ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఈ మధ్యకాలంలో వచ్చిన అత్యంత వివాదాస్పద మైన జీవో.. జీవో నంబర్ 57. ఈ ఏడాది మే 18న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవో 57 కోర్టువరకు వెళ్లి ఆగస్టు 8న జీవో 98గా పునరుత్థానం చెందిన వరకూ ఎన్నో మజిలీలూ, ప్రస్థానాలూ! వీటి గమనాన్ని పరిశీలిస్తే ముఖ్యమంత్రి ఊగిసలాటలు, ఆలో చనల్లోని అస్థిరతా ప్రస్ఫుటంగా కనిపించా యి! కేవలం రెండున్నర నెలల కాలంలో విడుదలైన 7 జీవోలు 57, 58, 59, 61, 63, 75ల అనంతరం ఈ 8వ తాజా జీవో 98నీ గమనిస్తే బదిలీలపై ప్రభుత్వం ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెన క్కులా డోలాయమాన స్థితిలోకి వెళ్లి ఊగిసలాడినట్టు స్పష్టమవుతోంది.
ఉద్యోగులు తాము చెప్పిన మాట వినడంలేదనీ, అధికారంలోకి తెచ్చి నోళ్లకే మంచి పోస్టింగులనీ, కార్యకర్తలు చెప్పిందే ఉద్యోగులు చేయాల నీ, కార్యకర్తల కోసం పని చేసేవారిని ఏరికోరి తెచ్చుకుంటామని, చెప్పింది చేయకపోతే చర్యలు తప్పవనీ మినీమహానాడు సందర్భా లుగా గ్రామగ్రామాన సాక్షాత్తూ అమాత్యవర్యులే బహిరంగ ప్రకటనలు గుప్పించిన నేపథ్యంలో వచ్చిన ఈ బదిలీలకు ఉద్యోగులు భయబ్రాంతులయ్యారు!
జీవో 57పై ఉద్యోగ వర్గాల ప్రధాన ప్రతిఘటనల్లా బదిలీలపై జిల్లా ఇన్‌చార్జి మంత్రికి అధికారాన్ని కట్టబెట్టడంపైనే! ఈ మధ్య గుంటూరులో జరిగిన ఓ సభలో సీఎం మాట్లాడుతూ మరో మూడు నెలల్లో పాత చంద్రబాబును చూస్తారని హెచ్చరించిన నేపథ్యంలో టీచర్ల బదిలీ ప్రక్రియ మొదలైంది. ఏ పార్టీకి చెందిన ప్రభుత్వమైనా సరే.. ఉద్యోగుల బదిలీలనగానే రాజకీయ ఒత్తిళ్లూ, పైరవీలు, డబ్బు సంచుల కదలికల్లో డిపార్ట్‌మెంట్‌లోని అదనపు సంపాదనలోని హెచ్చు తగ్గుల తేడాయే తప్ప -ఇటు ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ జారీ చేసే ఉన్నతాధికా రుల నుండి అటు అధికార అనధికార రాజకీయ నేతల వరకూ ఇదో సంరంభం! చంద్రబాబు ప్రభుత్వం ఒక ముందడుగు వేసి, ఈ రహస్య ప్రక్రియకు జీవో 57తో చట్టబద్ధతను కల్పించింది.
ప్రభుత్వం సూత్రీకరించిన పరిధిలోనే తన విధులను నిర్వర్తించా లని ఏ ఉద్యోగి అయినా భావిస్తాడు. కానీ మధ్యలో ఈ ‘పార్టీ కార్య కర్తలు చెప్పినట్లు చేయడమే’మిటో అర్థం కాదు. ప్రభుత్వం నిర్దేశించిన నియమాలకు భిన్నంగా వీళ్ల కోరికలు, ఆశలు గనుక ఉంటే ఆయా పనులకు సంబంధించిన సూత్రీకరణలను ప్రభుత్వ మార్గదర్శకాల లోనే చేర్పిస్తే అటు ప్రభుత్వాన్ని నడిపే కార్యకర్తలకూ, ఇటు ప్రభుత్వ ఉత్తర్వులు పాటించాల్సిన ఉద్యోగులకు ఉభయతారకంగా ఉంటుంది కదా! పార్టీ చెప్పినట్లే పని చేయడానికీ చేయించుకోవడానికీ ఇరుపక్షా లకు మధ్య ఎటువంటి ఘర్షణలకు తావుండదు కదా!
సహజంగా సంవత్సరంలో ఒక్కసారే అంటే మే, జూన్ నెలల మధ్య కాలంలో బదిలీల ప్రక్రియను ముగించుకోవడం ప్రభుత్వానికి పరిపాటి. కానీ ఆర్నెల్లలోనే మళ్లీ బదిలీలకు తెరలేపడం బహుశా రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారౌతుందేమో. నవంబర్ 2014లో జీవో 211 ద్వారా జరిగిన బదిలీలకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలూ, మం త్రుల సిఫారసుల లేఖలను శాఖాధికారులు తయారు చేసుకున్న ఫైళ్లకు అధికారికంగానే గుదిగుచ్చారు. ఏ ఉద్యోగి ఎంత మంది ఎమ్మెల్యేలు/ మంత్రుల నుండి ఎన్ని సిఫారసు లేఖల్ని తీసుకొస్తే ఆ బదిలీకి అంత వెయిటేజీగా పరిగణించడం జరిగింది. రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసి పదవినలంకరించిన పాలకు లు దమననీతితో ఏకపక్షంగా వ్యవహరించకూడదు. పరిధుల్ని దాటిన ఉద్యోగికి వెనువెంటనే ప్రమాదం పొంచి ఉంటే, పాలకులకు ఆ ప్రమా దం ఐదేళ్లకు ఉండితీరుతుంది, ఊడితీరుతుంది కూడా.
ఈ బదిలీల జడికి హడలిపోయిన సగటు ఉద్యోగి తమ ఓట్లే కాకుండా తమ కుటుంబాల ఓట్లూ వేయకపోతే తె.దే.పా అసలు రాష్ట్రంలో గవర్నమెంట్‌ని ఫార్మ్ చేయగలిగుండేదా అని ప్రశ్నించుకుం టున్నాడు, పునరాలోచించుకుంటున్నాడు. ఉద్యోగికిప్పుడు స్థిరచిత్త తనూ, అవ్యాకులంగా పనిచేసే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించ డమూ, భవిష్యత్తులో జరగబోయే బదిలీల్లో అయినా పారదర్శకతను మిస్సవకుండా చూడ్డమూ ప్రభుత్వం ముందున్న కర్తవ్యం.
- వ్యాసకర్త మాజీ సర్పంచ్, బెంకిలి, శ్రీకాకుళం
మొబైల్ : 9000646780
- బి.మోహనరావు
ఉద్యోగుల బదిలీలపై ‘పచ్చ’జెండా రెపరెపలు
Published Mon, Sep 14 2015 1:13 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM
Advertisement