నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా సోమవారం ప్రగతి భవన్‌లో తన తండ్రి, సీఎం కేసీఆర్‌తో కవిత
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి, టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. 672 ఓట్ల భారీ మెజారిటీ దక్కించుకున్నారు. బరిలో నిలిచిన బీజేపీ, కాంగ్రెస్‌లకు డిపాజిట్లు కూడా దక్కలేదు. మొత్తం 823 ఓట్లు పోలవగా, మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోనే ఫలితం తేలిపోయింది. 728 (88%) మొదటి ప్రాధాన్యత ఓట్లు కవితకే దక్కాయి. రెండోస్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి పోతనకర్ లక్ష్మీనారాయణకు 56 మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా, మూడో స్థానానికి పడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి వి.సుభాష్ రెడ్డికి 29 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. కాగా, పది ఓట్లు చెల్లలేదు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 9న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా, ఉదయం 10.30 గంటలకల్లా ఫలితం వెలువడింది. ఎన్నికల సంఘానికి నివేదించిన అనంతరం కవితకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు.
డిపాజిట్లు కోల్పోయిన జాతీయ పార్టీలు..
అభ్యర్థులకు డిపాజిట్లు దక్కాలంటే మొత్తం పోలైన ఓట్లలో ఆరోవంతు ఓట్లు రావాలి. మొత్తం 823 ఓట్లలో ఆరోవంతు అంటే 138 మొదటి ప్రాధాన్యత ఓట్లు రావాల్సి ఉంటుంది. కానీ, బీజేపీకి 56, కాంగ్రెస్‌కు 29 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. రెండు పార్టీల అభ్యర్థులకు కలిపినా డిపాజిట్లు దక్కేలా ఓట్లు రాకపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమైంది. కాంగ్రెస్, బీజేపీల నుంచి గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కవితకు ఓట్లేయడం గమనార్హం. స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, జిల్లా, మండల పరిషత్‌లతో కలిపి కాంగ్రెస్ పార్టీకి మొత్తం 141 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో సుమారు 75 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో మిగిలిన సుమారు 66 మంది కూడా ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయలేదు. అందులో 29 మంది మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి వి.సుభాష్‌రెడ్డికి ఓటు వేశారు. దీన్ని బట్టి చూస్తే 37 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు తేలింది. జిల్లాలోని స్థానిక సంస్థల్లో కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీకి నామమాత్రంగానే బలముంది. బీజేపీకి 85 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 56 ఓట్లు సాధించింది. ఈ ఎన్నికల నాటికి ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఆత్మ ప్రబోధానుసారం ఓట్లేశారు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా వారి అంతరాత్మ ప్రబోధా నుసారం ఓటేశారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో డూప్లి కేట్ బాండ్లు, మోసపూరిత హామీలిచ్చి రైతు లను, ప్రజలను మోసం చేసి గెలిచారని విమర్శిం చారు. కవిత గెలుపునకు సహకరించిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం ఆశీస్సులు తీసుకున్న కవిత
ఎమ్మెల్సీగా గెలుపొందిన కవిత రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రం తీసుకుని జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు సురేశ్‌రెడ్డితోపాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేసీఆర్ అభినందించారు. అనంతరం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఆయన నివాసంలో కవిత కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. బుధవారం ఆమె మండలి సభ్యురాలిగా ప్రమాణం చేయనున్నారు.
అందరికీ కృతజ్ఞతలు: కవిత
‘‘ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు, మద్దతు తెలిపిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా గెలుపునకు కృషి చేసిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు’’అని కవిత ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment