నామినేషన్ దాఖలు చేస్తున్న చంద్రశేఖర్‌గౌడ్
సాక్షి, నిజామాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఈ ఎన్నికల బరిలో నిలుస్తుండటంతో సంబంధిత వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. మరో వైపు ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. వారి అనుచరవర్గం పట్టభద్రులైన ఓటర్లను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఈనెల 22న పోలింగ్ జరుగనుంది. కీలకమైన నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఇప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నం కాగా, చివరి రోజు జిల్లాకు చెందిన ముగ్గురు నామినేషన్లను దాఖలు చేశారు. రుద్రూర్‌కు చెందిన గ్రూప్–1 ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, వీఎం శివకుమార్, నిజామాబాద్ నగరా నికి చెందిన అడ్వొకేట్ రెంజర్ల సురేష్ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.
మంగళవారం కరీంనగర్ తరలివెళ్లిన అభ్యర్థులు అక్కడి కలెక్టరేట్‌లో నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ల ఉప సంహరణకు ఈనెల 8 వరకు గడువుంది. ఆ తర్వాత బరిలో ఉండే అభ్యర్థులెవరో తేలనుంది.ఊపందుకున్న ప్రచారం..నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికల బరిలో నిలవాలని భావించిన అభ్యర్థులు ముందుగానే ఓటరు నమోదు ప్రక్రియపై దృష్టి సారించారు. ఆయా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ఇతర సంఘాలను కలుస్తూ ఓటరు నమోదు చేపట్టిన అభ్యర్థులు ఇప్పుడు ప్రచారంపై దృష్టి సారించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అనుచరులు జిల్లాలో ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీలోని పట్టభద్రులతో మంగళవారం జీవన్‌రెడ్డి మద్దతుదారులు సమావేశమయ్యారు.
బీజేపీకి రెబెల్..
ఈ ఎన్నికల్లో బీజేపీకి రెబల్ బెడద ఎదురవుతోంది. బీజేపీ తమ అభ్యర్థిగా పి.సుగుణాకర్‌రావును ప్రకటించింది. అయితే ఏబీవీపీ రాష్ట్ర నేత రణజిత్‌మోహన్ రెండు రోజుల క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థికి రెబల్ తలనొప్పిగా మారింది. కాగా టీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా పనిచేసి ఇటీవల ఉద్యోగానికి రాజీనామా ప్రకటించిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ బరిలో నిలుస్తున్నారు. ఆయన టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు చేశారు. అయితే గులాబీ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. నామినేషన్ వేసేందుకు సన్నాహాలు చేసుకున్న ఎస్‌ఎస్‌ఆర్ విద్యాసంస్థల అధినేత ఎం మారయ్యగౌడ్ ఎంపీ కవిత సూచనల మేరకు చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment