మోగిన నగారా
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
ఈనెల 16 వరకు నామినేషన్ల స్వీకరణ
17న నామినేషన్ల పరిశీలన, 19న అభ్యర్థుల తుది జాబితా
జూలై 3న పోలింగ్, 7న ఓట్ల లెక్కింపు
చిత్తూరు(సెంట్రల్): జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల నగారా మోగింది. జిల్లా జాయింట్ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి నారాయణ్‌భరత్ గుప్తా మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు మంగళవారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని ఆయన తెలి పారు. సహాయ రిటర్నింగ్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి విజయ్‌చందర్ ఉంటారని, తాను లేని సమయంలో ఆయన కార్యాలయంలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చని చెప్పారు. 17వ తేదీ నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, తరువాత నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. ఈనెల 19వ తేదీ అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారని జేసీ తెలిపారు. జూలై 3వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, చిత్తూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరం, మదనపల్లెలో ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరం, తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో టీటీడీసీ(డీఆర్డీఏ)సమావేశ మందిరంలో పోలింగ్ నిర్వహించనున్నట్లు జేసీ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 1,184 మంది ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారని ఆయన తెలిపారు. ఓట్ల లెక్కింపు జూలై 7వ తేదీ ఉదయం 8 గంటలకు చిత్తూరులోని పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలలో జరుగుతుందన్నారు. ఇటీవల జరిగిన రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచాలని నాయకులు ప్రతిపాదించారని, ఈ మేరకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు పంపారని, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతారని జేసీ తెలిపారు. డీఆర్వో,సహాయ రిటర్నింగ్ అధికారి విజయ్‌చందర్, ఎన్నికల విభాగం సిబ్బంది సుధాకర్, పవన్‌కుమార్ పాల్గొన్నారు.