రెండు రోజులే.. | tow days | Sakshi
Sakshi News home page

రెండు రోజులే..

Published Fri, Jun 6 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM

రెండు రోజులే..

రెండు రోజులే..

  • ముమ్మరంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు
  •  అధికారుల హైరానా
  • రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి ఇంకా రెండు రోజులు మాత్రమే గడువుండడంతో అధికారులు నానా హైరానా పడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులు విజయవాడ చేరుకుని సమీక్షల మీద సమీక్షలు జరుపుతుండడంతో గెస్ట్‌హౌస్‌ల్లో సందడి నెలకొంది.
     
    సాక్షి, విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారానికి ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో అధికారులు హైరానా పడుతున్నారు. రాజధాని నుంచి ఉన్నతాధికారులు చేరుకుని సమీక్షలు జరుపుతుండటంతో గెస్ట్‌హౌస్‌లు అధికారులతో కళకళలాడుతున్నాయి.

    విజయవాడలో పలు సమీక్షా సమావేశాలు జరిగాయి. గురువారం అడిషనల్ డీజీలు ఎన్‌వీ సురేంద్రబాబు, దామోదర్ గౌతమ్ సవాంగ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి మహబుబ్ తదితరులు వచ్చారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వీవీఐపీలు వస్తుండటంతో పోలీస్ అధికారులు ముందస్తు భద్రత ఏర్పాట్లు చేపట్టారు. వీఐపీల భద్రత నిమిత్తం విమానాశ్రయ ఆవరణలో తాత్కాలికంగా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు క్యాంపు కార్యాలయం విజయవాడ స్టేట్‌గెస్ట్‌హౌస్‌కు మారవచ్చనే వార్తలు వస్తుండటంతో అధికారులు గెస్ట్‌హౌస్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతులు వేగవంతం చేశారు.

    కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న స్టేట్ గెస్ట్‌హౌస్ 3వ బ్లాక్‌లో నూతన సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తే భద్రతా పరంగా బాగుంటుందని పోలీసు ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్న అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు.

    గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాణస్వీకారానికి గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానాల ద్వారా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు చేరుకోనుండటంతో వారికి నగరంలో స్టార్ హోటళ్లతో పాటు స్టేట్  గెస్ట్‌హౌస్, ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో బస ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.
     
    సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు...
     
    అధికారులకు ప్రోటోకాల్, వారికి బస చేసేందుకు ఏర్పాటు చేసిన హోటళ్లు, అతిథి గృహాలు తదితర సమాచారం కోసం శుక్రవారం నుంచి కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నారు.  పోలీసులు గుంటూరు వెళ్లే రహదారులలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద క్రేన్లను ఉంచాలని నిర్ణయించారు.

    సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ దాన కిషోర్ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో కృష్ణా, గుంటూరు జిల్లాల సమాచార శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోవైపు ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ డీ శ్యాంబాబు  కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఈ నెల 7, 8 తేదీలలో హాజరుకానున్న ప్రముఖుల ప్రోటోకాల్ ఏర్పాట్లపై లైజనింగ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం జరిపారు. రాష్ట్ర స్థాయి అధికారి నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
     
    దుర్గగుడిలోనూ ప్రత్యేక ఏర్పాట్లు...
     
    ఈ నెల 8వ తేదీ  రాష్ర్ట ముఖ్యమంత్రి హోదాలో నారాచంద్రబాబునాయుడు అమ్మవారి దర్శనానికి విచ్చేయనుండటంతో దుర్గగుడి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంతో పాటు పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతర వీఐపీలు అమ్మవారి దర్శనానికి విచ్చేసే అవకాశం ఉండటంతో వారికి ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లను గురువారం ఆలయ ఈవో త్రినాధరావు ఇంజనీరింగ్, వైదిక కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement