* ‘సాక్షి’ కథనంతో స్పందించిన పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ
* సవరణ జీవో జారీ
* గ్రామ కార్యదర్శులు, డీఎల్‌పీవో బదిలీలు తాత్కాలికంగా నిలుపుదల
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల బదిలీలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ రూపొందించుకున్న నియమనిబంధనలను సవరించింది. శాఖ పరిధిలోని గ్రామ, మండల స్థాయిలోని దాదాపు అందరు సిబ్బంది బదిలీల ప్రక్రియలోకి వచ్చేలా ఉన్న నిబంధనలను సవరించి పరిపాలన అవసరాలకు సరిపడా మాత్రమే బదిలీలు ఉండాలని పేర్కొంటూ తిరిగి నిబంధనలను రూపొందించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి జవహర్‌రెడ్డి బుధవారం సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ఈ నెల 15వ తేదీ వరకు అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల బదిలీలకు కొన్ని నిబంధనలు పాటించాలని జిల్లా అధికారులకు సూచన చేస్తూ సోమవారం జీవో నం. 979ని జారీ చేశారు.
ఈ జీవో పేర్కొన్న నిబంధనల ప్రకారం గ్రామ స్థాయిలో గ్రామ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఈవో (పీఆర్‌ఆర్‌డీ)లు దాదాపు అందరూ బదిలీ పరిధిలోకి వస్తారు. ఈ విషయంపై ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘అందరూ బదిలీయా!- పంచాయితీరాజ్ ఉద్యోగుల్లో కలవరం’ శీర్షికతో ‘సాక్షి ’ బుధవారం ప్రత్యేక కథనం ప్రచురించింది. స్పందించిన సంబంధిత మంత్రిత్వ శాఖ గ్రామ కార్యదర్శుల బదిలీలను ప్రస్తుతానికి పూర్తిగా నిలిపివేసింది. ఎంపీడీవోలు, ఈవో (పీఆర్‌ఆర్‌డీ)ల బదిలీల విషయంలోనూ పరిపాలన అవసరాలకు సరిపడా మాత్రమే బదిలీ చేయాలని పాత నిబంధనను సవరించారు. వీటికి అదనంగా డివిజనల్ పంచాయితీ అధికారుల బదిలీలను కూడా తదుపరి ఉత్తర్వులు నిలుపుదల చేయాలని జీవోలో పేర్కొన్నారు.
శాఖ ఒకరిది.. అధికారం మరో మంత్రికి
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి సీహెచ్ అయ్యన్నపాత్రుడు మంత్రిగా కొనసాగుతుంటే, ఆ పథకం అమలు చేసే జిల్లా స్థాయి అధికారుల బదిలీల అధికారం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళినికి అప్పగించారు. ఉపాధి హామీ పథకం జిల్లా స్థాయిలో అమలు చేసే డ్యూమా పీడీలు, ఏపీడీవో బదిలీలు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటికీ, ఈ విషయంపై స్పష్టత కోసం మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎంవో వివరణ కోరినట్టు సమాచారం.
కృష్ణా జడ్పీ సీఈవో నియామకం నిలుపుదల
కృష్ణా జిల్లా జడ్పీ సీఈవోగా టీకే గిరీశ్వర్ నియమాకాన్ని ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
డీఆర్‌డీఏ, డ్యూమా పీడీల నియమాకాలు
గుంటూరు జిల్లా డ్యూమా పీడీగా పనిచేస్తున్న దిల్లీ రావు విజయనగరం జిల్లా డీఆర్‌డీఏ పీడీగా నియమితులయ్యారు. శ్రీకాకుళం డ్యూమా డీపీ ఏ కల్యాణచక్రవర్తి విజయనగరం జిల్లా డ్యూమా పీడీగా నియమితులయ్యారు. ప్రస్తుతం విజయనగరం డ్యూమా పీడీగా ఉన్న గోవిందరాజులును అతని సొంత రెవెన్యూ శాఖకు సరెండర్ చేశారు. చిత్తూరు జిల్లా వ్యవసాయ శాఖ ఏడీ వైవీ రమణరావును శ్రీకాకుళం జిల్లా డీఆర్‌డీఏ పీడీగా నియమించారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ఇన్‌ఛార్జి ముఖ్య కార్యదర్శి ఎస్పీ టక్కర్ ఉత్తర్వులిచ్చారు.
అవసరమైన మేరకే కదలికలు
Published Thu, Nov 13 2014 1:07 AM | Last Updated on Mon, Aug 20 2018 8:09 PM
Advertisement