మంత్రులకు ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలు | TRS Strategies are aimed at Winning the MLC Election | Sakshi
Sakshi News home page

మంత్రులకు ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలు

Published Sat, May 11 2019 5:36 AM | Last Updated on Sat, May 11 2019 5:36 AM

TRS Strategies are aimed at Winning the MLC Election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) వ్యూహాలు సిద్ధం చేస్తోంది. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను ఆయా జిల్లాల మంత్రులకు అప్పగించింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ నెల 7న మొదలైంది. 14తో ముగియనుంది. శనివారం, ఆదివారం సెలవుదినాలు కావడంతో చివరి రెండురోజులే నామినేషన్‌ దాఖలుకు అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేసేలా ఆ పార్టీ అధిష్టానం ఏర్పాట్లు చేసింది. అభ్యర్థుల ప్రకటనతో సంబంధం లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన వ్యూహం అమలు చేయాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో మంత్రులు రంగంలోకి దిగారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటర్లుగా ఉండే వారి జాబితాను సిద్ధం చేసుకున్నారు. 

అవసరమైతే క్యాంపులు... 
 ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ ఉంటే ఎలా వ్యవహరించాలనే దానిపై మంత్రులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అవసరమైతే క్యాంపులను నిర్వహించాలని నిర్ణయించారు. క్యాంపుల్లో కచ్చితంగా 70 శాతానికిపైగా ఓటర్లు ఉండేలా కసరత్తు చేస్తున్నారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారు. పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు జనవరిలో జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. వివిధ కారణాలతో కొందరు రాజీనామాలు చేశారు. దీంతో తాజా వివరాల ప్రకారం ఓటర్ల జాబితాను సేకరిస్తున్నారు. 2014లో పరిషత్, పురపాలక ఎన్నికలు జరిగాయి. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుత లెక్కల ప్రకారం 3 స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమనే చెప్పొచ్చు. వరంగల్‌ ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు, నల్లగొండ ఎమ్మెల్సీ బాధ్యతను జగదీశ్‌రెడ్డికి, రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను మల్లారెడ్డికి అప్పగించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది.  

రాజీనామాల నేపథ్యంలో ఉప ఎన్నికలు... 
2015 డిసెంబరులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికైన కొండా మురళీధర్‌రావు(వరంగల్‌), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(నల్లగొండ), పట్నం నరేందర్‌రెడ్డి(రంగారెడ్డి) 2018 డిసెంబరులో రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఉప ఎన్నికల్లో గెలిచినవారి పదవీకాలం 2022 జనవరి 4 వరకు ఉంటుంది. ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణల ఆధారంగా టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించనున్నారు. వరంగల్‌ స్థానానికి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి.

 నల్లగొండ స్థానానికి సిట్టింగ్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు.. రంగారెడ్డి స్థానానికి మాజీమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, కె.నవీన్‌రావు, పటోళ్ల కార్తీక్‌రెడ్డి పేర్లను టీఆర్‌ఎస్‌ అధిష్టానం పరిశీలిస్తోంది. 2015లో జరిగిన ఎన్నికల్లో రంగారెడ్డి, వరంగల్‌ స్థానాలను టీఆర్‌ఎస్, నల్లగొండ స్థానాన్ని కాంగ్రెస్‌ గెలుచుకున్నాయి. ఈసారి కచ్చితంగా 3 స్థానాలను గెలుచుకోవాలని టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన నల్లగొండ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఓటర్ల జాబితా ఆధారంగా మూడు జిల్లాలకు ప్రత్యేకంగా ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసింది.

ఏకగ్రీవాల్లో టీఆర్‌ఎస్‌ జోరు

మూడో విడతలో 28 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం

ఏ ఒత్తిళ్లూ లేకుండా ఏకగ్రీవం అయ్యాయని నిర్ధారించాకే ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 14న జరగనున్న తుది విడత పరిషత్‌ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ఆయా ఎంపీటీసీ స్థానాల్లో సింగిల్‌ నామినేషన్లపై స్పష్టత వచ్చింది. ఈ మూడో విడతలో భాగంగా 1,738 ఎంపీటీసీ స్థానాల్లో 30 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే ఏకగ్రీవాల ప్రకటనపై సంబంధిత జిల్లా కలెక్టర్లు తమ స్థాయిలో ఇవి ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు, బెదిరింపులు లేకుండానే జరిగాయని నిర్ధారించుకున్నాకే గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనున్నారు. దీంతో వీటిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. తుది విడతలో ఏకగ్రీవం కానున్న 30 ఎంపీటీసీ స్థానాల్లో 28 ఎంపీటీసీలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుచుకోగా రెండు చోట్ల ఇండిపెండెంట్లు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.

దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో మూడో విడతలో ఎన్నికలు జరగనున్న ఎంపీటీసీ స్థానాలు, వాటికి పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను జాబితా నుంచి ఇంకా తొలగించలేదు. ఈ కారణంగా తుది విడతలో 1,738 ఎంపీటీసీ స్థానాలకు 5,726 మంది బరిలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలి విడతలో రెండు జెడ్పీటీసీలు, 69 ఎంపీటీసీ స్థానాలు, రెండో విడతలో ఒక్క జెడ్పీటీసీ స్థానం, 63 ఎంపీటీసీ స్థానాలు, మూడో విడతలో 30 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మూడు విడతల్లో కలిపి ఐదు ఎంపీటీసీ స్థానాలు మినహా అన్నింటిని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. రెండు ఎంపీటీసీలను కాంగ్రెస్, మరోమూడు ఎంపీటీసీలను స్వతంత్రులు గెలుచుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement