సాక్షి, అమరావతి: ఆర్టీసీలో ఇటీవల జరిగిన డిపో మేనేజర్ల బదిలీల్లో భారీగా పైరవీలు చోటు చేసుకున్నాయనే విమర్శలొస్తున్నాయి. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు హయాంలోనైనా పారదర్శకంగా బదిలీలు జరుగుతాయని భావించిన అధికారులకు ఇటీవల జరిగిన ఈ బదిలీలు నిరాశే మిగిల్చాయి. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులున్న వారిని అందలమెక్కించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీర్ఘకాలంగా ఒకే జోన్‌లో విధులు నిర్వహిస్తున్న వారికి..నిబంధనలకు విరుద్ధంగా అదే జోన్‌లో మళ్లీ పోస్టింగులివ్వడమే ఇందుకు నిదర్శనమని కొంతమంది అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా ఆర్టీసీలో 32 మంది డిపో మేనేజర్లకు స్థాన చలనం కల్పించారు. ఈ బదిలీల్లో అధికార పార్టీ నేతల సిఫార్సులకే ప్రాధాన్యత ఇచ్చారని ఆర్టీసీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
సాధారణంగా బదిలీలు చేసేటప్పుడు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఎలాంటి కౌన్సిలింగ్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఐదుగురు డీఎంలకు ఒకే జోన్‌లో పోస్టింగులివ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎండీ సురేంద్రబాబుకు తెలియకుండా ఓ ఉన్నతాధికారి రాజకీయ పైరవీలకు ప్రాధాన్యత ఇచ్చారని, తన వర్గం వారికి పోస్టింగులిచ్చారని ప్రచారం జరుగుతోంది. విజయవాడ చుట్టుపక్కల విధులు నిర్వహించిన డిపో మేనేజర్లు కార్పొరేట్ కార్యాలయంలో పోస్టింగులు దక్కించుకోవడమే ఇందుకు నిదర్శనం. డీఎంల బదిలీలతో పాటు 12 మంది సూపర్‌వైజర్లకు పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతుల్లోనూ నచ్చిన వారికి ఇష్టం వచ్చిన చోట పోస్టింగులిచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీలో డీఎంలు, డీవీఎంల బదిలీల్లో దీర్ఘకాలం పాటు ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారిని జోన్ మార్చి పోస్టింగులిస్తామని ముందు యాజమాన్యం ప్రకటించినా.. ఆ తర్వాత అవేమీ పట్టించుకోలేదు.
డీవీఎంల బదిలీల్లోనూ పైరవీలు..
ప్రస్తుతం డివిజనల్ మేనేజర్ల బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఈ డీవీఎంల బదిలీల్లోనూ పైరవీలు ప్రారంభమైనట్లు సమాచారం. మంత్రి పేషీ రంగంలోకి దిగి వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉన్నతాధికారులు ఆర్టీసీ ఎండీని తప్పుదోవ పట్టిస్తున్నారని, వాస్తవాలు దాచి బదిలీల్లో తమ వర్గం వారికి న్యాయం చేసేలా వ్యవహారాలు నెరపుతున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment