్రబాబే. అప్పట్లో ఆయన పేరు వింటేనే వడ్డీ వ్యాపారులు హడలి పోయేవారు. అధికారులకు హడల్ ముక్కుసూటిగా వ్యవహరించే సురేంద్ర బాబు అంటే అధికారులకు కూడా హడలని చెప్పొచ్చు. విధుల నిర్వహణలో అలక్ష్యం చూపే అధికారులు, సిబ్బందిపై కఠిన వైఖరి అవలంభిస్తారనే పేరు ఆయనకు ఉంది. -
రెండు రోజులే..
ముమ్మరంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు అధికారుల హైరానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి ఇంకా రెండు రోజులు మాత్రమే గడువుండడంతో అధికారులు నానా హైరానా పడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులు విజయవాడ చేరుకుని సమీక్షల మీద సమీక్షలు జరుపుతుండడంతో గెస్ట్‌హౌస్‌ల్లో సందడి నెలకొంది. సాక్షి, విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారానికి ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో అధికారులు హైరానా పడుతున్నారు. రాజధాని నుంచి ఉన్నతాధికారులు చేరుకుని సమీక్షలు జరుపుతుండటంతో గెస్ట్‌హౌస్‌లు అధికారులతో కళకళలాడుతున్నాయి. విజయవాడలో పలు సమీక్షా సమావేశాలు జరిగాయి. గురువారం అడిషనల్ డీజీలు ఎన్వీ సురేంద్రబాబు, దామోదర్ గౌతమ్ సవాంగ్, ఎన్డీఆర్ఎఫ్ అధికారి మహబుబ్ తదితరులు వచ్చారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వీవీఐపీలు వస్తుండటంతో పోలీస్ అధికారులు ముందస్తు భద్రత ఏర్పాట్లు చేపట్టారు. వీఐపీల భద్రత నిమిత్తం విమానాశ్రయ ఆవరణలో తాత్కాలికంగా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు క్యాంపు కార్యాలయం విజయవాడ స్టేట్‌గెస్ట్‌హౌస్‌కు మారవచ్చనే వార్తలు వస్తుండటంతో అధికారులు గెస్ట్‌హౌస్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతులు వేగవంతం చేశారు. కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న స్టేట్ గెస్ట్‌హౌస్ 3వ బ్లాక్‌లో నూతన సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తే భద్రతా పరంగా బాగుంటుందని పోలీసు ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్న అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాణస్వీకారానికి గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానాల ద్వారా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు చేరుకోనుండటంతో వారికి నగరంలో స్టార్ హోటళ్లతో పాటు స్టేట్ గెస్ట్‌హౌస్, ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో బస ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు... అధికారులకు ప్రోటోకాల్, వారికి బస చేసేందుకు ఏర్పాటు చేసిన హోటళ్లు, అతిథి గృహాలు తదితర సమాచారం కోసం శుక్రవారం నుంచి కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు గుంటూరు వెళ్లే రహదారులలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద క్రేన్లను ఉంచాలని నిర్ణయించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ దాన కిషోర్ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో కృష్ణా, గుంటూరు జిల్లాల సమాచార శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోవైపు ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ డీ శ్యాంబాబు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఈ నెల 7, 8 తేదీలలో హాజరుకానున్న ప్రముఖుల ప్రోటోకాల్ ఏర్పాట్లపై లైజనింగ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం జరిపారు. రాష్ట్ర స్థాయి అధికారి నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దుర్గగుడిలోనూ ప్రత్యేక ఏర్పాట్లు... ఈ నెల 8వ తేదీ రాష్ర్ట ముఖ్యమంత్రి హోదాలో నారాచంద్రబాబునాయుడు అమ్మవారి దర్శనానికి విచ్చేయనుండటంతో దుర్గగుడి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంతో పాటు పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతర వీఐపీలు అమ్మవారి దర్శనానికి విచ్చేసే అవకాశం ఉండటంతో వారికి ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లను గురువారం ఆలయ ఈవో త్రినాధరావు ఇంజనీరింగ్, వైదిక కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.