– 13న ఎన్నికల నోటిఫికేషన్
– 20 వరకు నామినేషన్ల స్వీకరణ
– మార్చి 9న పోలింగ్, 15న ఓట్ల లెక్కింపు
– కలెక్టర్ కోన శశిధర్
అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ (అనంతపురం, వైఎస్‌ఆర్, కర్నూలు) పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అసవరమైన అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకియపై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ఇప్పటికే విడుదల చేసిందని కలెక్టర్ చెప్పారు. నోటిఫికేషన్‌ను ఈనెల 13న విడుదల చేస్తామన్నారు. ఆ రోజు నుంచి 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తామని చెప్పారు. 21న పరిశీలన ఉంటుందనీ, అర్హతలేని నామినేషన్లను తిరస్కరిస్తామన్నారు. నామినేషన్ల ఉపంసహణకు 23వ తేదీ ఆఖరన్నారు. మార్చి 9న పోలింగ్ ,15న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియను 18లోగా పూర్తిచేస్తామన్నారు. ఎన్నికల నియమావళి, నియమ నిబంధనల గురించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించామన్నారు.
అధికారులను నియమించాము
ఎన్నికల నిర్వహణకు అధికారులను నియమించామని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. ఎన్నికల రిటన్నింగ్ అధికారిగా (ఆర్‌ఓ) కలెక్టర్ వ్యవహరిస్తారన్నారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి (ఏఆర్‌ఓ)గా జిల్లా రెవెన్యూ అధికారి ఉంటారన్నారు. ఆర్‌డీఓలు డిప్యూటీ ఎన్నికల అధికారులుగా, తహశీల్దారులను మోడల్ కోడ్ ఇన్‌చార్జీలుగా నియమించామన్నారు. జిల్లాలోని 63 మండలాల్లో ఫ్లయ్యింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ల చివరి తేదీ వరకు ఎన్నికల ఓటరు నమోదు అప్‌డేషన్లు ఉంటాయన్నారు. ఈసారి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థి ఫోటో కూడా ముద్రితమై ఉంటుందన్నారు.
కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు
ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘిస్తే చర్యలు ఉంటామని కలెక్టర్ హెచ్చరించారు. పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు విషయంలో ఆంక్షలు లేవన్నారు. ఎన్నికల ప్రచార ప్రకటనలు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో చేసుకోవచ్చన్నారు. డబ్బుల పంపిణీ, ఎన్నికలకు విఘాతం కలిగించే ఘటనలకు పాల్పడితే చర్యలు ఉంటాయన్నారు. అయితే ప్రచార ప్రకటన ఎంసీఎంసీ (మీడియా సర్టిఫికెషన్ మానిటరింగ్ కమిటీ) ఆమోదం తప్పని సరిగా పొందాల్సి ఉంటుందన్నారు. పాఠశాలల్లో ప్రచారం నిర్వహించకూడదన్నారు.
అత్యవసర పనులు చేపట్టవచ్చు
ప్రస్తుతం జరుగుతున్న పనులు మినహా కొత్త పనులు చేపట్టడానికి వీలులేదని కోన శశిధర్ చెప్పారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేపట్టకూడదని చెప్పారు. ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షలు నిర్వహించకూడదన్నారు. ఉపాధి పనులు, కరువు సహాయక పనులు, నీటి సరఫరాకు సంబంధించిన అత్యవసర పనులు చేపట్టవచ్చన్నారు.
త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ షెడ్యూల్
త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ని ఎన్నికల కమిషన్ విడుదల చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ ఎన్నికలకు జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తాం
Published Tue, Feb 7 2017 11:06 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement