AP: రేపటి నుంచి ఉద్యోగుల బదిలీలు | AP Govt Employee transfers from tomorrow | Sakshi
Sakshi News home page

AP: రేపటి నుంచి ఉద్యోగుల బదిలీలు

Published Sun, Aug 18 2024 5:35 AM | Last Updated on Sun, Aug 18 2024 5:35 AM

AP Govt Employee transfers from tomorrow

బదిలీలపై నిషేధం తాత్కాలిక తొలగింపు 

14 శాఖల్లో ఈ నెలాఖరు వరకు బదిలీలు 

నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి 

ఆ తర్వాత మళ్లీ నిషేధం అమల్లోకి.. 

ఎక్సైజ్‌ శాఖలో వచ్చే నెల 5 నుంచి 15 వరకు బదిలీలు 

ఐదేళ్లు ఒకే చోట పనిచేస్తే తప్పనిసరిగా బదిలీ.. వైకల్యం, అనారోగ్య కారణాలతో బదిలీ కోరితే ప్రాధాన్యత 

గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన వారికీ ప్రయారిటీ 

మార్గదర్శకాలతో ఆర్ధిక శాఖ ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా తొలగించింది. ప్రజా సంబంధిత సేవలందించే 14 శాఖల్లోని ఉద్యోగుల బదిలీలకు సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు అనుమతించింది. ఎక్సైజ్‌ శాఖలో మాత్రం వచ్చేనెల 5 నుంచి 15వ తేదీ వరకు బదిలీలకు అనుమతించింది. ఈ మేరకు మార్గదర్శ­కాలతో కూడిన ఉత్తర్వులను రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్‌ శనివారం జారీ చేశారు. 

ఈ నెలాఖరుకల్లా 14 శాఖల్లో బదిలీలు పూర్తవ్వాలని, వచ్చే నెల 1వ తేదీ నుంచి నిషేధం తిరిగి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎక్సైజ్‌ శాఖలో వచ్చే నెల 16 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. 5 సంవత్సరాలుగా ఒకే చోట పని­చేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇతర ఉద్యోగుల్లో పరిపాలన అవ­స­రాలు లేదా వ్యక్తిగత అభ్యర్థనలపై బదిలీ­లకు అర్హులు. ఎన్నికల ప్రక్రియ కోసం బదిలీలను బదిలీగా పరిగణించరు. కారుణ్య ప్రాతిపదికన నియమితులైన వితంతువులైన మహిళా ఉద్యోగులు, దృష్టి లోపం గల ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది.

బదిలీలు జరిగే శాఖలు
– రెవెన్యూ (భూపరిపాలన), సెర్ప్‌తో సహా పంచాయత్‌ రాజ్‌ – గ్రామీణాభివృద్ధి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్,  అర్బన్‌ డెవలప్‌మెంట్, గ్రామ, వార్డు సచివాలయాలు, పౌర సరఫరాలు,  మైనింగ్‌– జియాలజీ, అన్ని విభాగాలలో ఇంజనీరింగ్‌ సిబ్బంది, దేవదాయ, రవాణా, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక, పరిశ్రమలు, ఇంధన, స్టాంపులు–రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌. 

ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీలను ముందు భర్తీ చేయాలి
నోటిఫైడ్‌ ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని ఖాళీ పోస్టులను ముందుగా భర్తీ చేయాలి. ఐటీడీఏ ప్రాంతాలతో పాటు వెనుకబడిన ప్రాంతాల్లో పోస్టుల భర్తీకి శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యతనివ్వాలి. నిబంధనల ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో రెండేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులు కోరిన చోటుకు బదిలీ చేసేందుకు ప్రాధాన్యతనివ్వాలి. ఐటీడీఏ పరిధిలో బదిలీ చేసే ఉద్యోగులు 50 ఏళ్ల లోపు ఉండాలి. ఐటీడీఏ పరిధిలో గతంలో పనిచేయని ఉద్యోగులను బదిలీ చేయాలి. ఐటీడీఏ పరిధిలో బదిలీ చేసిన ఉద్యోగుల స్థానంలో ప్రత్యామ్నాయం లేకుండా రిలీవ్‌ చేయడానికి వీల్లేదు.  

బదిలీ దరఖాస్తుల పరిశీలనకుఅంతర్గత కమిటీలు
ప్రభుత్వ మార్గదర్శకాలు, షరతులకు అనుగుణంగా సంబంధిత అధికారులు బదిలీలను అమలు చేయాలి. జిల్లా, జోనల్, బహుళ జోనల్‌తో పాటు రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలి. ప్రాధాన్యతల విషయంలో దుర్వినియోగం జరగకుండా సంబంధిత శాఖల అంతర్గత కమిటీలు దరఖాస్తులను పరిశీలించి, తగిన సిఫార్సులు చేయాలి. ఎటువంటి ఫిర్యాదులు, ఆరోపణలకు అవకాశం లేకుండా పారదర్శకంగా గడువులోగా బదిలీల ప్రక్రియను సంబంధిత శాఖాధిపతులు పూర్తి చేయాలి. ఉద్యోగ సంఘాల ప్రతినిధుల బదిలీల విషయంలో నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలి.

ఈ వర్గాలకు బదిలీల్లో ప్రాధాన్యత
– దృష్టి లోపం ఉన్న ఉద్యోగులు, మానసిక వికలాంగ పిల్లలను కలిగి ఉన్న ఉద్యోగులు సంబంధిత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న చోటుకి బదిలీ చేయాలని కోరేవారు
– గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులు
– 40 శాతంకన్నా ఎక్కువ వైకల్యం గల ఉద్యోగులు
– క్యాన్సర్, ఓపెన్‌ హార్ట్‌ ఆపరేషన్స్, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా అటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్న స్టేషన్లకు బదిలీలు కోరుకునే ఉద్యోగులు (స్వయం లేదా జీవిత భాగస్వామి లేదా ఆధారపడిన పిల్లల వైద్యం కోసం)
– భార్య, భర్త ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయితే, వారిద్దరినీ ఒకే స్టేషన్‌లో లేదా ఒకరికొకరు సమీపంలో ఉన్న స్టేషన్‌లలో ఉండేలా బదిలీకి ప్రయత్నించాలి.

ఈ మార్గదర్శకాల ప్రకారం జరిగే అన్ని బదిలీలు, ప్రాధాన్య స్టేషన్ల ఎంపికను వినియోగించుకున్న ఉద్యోగుల బదిలీలను అభ్యర్థన బదిలీలుగా పరిగణిస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement