ఉదాసీనంగా ఉంటే ఉపేక్షించం
అనంతపురం అర్బన్: జిల్లా వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించేవారిపై చర్యలు తీసుకుంటామని అధికారులను కలెక్టర్ కోన శశిధర్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన తన క్యాంప్ కార్యాలయం ఆర్‌డీఓలు, మునిసిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దారులు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 40 శాతం మందికి బ్యాంక్ ఖాతాలు లేవని తెలిసిందన్నారు. నగదు రహిత లావాదేవీలు వందశాతం జరగాలన్న లక్ష్యంతో ఉన్నందున ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగదు రహిత లావాదేవీలు ఎందరు నిర్వహిస్తున్నారు, స్వైపింగ్ యంత్రాలు ఎంత మంది ఏర్పాటు చేసుకున్నారు అనే వివరాలను ఈ నెల 4 నాటికి ఇవ్వాలని చెప్పామన్నారు. అయితే 13వ తేదీ వచ్చినా కొందరు పంపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జరిగిన సర్వే వివరాల ఆధారంగా బ్యాంక్ ఖాతా దరఖాస్తులను, రూపే కార్డులను సిద్ధం చేస్తామన్నారు. ఇందు కోసం 18,696 మంది వాలంటీర్లను, 1,269 మంది దరఖాస్తులు పూరించే సిబ్బందిని, 367 మంది క్లస్టర్ సిబ్బందిని, 1,306 మంది బ్యాంక్ లైజన్ అధికారులను సిద్ధంగా ఉంచామన్నారు.