హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు
జిల్లాలో 17 వేల మందికి
బదిలీ జరిగే అవకాశం
ఇన్‌చార్జి మంత్రికి
బాధ్యతల అప్పగింత
ఈ నెలాఖరు వరకూ
బదిలీలు చేసేలా జీఓ విడుదల
విజయనగరం కంటోన్మెంట్:
ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకూ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీంతో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 17 వేల మందికి బదిలీ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యదర్శి, కలెక్టర్, ఆయా శాఖల అధికారులు ఓ కమిటీగా ఏర్పడి బదిలీలు జరిపేందుకు అవకాశం కల్పించింది.
గత ఏడాది నవంబర్ 15న బదిలీలపై నిషేధం విధించారు. ఇప్పుడా నిషేధాన్ని ఈనెలాఖరు వరకూ ఎత్తివేశారు. ఇప్పటి వరకూ కలెక్టర్లకు మాత్రమే బదిలీ చేసే అధికారం ఉండేది. అయితే ఈ సారి ఆయా జిల్లాల్లో ఉన్న ఇన్‌చార్జి మంత్రులకు బదిలీల పర్యవేక్షణాధికారం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో టీడీపీ మద్దతుదార్లయిన ఉద్యోగులకు అవకాశం కల్పించినట్లయింది. వివిధ ప్రాంతాలకు బదిలీ అయిన వారంతా తిరిగి స్వస్థలాలకు చేరుకునేందుకు వీలవుతుంది. జిల్లాలో 24 వేలకు పైగా ఉద్యోగులున్నారు.
వీరిలోరెండేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నవారు తొమ్మిదివేల మంది ఉండగా, ఐదేళ్లగా ఒకే చోట పనిచేస్తున్న వారు ఎనిమిది వేల మంది ఉన్నారు. రెండేళ్లు ఒకే చోట పనిచేసిన వారు తాము కోరుకునే చోటకు బదిలీ చేయించుకునే అవకాశం ఉంది. ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారికి తప్పనిసరిగా బదిలీలు చేయాలని జీఓలో పేర్కొన్నారు. జూన్ 30, 2016 నాటికి రిటైరయ్యే వారిని బదిలీ చేయకూడదు. అలాగే కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగులు, కోర్టు పరిధిలో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యం, ఎక్సైజ్, రవాణా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉద్యోగులకు ప్రత్యేక జీఓ విడుదల చేస్తారు. సెకండరీ, ఉన్నత స్థాయి గెజిటెడ్ ఉద్యోగులు వారి సొంత జిల్లాలకు బదిలీపై వెళ్లేందుకు అనర్హులు.
అలాగే ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో నేరుగా ఎన్నికైన వారికి, 40 శాతం అంగవైకల్యం ఉన్న వారికి బదిలీల్లో మినహాయింపు ఉంటుంది. వీరితో పాటు మానసిక వికలాంగులైన పిల్లలున్న ఉద్యోగులు, క్యాన్సర్, న్యూరో సంబంధిత వ్యాధులున్న ఉద్యోగులు, కిడ్నీ సంబంధిత వ్యాధులున్న ఉద్యోగులు సరైన వ్యాధి నిర్ధారణ పత్రాలతో తప్పనిసరి బదిలీల నుంచి మినహాయింపు పొందవచ్చు. విజయనగరం జిల్లాలో ఇంటి అద్దె అలవెన్సును 20 శాతం మేర కల్పించడంతో ఈ బదిలీలపై ఉద్యోగులంతా జిల్లా కేంద్రానికి వచ్చేందుకు పెద్దఎత్తున ఉత్సాహం చూపించే అవకాశం ఉంది. దీంతో పాటు పైరవీలకు మరింత ప్రాధాన్యం కల్పించినట్టు ఉద్యోగ వర్గాలే అంటున్నాయి. ఇక ఈ నెలాఖరు వరకూ అధికార పక్షాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఉద్యోగులు బారులు తీరుతారనడంలో సందేహం లేదు.
ఇవి రాజకీయ బదిలీలు
ఇప్పుడు జరగబోయే బదిలీలన్నీ రాష్ర్టస్థాయిలో రూపకల్పన చేసిన రాజకీయ బదిలీలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పేడాడ జనార్దరావు అన్నారు. అయితే కమిటీలో కలెక్టర్ స్థానం కల్పించినందున ఉద్యోగులు రాజకీయ బదిలీలకు బలికాకుండా కలెక్టర్ న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర జేఏసీ కూడా దీనిపై దృష్టిసారించాలని కోరారు.
బదిలీలకు గ్రీన్ సిగ్నల్
Published Tue, May 19 2015 2:47 AM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM
Advertisement
Advertisement