పకడ్భందీగా ఎన్నికలు నిర్వహిస్తాం : జిల్లా కలెక్టర్
పకడ్భందీగా ఎన్నికలు నిర్వహిస్తాం : జిల్లా కలెక్టర్
Published Tue, Mar 7 2017 7:50 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్భందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్, ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్‌లు ప్రకటించారు. ఎన్నికల నిర్వహణపై మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... జిల్లాలో మొత్తం 1361 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈనెల 9వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వీరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని కలెక్టర్ అన్నారు.
మొత్తం 14 పోలింగ్ స్టేషన్లను జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందనందన్నారు. ఇందులో తిమ్మాజీపేటలో 11మంది, కల్వకుర్తిలో 294మంది, వంగూరులో 26మంది, ఉప్పునుంతలలో 11మంది, తెలకపల్లిలో 41మంది, నాగర్‌కర్నూల్‌లో 353 మంది, బిజినేపల్లిలో 86 మంది, కోడేరులో 11మంది, కొల్లాపూర్‌లో 123, పెద్దకొత్తపల్లిలో 20మంది, లింగాలలో 16మంది, బల్మూర్‌లో 29మంది, అచ్చంపేటలో 269మంది, అమ్రాబాద్‌లో 71మంది ఉపాధ్యాయులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్ చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంగళవారం సాయంత్రం ఆరుగంటల నుంచి గురువారం సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్ కేంద్రాల ఆవరణలో 144 సెక్షన్ విధించడంతోపాటు ఎన్నికల ప్రచారాన్ని నిషేధించామని ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్ తెలిపారు. ఓటుహక్కు ఉన్న వారికి రెండురోజులపాటు ప్రభుత్వం అధికారికంగా సెలవు మంజూరు చేసిందని చెప్పారు. ఈసందర్భంగా తమ ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చని ఎస్పీ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో జేసీ సురేందర్‌కరణ్, జిల్లా పౌర సంబంధాల అధికారి రాంమోహన్‌రావులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement