పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
- అధికారులకు కలెక్టర్ కోన శశిధర్ ఆదేశం
అనంతపురం అర్బన్ : పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. కాపీయింగ్‌కు తావివ్వకుండా 20 మందితో ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లను కంప్యూటర్ ర్యాండమైజేషన్ పద్ధతిలో నియమించాలన్నారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం ఆయన విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎంత మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని ప్రశ్నించారు. ఇన్‌చార్జి డీఈఓ లక్ష్మీనారాయణ సమాధానమిస్తూ 49,576 మంది విద్యార్థులు 193 కేంద్రాల్లో పరీక్ష రాస్తున్నారని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాలన్నారు.
ఒక్క విద్యార్థి కూడా నేలపై కూర్చుని పరీక్ష రాసే పరిస్థితి ఉండకూడదని, అన్ని కేంద్రాల్లోనూ బెంచీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తగినంత వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని, తాగునీరు ఏర్పాటు చేయాలని సూచించారు. బాత్రూములు బాలురకు, బాలికలకు వేరుగా ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సమయానికన్నా ముందే చేరుకునేలా మండలాల పరిధిలో బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ప్రసాద్‌రెడ్డికి చెప్పారు.
కేంద్రాల వద్ద ఏఎన్‌ఎంలను నియమించాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ వెంకటరమణను ఆదేశించారు. సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను పరీక్షకు గంట ముందుగా మూసేయించి పరీక్ష ముగిసిన తర్వాత గంట వరకు తెరవకుండా చూడాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని డీఈఓను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, ఇన్‌చార్జి జేసీ-2 రఘునాథ్, డీఆర్వో మల్లీశ్వరిదేవి తదితరులు పాల్గొన్నారు.