నవాబుపేట తోటబడి స్కూల్ సమీపంలో పోలవరం సందర్శనకు వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న విద్యార్థులు
టీడీపీ ప్రభుత్వ ప్రచార తాపత్రయం అంతాఇంఆ కాదు. ముఖ్యంగా పూర్తికాని పోలవరం విషయంలో అయితే చెప్పనక్కర్లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలవరం సందర్శన పేరుతో హడావుడి చేస్తోంది. ఇందుకోసం ఏపీఎస్ ఆర్టీసీని వాడుకునేందుకు పూనుకుంది. విద్యార్థులు, డ్వాక్రా మహిళలను, రైతులను పంపి టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 43 బస్సుల్లో 1,600 మందిని పోలవరం సందర్శనకు పంపారు.
నెల్లూరు(క్రైమ్): ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ ప్రభుత్వం రోజుకో హడావుడి చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో పోలవరం విజిట్ పేరుతో ఆర్భాటం మొదలుపెట్టారు. విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, రైతులను లక్ష్యంగా చేసుకుని పోలవరం ప్రాజెక్ట్ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఓ వైపు అప్పుల ఊబి నుంచి ఆర్టీసీ బయటపడలేక కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రభుత్వ ఆదేశాలంటూ ఉచిత బస్సుల్ని పోలవరానికి తరలిస్తున్నారు. రవాణా చార్జీలను ప్రభుత్వమే ఆర్టీసీ కార్పొరేషన్‌కు చెల్లించాల్సి ఉంది. గతంలో ఇదే తరహలో విజిట్లకు సంబంధించి రూ.38 లక్షల మేరకు బకాయిలుంటే ఆర్టీసీ అధికారులు వరుసగా లేఖలు రాయడంతో రూ.30 లక్షల వరకు చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ.8 లక్షల వరకు ఆర్టీసీకి రావాల్సి ఉంది. తాజాగా గురు, శుక్రవారాల్లో పోలవరానికి 69 బస్సులను తరలించారు. ఇందుకు రూ.44.85 లక్షలు ఖర్చవుతుంది. కాగా ఆ బస్సులన్నీ జిల్లాలో వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నవే. ఇవి లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
కాపర్ డ్యామ్, సొరంగం చూపిస్తారంట
పోలవరం ప్రాజెక్ట్‌లో నిర్మాణంలో ఉన్న కాపర్ డ్యామ్, సొరంగం, ఇతర వాటిని చూపిస్తారంట. జనాల్ని తరలించటం మొదలుకుని బస్సులు పంపడం వరకు అన్ని బాధ్యతలు జలవనరుల శాఖ అధికారులకు అప్పగించారు. దీంతో వారు ఆర్టీసీ అధికారులను సమన్వయం చేసుకుని పోలవరం సందర్శనకు ఆయావర్గాలకు చెందిన వారిని తరలిస్తున్నారు. వెళ్లివచ్చిన వారంతా టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయాలని ఆయా ప్రాంతాల నాయకులు చెబుతున్నారు.
రెండురోజుల్లో 69 బస్సులు
21, 22 తేదీల్లో జిల్లాలోని నెల్లూరు వన్ డిపో (వెంకటాచలం, నెల్లూరు దగదర్తి, పొదలకూరు ప్రాంతాలు) నుంచి 39, నెల్లూరు టూ డిపో (టీపీగూడూరు, ముత్తుకూరు, అల్లూరు) నుంచి 17, గూడూరు డిపో (చిల్లకూరు) నుంచి రెండు, రాపూరు డిపో (డక్కిలి) నుంచి నాలుగు. కావలి డిపో (బోగోలు, కొండాపురం, జలదంకి) నుంచి ఏడు బస్సులను పోలవరం సందర్శనార్ధం పంపారు. వచ్చే నెల 1వ తేదీ వరకు మరో 29 బస్సులు పంపడానికి అంతా సిద్ధం చేశారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులోనే పంపుతున్నారు. నెల్లూరు నుంచి సుమారు రానూ, పోనూ 1,150 కిలోమీటర్లకు పైగా దూరం ఉండడంతో ప్రయాణం కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment