చంద్రబాబు సెల్ఫ్‌గోల్‌ ....!  | Chandrababu Naidu Biggest Self-Goal On Olectra Electric Buses! | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సెల్ఫ్‌గోల్‌ ....! 

Published Sun, Sep 22 2019 2:38 PM | Last Updated on Sun, Sep 22 2019 3:10 PM

Chandrababu Naidu  Biggest Self-Goal On Olectra Electric Buses! - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌ తొలుత పోలవరంలో విజయవంతమవుతూ వందల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఆదా అవుతుండటంతో చంద్రబాబు నాయుడు అండ్‌కో ఒలెక్ట్రా క్విడ్‌ప్రోకోను కొత్తగా తెరమీదకు తెచ్చిందా...? గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు నిర్వహించిన టెండర్లతోపాటు పనుల్లో అవకతవకలు, అవినీతి చోటుచేసుకుని ప్రజాధనం స్వాహా చేశారని నిపుణుల కమిటీ నిర్ధారించటంతో రివర్స్‌ టెండరింగ్‌పై కూడా బురదజల్లుతున్నారా....?పోలవరం ప్రాజెక్టులో రివర్స్‌ టెండరింగ్‌ విధి విధానాలపై ఒక సంస్ధకే మేలు చేసే విధంగా ఉన్నాయంటూ తొలుత పచ్చ మీడియా, తర్వాత నేరుగా చంద్రబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని నిర్ధారణ అవ్వడంతో కొత్తగా క్విడ్‌ప్రోకో అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారా...? తక్కువ ధరకు ప్రాజెక్టు పనులు చేపడితో నష్టం వస్తుందని బాబు బ్యాచ్‌ నిర్ధారించేసిందా? 

అలా నష్టం వస్తే దానికి క్విడ్‌ప్రోకో కింద ప్రభుత్వం మరో రూపంలో నష్టం భర్తీ చేయటం సాధ్యమవుతుందా? గతంలో ఏలినవారికి ఈ కిటుకు ఎలా తెలిశాయి? అసలు అది సాధ్యమవుతుందా? పైగా వారి లెక్కప్రకారం ఏకంగా వందలకోట్ల రూపాయలు క్విడ్‌ప్రోకో. వింటేనే విస్తు కలుగుతోంది. అందులో వాస్తవమెంతో వారి మాటల్లోనే విశ్లేషించి, చంద్రబాబు అండ్‌కో ఆరోపణల్లో నిజమెంతో పరిశీలిద్ధాం. వారి లెక్క ప్రకారం ఐదు వందల కోట్ల తక్కువకు మేఘా ఇంజనీరింగ్‌ టెండర్‌ దాఖలు చేస్తే అందుకు ప్రతిఫలంగా, నష్టాన్ని భర్తీ చేసే విధంగా వేలకోట్ల రూపాయలు ఏపీఎస్‌ ఆర్టీసీ నుంచి బస్సులు కొనుగోలు రూపంలో చెల్లించడం సాధ్యమవుతుందా?  ఏకంగా ఏపీ సర్కార్‌ రూ. 2181 కోట్లు ఒలెక్ట్రాకు (ఒలెక్ట్రా సంస్థలో మేఘా పెట్టుబడులు ఉన్నాయి) చెల్లింస్తుందని తెలుగుదేశం ప్రచారం చేస్తోంది. తద్వారా ఆ సంస్థ క్యాపిటల్‌ 20 వేల కోట్లకు చేరితే అందులో మేఘాకు రూ. 12 వేల కోట్లు ప్రయోజనం చేకూరుతుందని వారి ప్రచారం.

ఇందులో నిజా నిజాలు పరిశీలించే ముందు ఒలెక్ట్రా గురించి పరిశీలిస్తే అస్సలు ఈ బస్సును దేశంలో తొలిసారిగా ప్రమోట్‌ చేసింది నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. 23 మే 2018న అమరావతిలో ఈ బస్సులో ఆయన ప్రయాణించి ఇంధన ఆదాతో పాటు కాలుష్య నివారణకు ఈ-బస్సులు (ఎలక్ట్రిక్ బస్సులు) కొనుగోలు చేయాలని నిర్ణయించామని ప్రకటించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ-బస్సులను ప్రోత్సహించేందుకే ఫేమ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఏపిలో ఒలెక్ట్రా నుంచి ఈ - బస్సులు కొనుగోలు చేసేందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిపాదించినా ఇప్పటికీ పూర్తిగా ఆచరణ సాధ్యం కాలేదు. అందుకు నిధుల కొరత ప్రధాన సమస్య. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 350 బస్సులను సబ్సిడీపై కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించింది. 

ఆ నిధులు ఇంకా విడుదల కాలేదు. ఏపి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుండడంతో కేంద్రం ఇచ్చే నిధులతోనే బస్సులు కొనుగోలు చేయాలి. ఇందుకు టెండర్లు ఇటీవలనే పిలిచింది. ఈ టెండర్లలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ బస్సులను తయారు చేసే సంస్థలు పోటీ పడవచ్చు. ఈ ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది. ఒకవేళ మొత్తం బస్సులన్నీ టెండర్‌లో ఒలెక్ట్రాకే దక్కితే 350 బస్సుల విలువ 700 కోట్లు ఉండవచ్చు. వారి చెబుతున్నట్లుగా జరిగితే అన్ని బస్సులు ఒలెక్ట్రా నుంచే కొనుగోలు చేస్తే ఆ సంస్థ వాటిని ఉత్పత్తి చేసేందుకు అయ్యే ఖర్చు తదితరులు అన్నీ పోనూ నామమాత్రంగా మిగులు ఉంటుంది. అంతేగానీ 700 కోట్ల రూపాయలు అప్పనంగా మిగిలిపోయే అవకాశం ఉండదు. అయితే పచ్చమీడియాతో పాటు చంద్రబాబు బ్యాచ్‌ ఏకంగా వేలకోట్ల రూపాయలు ప్రభుత్వం ఒలెక్ట్రాకు చెల్లిస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతికంగా మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే అసలు ఇందులో క్విడ్‌ప్రోకో ఉందో లేదో ఇట్టే అర్థమైపోతుంది.

క్విడ్‌ప్రోకోలో నిజమెంత?
ఫేమ్-2 (ఫాస్టర్ అడాప్షన్‌ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) విధానం కింద దేశంలో 7090 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడానికి రూ. 3545 కోట్ల ప్రణాళికను ప్రకటించింది. అన్ని రకాల వాహనాలను కలిపితే మొత్తం పదివేల కోట్లను కేంద్రం కేటాయించింది. రాష్ట్రాల రవాణా సంస్థలు విద్యుత్ బస్సులను కొనుగోలు చేయడానికి ప్రతి కిలోవాట్ సామర్థ్యానికి రూ. 20 వేల రాయితీని కూడా ప్రకటించింది. అలాగే రాష్ట్ర రవాణా సంస్థల నిర్వహణ వ్యయాల ఆధారంగా కూడా రాయితీలను కేంద్రం భరించనుంది. ఇందులో భాగంగానే అనేక రాష్ట్రాలు విద్యుత్ వాహానాల విధానాలను ప్రకటించాయి. విద్యుత్ బస్సుల కొనుగోలు రాష్ట్రాలు టెండర్లను పిలుస్తున్నాయి. ఈప్రక్రియ చంద్రబాబు హయాంలోనే మొదలైంది.
 

ఒలెక్టా ఎలక్ట్రిక్ బస్సులు...
ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ బస్సులు ఇప్పటికే అనేక రాష్ట్రాలలో తిరుగుతున్నాయి. తొలిసారిగా ప్రదర్శించింది అమరావతిలోనే. ఆ తర్వాత తిరుమల కొండకు ట్రయల్‌ నిర్వహించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి నుంచి రోహతంగ్‌ పాస్‌ వరకు అత్యంత ఎత్తైన ప్రదేశానికి ప్రయాణించి లిమ్కా బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌కు ఎక్కింది. దీనికి తోడు కేరళలో అయ్యప్పస్వామి యాత్రకు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణా రాష్ట్రాలలో ఇప్పటికే ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తున్నాయి. గత వారమే ముంబయ్‌లో దాదాపు పది ఒలెక్ట్రా బస్సులను సిటీ సర్వీసుల కోసం బెస్ట్‌ ప్రవేశపెట్టింది. పూణేలోనే సీటీ బస్సులుగా నడుస్తున్నాయి. 

హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు నడుస్తున్న 40 ఎలక్ట్రిక్‌ బస్సులూ ఒలెక్ట్రావే.  ఇక్కడ మరో విషయం అశోక్‌ లేలాండ్ కూడా ఇటీవలే ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపిస్తున్నా అవి ఎత్తైన ప్రదేశాలను చేరుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో వివిధ రాష్ట్రాలలో విజయవంతంగ నడుస్తున్నవి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ బస్సులే. ఇవి కాక, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లి, తమిళనాడు, కర్ణాటకతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాలూ కేంద్రం ఇస్తున్న రాయితీని ఉపయోగించుకోవడానికి విద్యుత్‌ బస్సుల కోసం టెండర్లను పిలుస్తున్నాయి. ఫేమ్‌ 2 లో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ కూడా త్వరలో విద్యుత్‌ బస్సుల కోసం టెండర్లను పిలవొచ్చు. ఈ టెండర్లలో ప్రమాణాలు, ఉత్పత్తి సామర్థ్యం, సాంకేతిక అంశాల కారణంగా బస్సుల కొనుగోలు జరుగుతుంది. ఈ వాస్తవాలన్నీ మరిచి సీఎం జగన్‌కు కంపెనీలో పరోక్ష వాటాను అంటగట్టడం, క్విడ్‌ ప్రో కో జరిగినట్టు  వక్రీకరించడం చూస్తుంటే  నిన్నటి దాకా ఏటిఎంగా వాడుకున్న పోలవరం తమ వారి చేతి నుంచి తప్పి పోతుందన్న కడుపు మంట తప్ప  మరేది కనిపించడంలేదు.

ఏమిటీ ఒలెక్ట్రా-బీవైడీ...
ప్రపంచంలో అత్యంత పెద్ద బ్యాటరీ కంపెనీ చైనాకు చెందిన బీవైడీ. దీనికి పోటీ కంపెనీ టెస్లా బ్యాటరీలు విఫలమై పేలిపోయాయి. ఇప్పటివరకు బీవైడీ బ్యాటరీలు పేలిన లేదా పనిచేయకుండా విఫలమైన సందర్భాలు లేవు. ఈ కారణంగానే బీవైడీలో కేవలం 1.92 శాతం వాటా కోసం సామ్‌సంగ్‌ 450 మిలియన్‌ డాలర్ల చెల్లించింది.  ప్రపంచంలోనే ధనవంతుడు వారెన్‌ బఫెట్‌ కూడా వాటా ఉన్న బీవైడీ ఇండియా మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా వుంది. ఇప్పటికే కార్లతో సహా వివిధ రకాల వాహనాలను ప్రపంచ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన బీవైడీ దేశీయ మార్కెట్లోకి వ్యాన్లను కూడా త్వరలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నది. ఇదీ బీవైడీ చరిత్ర. ఇంత పెద్ద కంపెనీతో గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌గా ఉన్నప్పుడే ఒప్పందం కుదిరింది. ఇది మేఘా కృష్టారెడ్డి కొత్తగా లింకెట్టింది కాదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement