employees transfers
-
AP: రేపటి నుంచి ఉద్యోగుల బదిలీలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా తొలగించింది. ప్రజా సంబంధిత సేవలందించే 14 శాఖల్లోని ఉద్యోగుల బదిలీలకు సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు అనుమతించింది. ఎక్సైజ్ శాఖలో మాత్రం వచ్చేనెల 5 నుంచి 15వ తేదీ వరకు బదిలీలకు అనుమతించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ శనివారం జారీ చేశారు. ఈ నెలాఖరుకల్లా 14 శాఖల్లో బదిలీలు పూర్తవ్వాలని, వచ్చే నెల 1వ తేదీ నుంచి నిషేధం తిరిగి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖలో వచ్చే నెల 16 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. 5 సంవత్సరాలుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇతర ఉద్యోగుల్లో పరిపాలన అవసరాలు లేదా వ్యక్తిగత అభ్యర్థనలపై బదిలీలకు అర్హులు. ఎన్నికల ప్రక్రియ కోసం బదిలీలను బదిలీగా పరిగణించరు. కారుణ్య ప్రాతిపదికన నియమితులైన వితంతువులైన మహిళా ఉద్యోగులు, దృష్టి లోపం గల ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది.బదిలీలు జరిగే శాఖలు– రెవెన్యూ (భూపరిపాలన), సెర్ప్‌తో సహా పంచాయత్ రాజ్ – గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, గ్రామ, వార్డు సచివాలయాలు, పౌర సరఫరాలు, మైనింగ్– జియాలజీ, అన్ని విభాగాలలో ఇంజనీరింగ్ సిబ్బంది, దేవదాయ, రవాణా, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక, పరిశ్రమలు, ఇంధన, స్టాంపులు–రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్. ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీలను ముందు భర్తీ చేయాలినోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని ఖాళీ పోస్టులను ముందుగా భర్తీ చేయాలి. ఐటీడీఏ ప్రాంతాలతో పాటు వెనుకబడిన ప్రాంతాల్లో పోస్టుల భర్తీకి శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యతనివ్వాలి. నిబంధనల ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో రెండేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులు కోరిన చోటుకు బదిలీ చేసేందుకు ప్రాధాన్యతనివ్వాలి. ఐటీడీఏ పరిధిలో బదిలీ చేసే ఉద్యోగులు 50 ఏళ్ల లోపు ఉండాలి. ఐటీడీఏ పరిధిలో గతంలో పనిచేయని ఉద్యోగులను బదిలీ చేయాలి. ఐటీడీఏ పరిధిలో బదిలీ చేసిన ఉద్యోగుల స్థానంలో ప్రత్యామ్నాయం లేకుండా రిలీవ్ చేయడానికి వీల్లేదు. బదిలీ దరఖాస్తుల పరిశీలనకుఅంతర్గత కమిటీలుప్రభుత్వ మార్గదర్శకాలు, షరతులకు అనుగుణంగా సంబంధిత అధికారులు బదిలీలను అమలు చేయాలి. జిల్లా, జోనల్, బహుళ జోనల్‌తో పాటు రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలి. ప్రాధాన్యతల విషయంలో దుర్వినియోగం జరగకుండా సంబంధిత శాఖల అంతర్గత కమిటీలు దరఖాస్తులను పరిశీలించి, తగిన సిఫార్సులు చేయాలి. ఎటువంటి ఫిర్యాదులు, ఆరోపణలకు అవకాశం లేకుండా పారదర్శకంగా గడువులోగా బదిలీల ప్రక్రియను సంబంధిత శాఖాధిపతులు పూర్తి చేయాలి. ఉద్యోగ సంఘాల ప్రతినిధుల బదిలీల విషయంలో నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలి.ఈ వర్గాలకు బదిలీల్లో ప్రాధాన్యత– దృష్టి లోపం ఉన్న ఉద్యోగులు, మానసిక వికలాంగ పిల్లలను కలిగి ఉన్న ఉద్యోగులు సంబంధిత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న చోటుకి బదిలీ చేయాలని కోరేవారు– గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులు– 40 శాతంకన్నా ఎక్కువ వైకల్యం గల ఉద్యోగులు– క్యాన్సర్, ఓపెన్ హార్ట్ ఆపరేషన్స్, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా అటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్న స్టేషన్లకు బదిలీలు కోరుకునే ఉద్యోగులు (స్వయం లేదా జీవిత భాగస్వామి లేదా ఆధారపడిన పిల్లల వైద్యం కోసం)– భార్య, భర్త ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయితే, వారిద్దరినీ ఒకే స్టేషన్లో లేదా ఒకరికొకరు సమీపంలో ఉన్న స్టేషన్లలో ఉండేలా బదిలీకి ప్రయత్నించాలి.ఈ మార్గదర్శకాల ప్రకారం జరిగే అన్ని బదిలీలు, ప్రాధాన్య స్టేషన్ల ఎంపికను వినియోగించుకున్న ఉద్యోగుల బదిలీలను అభ్యర్థన బదిలీలుగా పరిగణిస్తారు. -
AP: ఉద్యోగులకు ఝలక్.. 15 శాఖల్లో బదిలీలు!
సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్లాన్ సిద్ధం చేసింది. ఈ క్రమంలో దాదాపు 15 శాఖల్లో ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గైడ్‌లైన్స్ కూడా ప్రభుత్వం జారీ చేసింది.కాగా, ఏపీలో ఉద్యోగుల విషయంలో కూటమి సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను బదిలీ చేసేందుకు ప్లాన్ రెడీ చేసింది. ఈ క్రమంలో ఒకే చోట ఐదేళ్లుగా పనిచేస్తున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయించింది. 15 శాఖల్లో ఉద్యోగులను బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు గైడ్‌లైన్స్ కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఇక, ఈనెల 31వ తేదీలోపు బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. -
AP: బదిలీలకు 3వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంబంధిత ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనుంది. సోమవారం నుంచి ఉద్యోగులు అన్లైన్ పోర్టల్‌లో తమ బదిలీ దరఖాస్తుల నమోదుకు వీలు కల్పిస్తారు. ఈ మేరకు శాఖ డైరెక్టర్ లక్ష్మీ శుక్రవారం శాఖ అధికారులతో సమావేశమై బదిలీల ప్రక్రియ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. సచివాలయాల ఉద్యోగులు ప్రస్తుతం రోజు వారీ హాజరును నమోదు చేసే హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లోనే బదిలీల దరఖాస్తుల నమోదుకు ప్రత్యేక లింకును అందుబాటులో ఉంచనున్నారు. ఆన్లైన్లో బదిలీల దరఖాస్తు నమోదు సమయంలో వారి దరఖాస్తుకు అవసరమైన ధృవీకరణ పత్రాలపై సొంత ధృవీకరణతో కూడిన సంతకాలు చేసి, వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఉద్యోగుల బదిలీల ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలయ్యే సమయానికి ముందే జిల్లాల వారీగా, ఉద్యోగ కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను వెబ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఇందులో భాగంగా శనివారం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ లక్ష్మీశ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. బదిలీల ప్రక్రియ షెడ్యూల్ (జిల్లా పరిధిలో) ఇలా.. - జిల్లాల్లో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఖాళీల వివరాల నమోదు తేది : మే 28 - ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు ఆఖరు తేదీ : జూన్ 3 - ఆన్లైన్లో అందిన దరఖాస్తుల పరిశీలనకు చివరి తేదీ : జూన్ 6 - వెబ్ ర్యాంకు లిస్టుతో పాటు బదిలీలో ఉద్యోగికి కేటాయించిన మండలం లేదా పట్టణం వివరాలు తెలిపే తేది : జూన్ 6 - తిరస్కరించిన దరఖాస్తులు, తిరస్కరణ కారణంతో కూడిన జాబితా వెల్లడి : జూన్ 6 - బదిలీ అయిన ఉద్యోగులకు కేటాయించిన మండలం లేదా పట్టణంలో వ్యక్తిగత కౌన్సెలింగ్ తేదీలు : జూన్ 8, 9, 10 - బదిలీలో కొత్తగా కేటాయించిన సచివాలయ వివరాలతో బదిలీ సర్టిఫికెట్ల జారీ తేది : జూన్ 8, 9, 10 - బదిలీలకు సంబంధించి కలెక్టర్లకు అభ్యంతరాలు తెలిపేందుకు చివరి తేదీ : జూన్ 10 వేరే జిల్లాకు బదిలీ కోరుకునే వారి కోసం.. - జిల్లాల్లో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఖాళీల వివరాలు నమోదు తేది : మే 28 - ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు ఆఖరు తేది : జూన్ 3 - వేరే జిల్లాకు బదిలీకి వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసే తేది : జూన్ 8 (ఆ ఉత్తర్వులోనే బదిలీ చేసే మండలం లేదా పట్టణం వివరాలు నమోదు) - బదిలీ అయ్యాక ఉద్యోగులకు వ్యక్తిగత కౌన్సెలింగ్ తేదీ : జూన్ 8, 9, 10 - కొత్తగా కేటాయించిన సచివాలయం వివరాలతో బదిలీ సర్టిఫికెట్లు జారీ తేదీ : జూన్ 8, 9, 10 - బదిలీలకు సంబంధించి కలెక్టర్లకు అభ్యంతరాలు తెలిపేందుకు చివర తేది : జూన్ 10. ఇది కూడా చదవండి: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ అస్వస్థత -
ఆర్టీసీ బదిలీల్లో అయిన వారికే అందలం!
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో ఇటీవల జరిగిన డిపో మేనేజర్ల బదిలీల్లో భారీగా పైరవీలు చోటు చేసుకున్నాయనే విమర్శలొస్తున్నాయి. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు హయాంలోనైనా పారదర్శకంగా బదిలీలు జరుగుతాయని భావించిన అధికారులకు ఇటీవల జరిగిన ఈ బదిలీలు నిరాశే మిగిల్చాయి. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులున్న వారిని అందలమెక్కించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీర్ఘకాలంగా ఒకే జోన్లో విధులు నిర్వహిస్తున్న వారికి..నిబంధనలకు విరుద్ధంగా అదే జోన్లో మళ్లీ పోస్టింగులివ్వడమే ఇందుకు నిదర్శనమని కొంతమంది అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా ఆర్టీసీలో 32 మంది డిపో మేనేజర్లకు స్థాన చలనం కల్పించారు. ఈ బదిలీల్లో అధికార పార్టీ నేతల సిఫార్సులకే ప్రాధాన్యత ఇచ్చారని ఆర్టీసీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సాధారణంగా బదిలీలు చేసేటప్పుడు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఎలాంటి కౌన్సిలింగ్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఐదుగురు డీఎంలకు ఒకే జోన్లో పోస్టింగులివ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎండీ సురేంద్రబాబుకు తెలియకుండా ఓ ఉన్నతాధికారి రాజకీయ పైరవీలకు ప్రాధాన్యత ఇచ్చారని, తన వర్గం వారికి పోస్టింగులిచ్చారని ప్రచారం జరుగుతోంది. విజయవాడ చుట్టుపక్కల విధులు నిర్వహించిన డిపో మేనేజర్లు కార్పొరేట్ కార్యాలయంలో పోస్టింగులు దక్కించుకోవడమే ఇందుకు నిదర్శనం. డీఎంల బదిలీలతో పాటు 12 మంది సూపర్వైజర్లకు పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతుల్లోనూ నచ్చిన వారికి ఇష్టం వచ్చిన చోట పోస్టింగులిచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీలో డీఎంలు, డీవీఎంల బదిలీల్లో దీర్ఘకాలం పాటు ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారిని జోన్ మార్చి పోస్టింగులిస్తామని ముందు యాజమాన్యం ప్రకటించినా.. ఆ తర్వాత అవేమీ పట్టించుకోలేదు. డీవీఎంల బదిలీల్లోనూ పైరవీలు.. ప్రస్తుతం డివిజనల్ మేనేజర్ల బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఈ డీవీఎంల బదిలీల్లోనూ పైరవీలు ప్రారంభమైనట్లు సమాచారం. మంత్రి పేషీ రంగంలోకి దిగి వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉన్నతాధికారులు ఆర్టీసీ ఎండీని తప్పుదోవ పట్టిస్తున్నారని, వాస్తవాలు దాచి బదిలీల్లో తమ వర్గం వారికి న్యాయం చేసేలా వ్యవహారాలు నెరపుతున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నేడో, రేపో బదిలీలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకునే అధికారులకు స్థానచలనం కలుగనుంది. ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమలులోకి రావడంతో ఒకే చోట తిష్టవేసిన రెవెన్యూ, పోలీసు, ఎంపీడీఓలను మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నిర్దేశించింది. డిసెంబర్ 31వ తేదీ నాటికి జిల్లాలో మూడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న అధికారుల జాబితా పంపాలని లేఖ రాసింది. ఈ మేరకు ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న రెవెన్యూ(రిటర్నింగ్/అసిస్టెంట్ రిటర్నింగ్) అధికారుల వివరాలను జిల్లా యంత్రాంగం పంపింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం.. కోడ్ అమలులోకి రావడంతో ఈ నెల 17వ తేదీలోపు వీరిని బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎంపీడీఓలకు కూడా.. ఎన్నికల బదిలీలు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు(ఎంపీడీఓ) కూడా వర్తించనున్నాయి. దీనిపై ఇప్పటివరకు స్పష్టమైన ఆదేశాలు రానప్పటికీ గత ఎన్నికల వేళ ఎంపీడీఓలను బదిలీ చేయడం, తాజాగా ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల్లో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ల ప్రస్తావన తేవడంతో ఎంపీడీఓలకు కూడా స్థానచలనం కలుగనుందనే ప్రచారం జరుగుతోంది. బీడీఓల వ్యవస్థ రాష్ట్రంలో లేనందున ఆ స్థానంలో పనిచేస్తున్న ఎంపీడీఓలలో మార్పులు చేర్పులు జరుగనున్నాయి. కాగా, మూడేళ్ల పైబడి జిల్లాలో పనిచేస్తున్నవారిని పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో మూడో వంతు ఎంపీడీఓల పీఠాలు కదలనున్నాయి. కొన్నేళ్లుగా పంచాయతీరాజ్ శాఖలో బదిలీలపై నిషేధం కొనసాగుతుండడంతో భారీ స్థాయిలో బదిలీలు అయ్యే అవకాశముంది. ఎన్నికల అనంతరం ప్రస్తుత మండలాల్లోనే కొలువుదీరే వెసులుబాటు ఉండడంతో అధికారుల్లో పెద్దగా ఆందోళన కలగడం లేదు. ఇదిలావుండగా, ఇటీవల పోలీసుశాఖలో భారీ ఎత్తున బదిలీలు జరిగాయి. ఎన్నికల కోడ్ రావడంతో హోంశాఖ ఈ మేరకు సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులకు స్థానచనలం కలిగించింది. జాబితాకు తుదిమెరుగు ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా మాతృ జిల్లాలో పనిచేస్తున్న, మూడేళ్లుగా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు స్థానచలనం కలుగనుంది. మూడేళ్ల కాలపరిమితిలో పదోన్నతులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 17 మంది రెవెన్యూ అధికారులకు బదిలీ అనివార్యం కానుంది. కాగా, ఎన్నికల కమిషన్ నియమావళి ప్రభావం చూపే అధికారుల జాబితాను పరిశీలిస్తున్న పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయంలో జిల్లాలవారీగా తహసీల్దార్లను కేటాయించేందుకు తుది కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రూపొందించిన జాబితాను జిల్లా యంత్రాంగానికి అందగానే బాధ్యతల నుంచి అధికారులు రిలీవ్ కావాల్సి వుంటుంది. ఇదిలావుండగా, గండిపేట, రాజేంద్రనగర్, యాచారం, ఆమనగల్లు, చౌదరిగూడ, షాబాద్, శంకర్పల్లి, హయత్‌నగర్, సరూర్‌నగర్, మహేశ్వరం, మాడ్గుల, తలకొండపల్లి మండలాల తహసీల్దార్లతోపాటు కలెక్టరేట్లో తహసీల్దార్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు అధికారులకు మార్పు తప్పనిసరి అయింది. -
‘ఎన్నికల తర్వాతే బదిలీలు’
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ ఉద్యోగుల బదీలీలను పంచాయతీ ఎన్నికల తర్వాతే చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. మండల విస్తరణ అధికారులకు ఎంపీడీవోలుగా పదోన్నతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రూర్బన్, ఉపాధి హామీ, ఉద్యోగుల బదిలీలపై ఉన్నతాధికారులతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి జూపల్లి శనివారం సమీక్షించారు. ఎక్కువకాలం ఒకేచోట పనిచేస్తున్న ఎంపీడీవోల బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. రూర్బన్ పథకంలో భాగంగా సంబంధిత టెండర్ల ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీకి సగటున 50 రోజుల కన్నా ఎక్కువ పని కల్పిస్తే ప్రోత్సాహకాలు అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్‌లను ఆదేశించారు. -
ఐదేళ్లు దాటినవారికే బదిలీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల బదిలీలపై ఏపీ మంత్రివర్గం ఓ నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ఐదేళ్ల సర్వీసు దాటిని వారిని మాత్రమే బదిలీ చేయాలని స్పష్టం చేసింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించకపోయినా, వాళ్ల వేతనాలను మాత్రం 50 శాతం పెంచాలని నిర్ణయించింది. కాగా రాజధాని భవనాల డిజైన్లపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గానికి నార్మన్ పోస్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
మంత్రి పుల్లారావుపై చంద్రబాబు ఆగ్రహం
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల బదిలీలపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మంత్రులకు, అధికారులను క్లాస్ పీకారు. ఉద్యోగుల బదిలీలను ఎందుకు పట్టించుకోవడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. అధికారులను సమన్వయం చేసుకోనప్పుడు మిమ్మల్ని మంత్రిగా, మరొకరిని ఇంచార్జీ మంత్రిగా పెట్టి ఉపయోగం ఏముందని ఆయన ప్రశ్నించారు. గుంటూరు-విజయవాడ మధ్య గంట దూరం లేకపోయినా వచ్చి కూర్చుని మాట్లాడటానికి మీకు తీరిక ఉండటం లేదా... చెప్పింది అర్థం చేసుకోకుండా...సిన్సియారిటీ లేకుండా పని చేస్తే ఎలా అని ధ్వజమెత్తారు. మంత్రులు, కలెక్టర్లు, సెక్రటరీల మధ్య కూడా సమన్వయం లేకపోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఎందుకింత ఇగోలతో ఉన్నారో అర్ధం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఏపీలో పలుశాఖల్లో అధికారులు, ఉద్యోగుల బదిలీలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలుశాఖల్లో అధికారులు, ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు సోమవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ డీటీసీగా ప్రసాద్, అనంతపురం డీటీసీగా వడ్డి సుందర్‌ను నియమించింది. కర్నూలు డీటీసీ గా ఎస్ సత్యనారాయణను నియమించిన ప్రభుత్వం కడప డీఎస్వోగా విజయరాణిని నియమించింది. అలాగే విజయనగరం జిల్లా డీఎస్వోగా శాంతికుమారి, విశాఖ డీఎస్వోగా ఆనందర్ కుమార్‌ను ఏపీ ప్రభుత్వం ఆయా శాఖల్లో నియమించింది. -
బదిలీ కోసం ఆత్రంగా..
అధికారులు, ఉద్యోగుల ఎదురుచూపులు ఇంకా విడుదల కాని జీఓ విజయనగరం కంటోన్మెంట్: ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీఓ గురువారం సాయంత్రం వరకూ విడుదల కాలేదు. చాలా రోజులుగా బదిలీల జీఓ కోసం ఎదురు చూస్తున్న అధికారులు, ఉద్యోగులు జీఓ రాకపోవడంపై నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం నుంచి జీఓ వస్తుందని ఎదురు చూస్తున్న విజయనగరం జిల్లా అధికారులు, ఉద్యోగులు, కింది స్థాయి సిబ్బంది కూడా గురువారం సాయంత్రం వరకూ జీఓపై కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఈ నెల 10వ తేదీ నుంచి 20 వరకూ బదిలీలు నిర్వహించుకోవాలని త్వరలోనే జీఓ విడుదల చేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటించినా జీఓ విడుదల చేయక పోవడం విచిత్రంగా ఉందని పలు ఉద్యోగ సంఘాలు విమర్శించాయి. నీరుగారిన ఉత్సాహం ఇటీవల జూన్ మొదటి వారంలోనే బదిలీలు నిర్వహిస్తామని చెప్పినప్పటికీ దానిని అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి సమావేశమైన తరువాత ఈనెల పది నుంచి బదిలీలు నిర్వహిస్తామని స్వయంగా ప్రకటించారు. దీంతో ఉద్యోగ సంఘాల్లో సంతోషం పెల్లుబికింది. చాలామంది అధికారులు, ఉద్యోగులు, ఆయా సంఘాల నాయకులు కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని, ప్రస్తుత విధానంలో రాజకీయ నాయకుల వెంట తిరగలేకపోతున్నామని చె ప్పడంతో ఈ జీఓలో కొన్ని మార్పు చేర్పులు ఉంటాయని పలువురు భావించారు. ఈ మార్పుల కోసమే చివరి క్షణం వరకూ జీఓ విడుదల చేయలేదని అంటున్నారు. అయితే ఈనెల పదో తేదీనుంచి బదిలీలు చేపట్టాలని నిర్ణయిం చిన పక్షంలో ముందు రోజు రాత్రి వరకూ జీఓ విడుదల చేయకపోవడంతో ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికే పలువురు అధికారులు, ఉద్యోగులు బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. మండల, జిల్లా స్థాయిలో తాము కోరుకున్న స్థానాల కోసం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వారి నుంచి హామీలు తీసుకున్నారు. చివరకూ జీఓ విడుదల కాకపోవడంతో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి విడుదల చేయాల్సిన జీఓ విషయంలోనూ ఇంత గోప్యత ఎందుకని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే గురువారం ఏ అర్ధరాత్రికో లేక శుక్రవారమైనా జీఓ విడుదలవుతుందా లేక గతంలోలా ఉద్యోగులకు మళ్లీ వాయిదా వేస్తారా? అని ఆయా ఉద్యోగులు, అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. జీఓ విడుదలయిన పక్షంలో జిల్లాలో కొన్ని స్థానాలకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారితో పాటు పైరవీలు చేసుకున్న వారు కూడా నేనంటే నేనే చేరతాననే ధీమాతో ఉన్నారు. ఏదైనా జీఓపైనే ఆధారపడి ఉందని, ఏ క్షణమైనా జీఓ విడుదలయ్యే అవకాశం లేకపోలేదని మరికొంత మంది మెట్ట వేదాంతం చెబుతున్నారు. -
ఉద్యోగుల బదిలీలపై ‘పచ్చ’జెండా రెపరెపలు
ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఈ మధ్యకాలంలో వచ్చిన అత్యంత వివాదాస్పద మైన జీవో.. జీవో నంబర్ 57. ఈ ఏడాది మే 18న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవో 57 కోర్టువరకు వెళ్లి ఆగస్టు 8న జీవో 98గా పునరుత్థానం చెందిన వరకూ ఎన్నో మజిలీలూ, ప్రస్థానాలూ! వీటి గమనాన్ని పరిశీలిస్తే ముఖ్యమంత్రి ఊగిసలాటలు, ఆలో చనల్లోని అస్థిరతా ప్రస్ఫుటంగా కనిపించా యి! కేవలం రెండున్నర నెలల కాలంలో విడుదలైన 7 జీవోలు 57, 58, 59, 61, 63, 75ల అనంతరం ఈ 8వ తాజా జీవో 98నీ గమనిస్తే బదిలీలపై ప్రభుత్వం ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెన క్కులా డోలాయమాన స్థితిలోకి వెళ్లి ఊగిసలాడినట్టు స్పష్టమవుతోంది. ఉద్యోగులు తాము చెప్పిన మాట వినడంలేదనీ, అధికారంలోకి తెచ్చి నోళ్లకే మంచి పోస్టింగులనీ, కార్యకర్తలు చెప్పిందే ఉద్యోగులు చేయాల నీ, కార్యకర్తల కోసం పని చేసేవారిని ఏరికోరి తెచ్చుకుంటామని, చెప్పింది చేయకపోతే చర్యలు తప్పవనీ మినీమహానాడు సందర్భా లుగా గ్రామగ్రామాన సాక్షాత్తూ అమాత్యవర్యులే బహిరంగ ప్రకటనలు గుప్పించిన నేపథ్యంలో వచ్చిన ఈ బదిలీలకు ఉద్యోగులు భయబ్రాంతులయ్యారు! జీవో 57పై ఉద్యోగ వర్గాల ప్రధాన ప్రతిఘటనల్లా బదిలీలపై జిల్లా ఇన్చార్జి మంత్రికి అధికారాన్ని కట్టబెట్టడంపైనే! ఈ మధ్య గుంటూరులో జరిగిన ఓ సభలో సీఎం మాట్లాడుతూ మరో మూడు నెలల్లో పాత చంద్రబాబును చూస్తారని హెచ్చరించిన నేపథ్యంలో టీచర్ల బదిలీ ప్రక్రియ మొదలైంది. ఏ పార్టీకి చెందిన ప్రభుత్వమైనా సరే.. ఉద్యోగుల బదిలీలనగానే రాజకీయ ఒత్తిళ్లూ, పైరవీలు, డబ్బు సంచుల కదలికల్లో డిపార్ట్మెంట్లోని అదనపు సంపాదనలోని హెచ్చు తగ్గుల తేడాయే తప్ప -ఇటు ట్రాన్స్ఫర్ ఆర్డర్ జారీ చేసే ఉన్నతాధికా రుల నుండి అటు అధికార అనధికార రాజకీయ నేతల వరకూ ఇదో సంరంభం! చంద్రబాబు ప్రభుత్వం ఒక ముందడుగు వేసి, ఈ రహస్య ప్రక్రియకు జీవో 57తో చట్టబద్ధతను కల్పించింది. ప్రభుత్వం సూత్రీకరించిన పరిధిలోనే తన విధులను నిర్వర్తించా లని ఏ ఉద్యోగి అయినా భావిస్తాడు. కానీ మధ్యలో ఈ ‘పార్టీ కార్య కర్తలు చెప్పినట్లు చేయడమే’మిటో అర్థం కాదు. ప్రభుత్వం నిర్దేశించిన నియమాలకు భిన్నంగా వీళ్ల కోరికలు, ఆశలు గనుక ఉంటే ఆయా పనులకు సంబంధించిన సూత్రీకరణలను ప్రభుత్వ మార్గదర్శకాల లోనే చేర్పిస్తే అటు ప్రభుత్వాన్ని నడిపే కార్యకర్తలకూ, ఇటు ప్రభుత్వ ఉత్తర్వులు పాటించాల్సిన ఉద్యోగులకు ఉభయతారకంగా ఉంటుంది కదా! పార్టీ చెప్పినట్లే పని చేయడానికీ చేయించుకోవడానికీ ఇరుపక్షా లకు మధ్య ఎటువంటి ఘర్షణలకు తావుండదు కదా! సహజంగా సంవత్సరంలో ఒక్కసారే అంటే మే, జూన్ నెలల మధ్య కాలంలో బదిలీల ప్రక్రియను ముగించుకోవడం ప్రభుత్వానికి పరిపాటి. కానీ ఆర్నెల్లలోనే మళ్లీ బదిలీలకు తెరలేపడం బహుశా రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారౌతుందేమో. నవంబర్ 2014లో జీవో 211 ద్వారా జరిగిన బదిలీలకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలూ, మం త్రుల సిఫారసుల లేఖలను శాఖాధికారులు తయారు చేసుకున్న ఫైళ్లకు అధికారికంగానే గుదిగుచ్చారు. ఏ ఉద్యోగి ఎంత మంది ఎమ్మెల్యేలు/ మంత్రుల నుండి ఎన్ని సిఫారసు లేఖల్ని తీసుకొస్తే ఆ బదిలీకి అంత వెయిటేజీగా పరిగణించడం జరిగింది. రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసి పదవినలంకరించిన పాలకు లు దమననీతితో ఏకపక్షంగా వ్యవహరించకూడదు. పరిధుల్ని దాటిన ఉద్యోగికి వెనువెంటనే ప్రమాదం పొంచి ఉంటే, పాలకులకు ఆ ప్రమా దం ఐదేళ్లకు ఉండితీరుతుంది, ఊడితీరుతుంది కూడా. ఈ బదిలీల జడికి హడలిపోయిన సగటు ఉద్యోగి తమ ఓట్లే కాకుండా తమ కుటుంబాల ఓట్లూ వేయకపోతే తె.దే.పా అసలు రాష్ట్రంలో గవర్నమెంట్‌ని ఫార్మ్ చేయగలిగుండేదా అని ప్రశ్నించుకుం టున్నాడు, పునరాలోచించుకుంటున్నాడు. ఉద్యోగికిప్పుడు స్థిరచిత్త తనూ, అవ్యాకులంగా పనిచేసే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించ డమూ, భవిష్యత్తులో జరగబోయే బదిలీల్లో అయినా పారదర్శకతను మిస్సవకుండా చూడ్డమూ ప్రభుత్వం ముందున్న కర్తవ్యం. - వ్యాసకర్త మాజీ సర్పంచ్, బెంకిలి, శ్రీకాకుళం మొబైల్ : 9000646780 - బి.మోహనరావు -
మెదక్ డీఈవోపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: మెదక్ డీఈవో ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఉద్యోగుల బదిలీల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ మెదక్ డీఈవో ఏ రాజేశ్వరరావుపై ఆరోపణలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేస్తూ వేటు వేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. ఆయన స్థానంలో మెదక్ డీఈవోగా నజీముద్దీన్ ను నియమించగా, ఖమ్మం డీఈవోగా ఎన్ రాజేశ్ ను నియమించారు. -
ఉద్యోగుల బదిలీలపై వీడని సందిగ్ధత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై సందిగ్ధత ఇంకా వీడలేదు. ప్రభుత్వం జారీచేసిన జీఓ నెం. 57ను తప్పుపడుతూ ఏపీ పశు సంవర్ధక శాఖ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో బదిలీల జీవోపై హైకోర్టు స్టే విధించింది. ఈ స్టేను ఎత్తేయాలంటూ ఏపీ సర్కారు హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం ఇంతవరకు వెలువడలేదు. దాంతో ప్రస్తుతానికి బదిలీలపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో.. మిగిలిన శాఖల ఉద్యోగుల పరిస్థితి గందరగోళంలో పడింది. -
ఏవీ బదిలీలు... ?
సమయం మించిపోతోందంటూ ఉద్యోగుల గగ్గోలు రోజుకో జీవోతో గందరగోళంగా ఉందని ఆవేదన పాఠశాలలు తెరిచేస్తున్నా తేల్చకపోవడంపై అసహనం శ్రీకాకుళం సిటీ :బదిలీలు ఎప్పుడు జరుగుతాయి?... అసలు జరుగుతాయా లేదా?... కొత్తజీవోలు ఏమైనా వచ్చాయా?... అందులో ఏమైనా కొత్త నిబంధనలున్నాయా?... మరో వారం రోజుల్లో బడులు తెరిచేస్తారు... ఇప్పటికీ తేల్చకపోతే... మన పరిస్థితి ఏమిటి? - ఇదీ ప్రస్తుతం ఉద్యోగుల్లో నెలకొన్న చర్చ. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో బదిలీల ప్రక్రియ చేపట్టేటప్పుడు తప్పనిసరిగా జిల్లా ఇన్చార్జి మంత్రిని, ఆయా శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలి. తొలి విడత గత నెల 31లోగా ఈ జిల్లాలో బదిలీల తంతు పూర్తిచేయాలని భావించాం. కానీ జూన్ 9వ తేదీ నుంచి 15 వరకు గడువు పొడిగించాం. ఇదీ ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న మాటలు మొత్తమ్మీద జిల్లాలో బదిలీల వ్యవహారం ఉద్యోగుల్ని గందరగోళంలోకి నెట్టేస్తోంది. ఇంతవరకూ దీనిపై ఏ విధమైన ప్రకటనా స్పష్టంగా లేకపోవడం... జాబితాలు తయారు కాకపోవడంపై వారంతా చాలా అసంతృప్తితో ఉన్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సుమారు 24 వేలకు పైగానే ఉన్నారు. ప్రతీశాఖలో 20శాతానికి మించకుండా బదిలీల ప్రక్రియ చేపట్టాలని తొలుత ప్రభుత్వం యోచించింది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేయాలని నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వశాఖల్లో బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న వారు సుమారు 15వేల మందికి పైగా ఉన్నారని తెలియవచ్చింది. ఆన్లైన్లోనే బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా స్థాయి అధికారులకు తొలుత ప్రభుత్వం సూచించింది. కానీ తాజాగా బదిలీల ప్రక్రియకు రాజకీయరంగు పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఆయా ప్రభుత్వశాఖల అధికారులతో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రిని కూడా ఈ కమిటీలో బాగస్వామ్యం చేసింది. ఈ కమిటీ నిర్ణయం పైనే బదిలీలు జరుగుతాయి. సాధారణంగా ఎన్నికలపుడు మినహా మిగిలిన సమయాల్లో ఎప్పుడైనా మే నెలలో ఒక్కసారే బదిలీలు చేసేవారు. రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో సర్కారు ఏర్పాటైన ఏడాదిలోనే రెండు పర్యాయాలు బదిలీల ప్రక్రియ చేపట్టింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన బదిలీల్లో ఖజానా, విద్యాశాఖలో ఉపాధ్యాయులకు అవకాశం లభించలేదు. ఈ సారి కూడా ఖజానా, ఆడిట్ శాఖలను మినహాయించారు. ఉపాధ్యాయుల బదిలీలపై ఇంతవరకు స్పష్ట్టత లేకపోవడంపై ఉపాధ్యాయులు అసంతృప్తితో ఉన్నారు. మరో వారంలోగా పాఠశాలలు తెరవబోతున్న నేపథ్యంలో బదిలీలు చేయడం సరికాదనేది వారి వాదన. రకరకాల జీవోలతో గందరగోళం పుట్టగొడుగుల్లా వస్తున్న జీవోలతో జిల్లాలో వివిధ ప్రభుత్వశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. గతనెలలో జీవోలు 57, 58, 59, 60తో పాటు మరికొన్ని వచ్చినట్లు పేర్కొంటున్నారు. తొలుత మే 31వ తేదీలోగా ఆన్లైన్లో బదిలీలకు తుదిగడువుగా సర్కారు నిర్ణయించినా జూన్ 3వ తేదీ నుంచి 7 వరకు జిల్లాలో చేపట్టిన జన్మభూమి-మాఊరులో అధికారులను బాగస్వామ్యం చేయదలచి తాత్కాలికంగా వాయిదా వేసింది. జూన్ 9వ తేదీ నుంచి 15 వరకు బదిలీలకు తేదీలను నిర్ణయించింది. ఇంతలో రాష్ట్ర వ్యాప్తంగా శాసనమండలి సభ్యుల(ఎంఎల్సీ) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. మంగళవారం ఎంఎల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నుంచి వచ్చేనెల 7వ తేదీ కౌంటింగ్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో కోడ్‌ను అమలు చేయాలని సూచించింది. శ్రీకాకుళం జిల్లాలో ఎంఎల్సీ ఎన్నికలు జరగకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా 12 ఎంఎల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాలో ఈ నిబంధనలను వర్తింపజేసింది. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీకోసం దరఖాస్తు చేసుకున్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఈ కోడ్ అవరోధంగా నిలిచింది. మొత్తమ్మీద బదిలీల వ్యవహారం తేలక ఉద్యోగులు తర్జనభర్జన పడుతున్నారు. -
బదిలీలకు గ్రీన్ సిగ్నల్
హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు జిల్లాలో 17 వేల మందికి బదిలీ జరిగే అవకాశం ఇన్చార్జి మంత్రికి బాధ్యతల అప్పగింత ఈ నెలాఖరు వరకూ బదిలీలు చేసేలా జీఓ విడుదల విజయనగరం కంటోన్మెంట్: ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకూ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీంతో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 17 వేల మందికి బదిలీ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యదర్శి, కలెక్టర్, ఆయా శాఖల అధికారులు ఓ కమిటీగా ఏర్పడి బదిలీలు జరిపేందుకు అవకాశం కల్పించింది. గత ఏడాది నవంబర్ 15న బదిలీలపై నిషేధం విధించారు. ఇప్పుడా నిషేధాన్ని ఈనెలాఖరు వరకూ ఎత్తివేశారు. ఇప్పటి వరకూ కలెక్టర్లకు మాత్రమే బదిలీ చేసే అధికారం ఉండేది. అయితే ఈ సారి ఆయా జిల్లాల్లో ఉన్న ఇన్చార్జి మంత్రులకు బదిలీల పర్యవేక్షణాధికారం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో టీడీపీ మద్దతుదార్లయిన ఉద్యోగులకు అవకాశం కల్పించినట్లయింది. వివిధ ప్రాంతాలకు బదిలీ అయిన వారంతా తిరిగి స్వస్థలాలకు చేరుకునేందుకు వీలవుతుంది. జిల్లాలో 24 వేలకు పైగా ఉద్యోగులున్నారు. వీరిలోరెండేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నవారు తొమ్మిదివేల మంది ఉండగా, ఐదేళ్లగా ఒకే చోట పనిచేస్తున్న వారు ఎనిమిది వేల మంది ఉన్నారు. రెండేళ్లు ఒకే చోట పనిచేసిన వారు తాము కోరుకునే చోటకు బదిలీ చేయించుకునే అవకాశం ఉంది. ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారికి తప్పనిసరిగా బదిలీలు చేయాలని జీఓలో పేర్కొన్నారు. జూన్ 30, 2016 నాటికి రిటైరయ్యే వారిని బదిలీ చేయకూడదు. అలాగే కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగులు, కోర్టు పరిధిలో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యం, ఎక్సైజ్, రవాణా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉద్యోగులకు ప్రత్యేక జీఓ విడుదల చేస్తారు. సెకండరీ, ఉన్నత స్థాయి గెజిటెడ్ ఉద్యోగులు వారి సొంత జిల్లాలకు బదిలీపై వెళ్లేందుకు అనర్హులు. అలాగే ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో నేరుగా ఎన్నికైన వారికి, 40 శాతం అంగవైకల్యం ఉన్న వారికి బదిలీల్లో మినహాయింపు ఉంటుంది. వీరితో పాటు మానసిక వికలాంగులైన పిల్లలున్న ఉద్యోగులు, క్యాన్సర్, న్యూరో సంబంధిత వ్యాధులున్న ఉద్యోగులు, కిడ్నీ సంబంధిత వ్యాధులున్న ఉద్యోగులు సరైన వ్యాధి నిర్ధారణ పత్రాలతో తప్పనిసరి బదిలీల నుంచి మినహాయింపు పొందవచ్చు. విజయనగరం జిల్లాలో ఇంటి అద్దె అలవెన్సును 20 శాతం మేర కల్పించడంతో ఈ బదిలీలపై ఉద్యోగులంతా జిల్లా కేంద్రానికి వచ్చేందుకు పెద్దఎత్తున ఉత్సాహం చూపించే అవకాశం ఉంది. దీంతో పాటు పైరవీలకు మరింత ప్రాధాన్యం కల్పించినట్టు ఉద్యోగ వర్గాలే అంటున్నాయి. ఇక ఈ నెలాఖరు వరకూ అధికార పక్షాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఉద్యోగులు బారులు తీరుతారనడంలో సందేహం లేదు. ఇవి రాజకీయ బదిలీలు ఇప్పుడు జరగబోయే బదిలీలన్నీ రాష్ర్టస్థాయిలో రూపకల్పన చేసిన రాజకీయ బదిలీలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పేడాడ జనార్దరావు అన్నారు. అయితే కమిటీలో కలెక్టర్ స్థానం కల్పించినందున ఉద్యోగులు రాజకీయ బదిలీలకు బలికాకుండా కలెక్టర్ న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర జేఏసీ కూడా దీనిపై దృష్టిసారించాలని కోరారు. -
ఒకేచోట ఐదేళ్లుంటే ట్రాన్స్ఫర్ తప్పదు
హైదరాబాద్: ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు విడుదలచేసింది. మంగళవారం నుంచి బదీలల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో సోమవారం రాత్రి హడావిడిగా సంబంధిత జీవో నంబర్ 57ను విడుదల చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఐదేళ్లు ఒకేచోట పనిచేసినవారికి బదిలీ తప్పనిసరి. కనీసం రెండేళ్లు ఒకేచోట పనిచేసినవారు బదిలీ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులని ప్రభుత్వం పేర్కొంది. రెండేళ్లలో రిటైర్ కానున్నవారిని బదిలీ చెయ్యొద్దని అదేశాలు జారీచేసింది, కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించే ఈ ప్రక్రియను మే 31లోగా పూర్తిచేయాలని సూచించింది. బదిలీల ప్రక్రియను ఇన్చార్జి మంత్రులు పర్యవేక్షిస్తారు. -
రేపటి నుంచి ఉద్యోగుల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మంగళవారం (మే 19) నుంచి జూన్ 5వ తేదీ వరకు బదిలీలు ఉంటాయని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. కనీసం రెండేళ్లు, గరిష్ఠంగా ఐదేళ్ల సర్వీసు ఉన్నవారిని బదిలీలు చేయాల్సిందిగా కోరామని ఆయన అన్నారు. కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు నిర్వహించాలని, బదిలీల విషయంలో పారదర్శకత పాటించాలని కోరినట్లు అశోక్ బాబు చెప్పారు. -
అవసరమైన మేరకే కదలికలు
* ‘సాక్షి’ కథనంతో స్పందించిన పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ * సవరణ జీవో జారీ * గ్రామ కార్యదర్శులు, డీఎల్పీవో బదిలీలు తాత్కాలికంగా నిలుపుదల సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల బదిలీలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ రూపొందించుకున్న నియమనిబంధనలను సవరించింది. శాఖ పరిధిలోని గ్రామ, మండల స్థాయిలోని దాదాపు అందరు సిబ్బంది బదిలీల ప్రక్రియలోకి వచ్చేలా ఉన్న నిబంధనలను సవరించి పరిపాలన అవసరాలకు సరిపడా మాత్రమే బదిలీలు ఉండాలని పేర్కొంటూ తిరిగి నిబంధనలను రూపొందించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి జవహర్‌రెడ్డి బుధవారం సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ఈ నెల 15వ తేదీ వరకు అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల బదిలీలకు కొన్ని నిబంధనలు పాటించాలని జిల్లా అధికారులకు సూచన చేస్తూ సోమవారం జీవో నం. 979ని జారీ చేశారు. ఈ జీవో పేర్కొన్న నిబంధనల ప్రకారం గ్రామ స్థాయిలో గ్రామ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఈవో (పీఆర్ఆర్డీ)లు దాదాపు అందరూ బదిలీ పరిధిలోకి వస్తారు. ఈ విషయంపై ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘అందరూ బదిలీయా!- పంచాయితీరాజ్ ఉద్యోగుల్లో కలవరం’ శీర్షికతో ‘సాక్షి ’ బుధవారం ప్రత్యేక కథనం ప్రచురించింది. స్పందించిన సంబంధిత మంత్రిత్వ శాఖ గ్రామ కార్యదర్శుల బదిలీలను ప్రస్తుతానికి పూర్తిగా నిలిపివేసింది. ఎంపీడీవోలు, ఈవో (పీఆర్ఆర్డీ)ల బదిలీల విషయంలోనూ పరిపాలన అవసరాలకు సరిపడా మాత్రమే బదిలీ చేయాలని పాత నిబంధనను సవరించారు. వీటికి అదనంగా డివిజనల్ పంచాయితీ అధికారుల బదిలీలను కూడా తదుపరి ఉత్తర్వులు నిలుపుదల చేయాలని జీవోలో పేర్కొన్నారు. శాఖ ఒకరిది.. అధికారం మరో మంత్రికి రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి సీహెచ్ అయ్యన్నపాత్రుడు మంత్రిగా కొనసాగుతుంటే, ఆ పథకం అమలు చేసే జిల్లా స్థాయి అధికారుల బదిలీల అధికారం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళినికి అప్పగించారు. ఉపాధి హామీ పథకం జిల్లా స్థాయిలో అమలు చేసే డ్యూమా పీడీలు, ఏపీడీవో బదిలీలు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటికీ, ఈ విషయంపై స్పష్టత కోసం మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎంవో వివరణ కోరినట్టు సమాచారం. కృష్ణా జడ్పీ సీఈవో నియామకం నిలుపుదల కృష్ణా జిల్లా జడ్పీ సీఈవోగా టీకే గిరీశ్వర్ నియమాకాన్ని ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఆర్డీఏ, డ్యూమా పీడీల నియమాకాలు గుంటూరు జిల్లా డ్యూమా పీడీగా పనిచేస్తున్న దిల్లీ రావు విజయనగరం జిల్లా డీఆర్డీఏ పీడీగా నియమితులయ్యారు. శ్రీకాకుళం డ్యూమా డీపీ ఏ కల్యాణచక్రవర్తి విజయనగరం జిల్లా డ్యూమా పీడీగా నియమితులయ్యారు. ప్రస్తుతం విజయనగరం డ్యూమా పీడీగా ఉన్న గోవిందరాజులును అతని సొంత రెవెన్యూ శాఖకు సరెండర్ చేశారు. చిత్తూరు జిల్లా వ్యవసాయ శాఖ ఏడీ వైవీ రమణరావును శ్రీకాకుళం జిల్లా డీఆర్డీఏ పీడీగా నియమించారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ఇన్‌ఛార్జి ముఖ్య కార్యదర్శి ఎస్పీ టక్కర్ ఉత్తర్వులిచ్చారు. -
బదిలీల జాతర
* సచివాలయంలో పైరవీల జోరు... భారీగా బేరసారాలు * ‘నీడ్ బే్‌స్డ్ ట్రాన్స్ఫర్’ మాయాజాలం * సెక్రటేరియట్లో తెలుగు తమ్ముళ్ల కోలాహలం * బుధవారం ఒకేరోజు 70 మంది టీడీపీ ఎమ్మెల్యేల రాక * వందల సంఖ్యలో టీడీపీ మండలస్థాయి నాయకులు * ‘బదిలీలు మా హక్కు’ అన్న టీడీపీ విప్ చింతమనేని * మంత్రుల పేషీలకు గుట్టలుగా సిఫార్సు లేఖలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా హడావుడి చేసిన జన్మభూమి కార్యక్రమం మంగళవారం నాటితో ముగియడంతో సచివాలయంలో బదిలీల జాతర మొదలైంది. జన్మభూమి తర్వాత అవసరం ఉన్న మేరకు బదిలీలు (నీడ్ బేస్డ్ ట్రాన్స్ఫర్స్) చేయండని అధికారికంగా ఆదేశాలు రావడంతో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించిన వారితో సచివాలయం కిటకిటలాడింది. కనీసం ద్విచక్ర వాహనాలు, కార్లు పెట్టుకునేందుకు స్థలం లభించలేదు. ఏ పేషీ చూసినా ఒకటే హడావుడి. అన్ని చోట్లా బదిలీల మంత్రాంగమే. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో సచివాలయం నిండిపోయింది. ప్రతిరోజూ సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలోనే సందర్శకులకు సచివాలయంలోకి అనుమతిస్తారు. అదికూడా 300 నుంచి 400 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ బుధవారం ఉదయం 11 గంటలకే సచివాలయంలో కిక్కిరిసిపోయి ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఏదో ఫైలు కనిపించింది. బదిలీల కోసంవచ్చిన దరఖాస్తులన్నిటికీ ఆమోదం తెలపాల్సిన పనిలేదని ఆదేశాల్లో ఉన్నప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో వందలాది మంది సచివాలయానికి చేరుకున్నారు. గుంటూరు, కృష్ణా, అనంతపురం, కర్నూలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన తెలుగుదేశం మండలస్థాయి నేతలు కూడా తమకు కావాల్సిన వారికోసం వచ్చారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యాశాఖ, ఇరిగేషన్ తదితర శాఖల పేషీల వద్ద వందల సంఖ్యలో కనిపించారు. భారీగా లావాదేవీలు బదిలీకి ఈనెల 15 వరకే అవకాశం ఉండటంతో పైరవీకారులు భారీగా రంగంలోకి దిగారు. ప్రాధాన్యతను బట్టి ఒక్కో బదిలీకి రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వరకూ పలికినట్టు వచ్చినవారు చర్చించుకోవడం కనిపించింది. కృష్ణా జిల్లాకు చెందిన ఓ తెలుగుదేశం మండల నేత 8 సిఫార్సు లేఖలతో వచ్చారు. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్లో అద్దెకు దిగి బదిలీ కావాల్సిన వారితో బేరసారాలు నడుపుతున్నారు. ఇది మచ్చుకు ఒక్కటే. ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా నీటిపారుదల శాఖ, పంచాయితీరాజ్ శాఖల్లో ఇంజనీర్ల బదిలీలపై భారీగా లావాదేవీలు నడిచినట్టు తెలుస్తోంది. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన నర్సులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లూ కోరుకున్న చోటకు బదిలీ చేస్తే భారీగా చెల్లించేందుకు సచివాలయానికి వచ్చారు. మరోవైపు బదిలీ కోసం వచ్చిన కొందరు అధికారులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ‘బదిలీలంటే 20 శాతానికి మించకుండా జరగాలి. కానీ తమకు అనుకూలమైన వారిని బదిలీ చేస్తే, ఏపార్టీకి చెందని వారు, ఎలాంటి రాజకీయ పలుకుబడి లేని వారి పరిస్థితి ఏమిట’ని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ అధికారి వాపోయారు. బదిలీలకు సంబంధించి బుధవారం ఒక్కరోజే కోట్లల్లో లావాదేవీలు జరిగినట్టు సమాచారం. 70 మంది ఎమ్మెల్యేలు సచివాలయంలోనే తమకు నచ్చిన అధికారులను తమ ప్రాంతాల్లో వేయించుకోవడంకోసం, మరికొన్ని లావాదేవీలు నడిచినవి, ఇంకొన్ని కేడర్ కోసం ఇలా రకరకాల సమీకరణల నేపథ్యంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు పదుల సంఖ్యలో సచివాలయానికి తరలివచ్చారు. టీడీపికిచెందిన సుమారు 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు బుధవారం సచివాలయంలో ఉన్నట్టు తెలిసింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, సిద్ధా రాఘవరావు, ప్రత్తిపాటి పుల్లారావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పైడికొండల మాణిక్యాలరావు తదితరులు తమ వారికి అందుబాటుగా సచివాలయంలోనే ఉన్నారు. ఆర్ అండ్ బీ, వ్యవసాయ శాఖ మంత్రుల పేషీల వద్ద అటు ఎమ్మెల్యేలు, ఇటు అధికారులు క్యూలు కట్టారు. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చాంబర్‌కు విద్యాశాఖ ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పోటెత్తారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాత్రం బదిలీలు చేయడం లేదని ప్రకటించారు. ఉదయమే సచివాలయంకు చేరుకుని వెంటనే వెళ్ళిపోయారు. బదిలీలు మా హక్కు ప్రభుత్వ అధికారుల బదిలీలు చేయించుకోవడం మాహక్కు. ఇందులో తప్పేమీ లేదు. అధికారులతో పనిచేయించుకోవాల్సింది మేమేకదా. అందుకే నేను కూడా రెండు బదిలీల కోసం సచివాలయానికి వచ్చాను. ఇంకా నియోజకవర్గానికి సంబంధించిన పనుల కోసం అధికారులను, మంత్రులను కలిసేందుకు వచ్చాను. - చింతమనేని ప్రభాకర్ (ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే) -
బదిలీల కోసం ప్రయత్నాలు
కీలకపోస్టుల కోసం ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు అరండల్‌పేట (గుంటూరు) : ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు (జీవో నంబర్ 175) జారీ చేసింది. దీంతో ఎప్పటి నుంచో బదిలీలపై ఆశలు పెట్టుకున్న ఉద్యోగులు, అధికారులు తమ ప్రయత్నాలను మమ్మురం చేశారు. ప్రధానంగా జిల్లా పాలనలో కీలక పోస్టుల కోసం అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు. జిల్లాపరిషత్ సీఈఓ, ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఖజానా శాఖ అధికారి, డీటీసీ వంటి పోస్టుల కోసం అనేక మంది అధికారులు ఇప్పటికే తమ పైరవీలను మమ్మురం చేశారు. వీరితో పాటు నగరపాలక సంస్థ కమిషనర్, అదనపు కమిషనర్, మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, జీజీహెచ్ సూపరింటెండెంట్, ఇలా కీలక స్థానాల్లో పోస్టింగ్‌ల కోసం జిల్లాకు చెందిన మంత్రుల వద్దకు అధికారు లు క్యూ కడుతున్నారు. గుంటూరు ఆర్డీఓ పోస్టు ఖాళీగా ఉండటంతో చిత్తూరుకు చెందిన ఆర్డీఓకు పోస్టింగ్ ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ►నరసరావుపేట ఆర్డిఓ తెనాలికి, గుంటూరు ఇన్చార్జి ఆర్డిఓ మురళి గురజాల ఆర్డిఓగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ►గుంటూరు తహశీల్దారు పోస్టుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డెల్టాకు చెందిన ఓ తహశీల్దారుకు జిల్లాకు చెందిన మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం. ►నగరపాలక సంస్థకు వచ్చేందుకు అనేక మంది ఇంజినీరింగ్ అధికారులు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం అవసరమైన సిఫార్సు లేఖలను మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి పొందారు. ►నగరపాలక సంస్థ తాత్కాలిక కమిషనర్‌గా ఉన్న పి. నాగవేణి సైతం తనను ఇక్కడే ఉంచాలని ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే, మంత్రి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. ఐఏఎస్ అధికారి కావాలంటూ ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకువస్తున్నారు. అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల పోస్టుల కోసం ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చేందుకు కొంతమంది అధికారులు ఆసక్తి చూపుతున్నారు. ►వైద్య ఆరోగ్యశాఖలో డిఎం అండ్ హెచ్ఓగా ఉన్న గోపీనాయక్ ధీర్ఘకాలికంగా పని చేస్తుండటంతో ఆయన బదిలీ కావడం ఖాయమైంది. దీంతో ఆయన జీజీహెచ్‌లో ఆర్ఎంఓ లేదా ఆర్డి పోస్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ►డిఎం అండ్ హెచ్ఓ పోస్టు కోసం ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన అధికారులు అక్కడి నాయకులతో పైరవీలు చేస్తున్నారు. ►మరో వైపు బదిలీలకు సంబంధించి ఉద్యోగ సంఘాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. విద్యా సంవత్సరం మధ్యలో వేరేప్రాంతానికి వెళితే తమ పిల్లలు ఇబ్బందులు పడతారని వాపోతున్నారు. బదిలీలు కోరుకున్న వారినే పరిగణలోకి తీసుకోవాలి తప్ప, బలవంతంగా బదిలీలు చేయవద్దని ఏపీఎన్జీఓ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.