బదిలీల జాతర | andhra pradesh govt employees lobbying for transfers | Sakshi
Sakshi News home page

బదిలీల జాతర

Published Thu, Nov 13 2014 12:46 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

సచివాలయం హెచ్ బ్లాకులో మంత్రి గంటా ఛాంబర్ వద్ద ఉద్యోగులు పడిగాపులు - Sakshi

సచివాలయం హెచ్ బ్లాకులో మంత్రి గంటా ఛాంబర్ వద్ద ఉద్యోగులు పడిగాపులు

* సచివాలయంలో పైరవీల జోరు... భారీగా బేరసారాలు
* ‘నీడ్ బే్‌స్డ్ ట్రాన్స్‌ఫర్’ మాయాజాలం
* సెక్రటేరియట్‌లో తెలుగు తమ్ముళ్ల కోలాహలం
* బుధవారం ఒకేరోజు 70 మంది టీడీపీ ఎమ్మెల్యేల రాక
* వందల సంఖ్యలో టీడీపీ మండలస్థాయి నాయకులు
* ‘బదిలీలు మా హక్కు’ అన్న టీడీపీ విప్ చింతమనేని
* మంత్రుల పేషీలకు గుట్టలుగా సిఫార్సు లేఖలు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా హడావుడి చేసిన జన్మభూమి కార్యక్రమం మంగళవారం నాటితో ముగియడంతో సచివాలయంలో బదిలీల జాతర మొదలైంది. జన్మభూమి తర్వాత అవసరం ఉన్న మేరకు బదిలీలు (నీడ్ బేస్డ్ ట్రాన్స్‌ఫర్స్) చేయండని అధికారికంగా ఆదేశాలు రావడంతో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించిన వారితో సచివాలయం కిటకిటలాడింది. కనీసం ద్విచక్ర వాహనాలు, కార్లు పెట్టుకునేందుకు స్థలం లభించలేదు. ఏ పేషీ చూసినా ఒకటే హడావుడి. అన్ని చోట్లా బదిలీల మంత్రాంగమే. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో సచివాలయం నిండిపోయింది.

ప్రతిరోజూ సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలోనే సందర్శకులకు సచివాలయంలోకి అనుమతిస్తారు. అదికూడా 300 నుంచి 400 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ బుధవారం ఉదయం 11 గంటలకే సచివాలయంలో కిక్కిరిసిపోయి ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఏదో ఫైలు కనిపించింది. బదిలీల కోసంవచ్చిన దరఖాస్తులన్నిటికీ ఆమోదం తెలపాల్సిన పనిలేదని ఆదేశాల్లో ఉన్నప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో వందలాది మంది సచివాలయానికి చేరుకున్నారు. గుంటూరు, కృష్ణా, అనంతపురం, కర్నూలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన తెలుగుదేశం మండలస్థాయి నేతలు కూడా తమకు కావాల్సిన వారికోసం వచ్చారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యాశాఖ, ఇరిగేషన్ తదితర శాఖల పేషీల వద్ద వందల సంఖ్యలో కనిపించారు.

భారీగా లావాదేవీలు
బదిలీకి ఈనెల 15 వరకే అవకాశం ఉండటంతో పైరవీకారులు భారీగా రంగంలోకి దిగారు. ప్రాధాన్యతను బట్టి ఒక్కో బదిలీకి రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వరకూ పలికినట్టు వచ్చినవారు చర్చించుకోవడం కనిపించింది. కృష్ణా జిల్లాకు చెందిన ఓ తెలుగుదేశం మండల నేత 8 సిఫార్సు లేఖలతో వచ్చారు. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో అద్దెకు దిగి బదిలీ కావాల్సిన వారితో బేరసారాలు నడుపుతున్నారు. ఇది మచ్చుకు ఒక్కటే. ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి.

ముఖ్యంగా నీటిపారుదల శాఖ, పంచాయితీరాజ్ శాఖల్లో ఇంజనీర్ల బదిలీలపై భారీగా లావాదేవీలు నడిచినట్టు తెలుస్తోంది. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన నర్సులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లూ కోరుకున్న చోటకు బదిలీ చేస్తే భారీగా చెల్లించేందుకు సచివాలయానికి వచ్చారు. మరోవైపు బదిలీ కోసం వచ్చిన కొందరు అధికారులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ‘బదిలీలంటే 20 శాతానికి మించకుండా జరగాలి. కానీ తమకు అనుకూలమైన వారిని బదిలీ చేస్తే, ఏపార్టీకి చెందని వారు, ఎలాంటి రాజకీయ పలుకుబడి లేని వారి పరిస్థితి ఏమిట’ని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ అధికారి వాపోయారు. బదిలీలకు సంబంధించి బుధవారం ఒక్కరోజే కోట్లల్లో లావాదేవీలు జరిగినట్టు సమాచారం.

70 మంది ఎమ్మెల్యేలు సచివాలయంలోనే
తమకు నచ్చిన అధికారులను తమ ప్రాంతాల్లో వేయించుకోవడంకోసం, మరికొన్ని లావాదేవీలు నడిచినవి, ఇంకొన్ని కేడర్ కోసం ఇలా రకరకాల సమీకరణల నేపథ్యంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు పదుల సంఖ్యలో సచివాలయానికి తరలివచ్చారు. టీడీపికిచెందిన సుమారు 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు బుధవారం సచివాలయంలో ఉన్నట్టు తెలిసింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, సిద్ధా రాఘవరావు, ప్రత్తిపాటి పుల్లారావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పైడికొండల మాణిక్యాలరావు తదితరులు తమ వారికి అందుబాటుగా సచివాలయంలోనే ఉన్నారు.

ఆర్ అండ్ బీ, వ్యవసాయ శాఖ మంత్రుల పేషీల వద్ద అటు ఎమ్మెల్యేలు, ఇటు అధికారులు క్యూలు కట్టారు. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చాంబర్‌కు విద్యాశాఖ ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పోటెత్తారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాత్రం బదిలీలు చేయడం లేదని ప్రకటించారు. ఉదయమే సచివాలయంకు చేరుకుని వెంటనే వెళ్ళిపోయారు.

బదిలీలు మా హక్కు
ప్రభుత్వ అధికారుల బదిలీలు చేయించుకోవడం మాహక్కు. ఇందులో తప్పేమీ లేదు. అధికారులతో పనిచేయించుకోవాల్సింది మేమేకదా. అందుకే నేను కూడా రెండు బదిలీల కోసం సచివాలయానికి వచ్చాను. ఇంకా నియోజకవర్గానికి సంబంధించిన పనుల కోసం అధికారులను, మంత్రులను కలిసేందుకు వచ్చాను.
- చింతమనేని ప్రభాకర్ (ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement