► చర్చనీయాంశంగా బోగస్ ఓట్ల నమోదు వ్యవహారం
► కలెక్టర్ వద్దే విచారణ నివేదిక
► బాధ్యుల సంగతి పక్కన పెట్టారా..!
► చర్యలు అడ్డుకునేందుకు కలెక్టర్‌పై ఒత్తిడి
► సీఎం పేషీ స్థాయిలో మంత్రాంగం
► ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిగిలిన అధికారులు
► అసలు సూత్రధారులపై చర్యల కోసం సర్వత్రా డిమాండ్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: బోగస్ ఓట్ల నమోదు వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన వారిపై చర్యలు తీసుకోవడంలో జిల్లా కలెక్టర్ మరింత ఆలస్యం చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ముఖ్యనేత ఒత్తిడులతోనే బాధ్యులపై చర్యల వ్యవహారం మరింత ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బోగస్ ఓట్ల నమోదు వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఓ రెవెన్యూ డివిజనల్ స్థాయిని తప్పించేందుకు నగరానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా జిల్లా కలెక్టర్ పైనే ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. దీంతో బోగస్ ఓట్ల నమోదు వ్యవహారానికి సంబంధించిన నివేదికపై చర్యలు మరింత ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. అనర్హులకు ఓటు హక్కు కల్పించి తీవ్రస్థాయిలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలకు ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాన్ని కలెక్టర్ ఆషామాషీగా తీసుకోకుండా బాధ్యులైన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని అధికార వర్గాలే డిమాండ్ చేస్తుండటం గమనార్హం.
అనర్హులకు ఓటు హక్కు కల్పించడంలో కొందరు రెవెన్యూ అధికారులు కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. డివిజనల్ స్థాయి రెవెన్యూ అధికారి అండతోనే కొందరు ఎన్నికల తహశీల్దార్లు అధికార పార్టీకి అనుకూలంగా బోగస్ ఓట్ల నమోదు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. వాస్తవానికి బోగస్ ఓట్ల నమోదు పెద్ద ఎత్తున జరిగింది. విచారణలోనూ ఈ విషయాలు బయటపడ్డాయి. విచారణ మొక్కుబడిగా సాగడం, వాస్తవానికి విరుద్ధంగా అక్రమాలకు పాల్పడిన తహశీల్దార్లపై చర్యలు తీసుకోకుండా కేవలం ఎంపీడీఓలు, ఎంఈఓలపైనే చర్యలు తీసుకోవడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. అక్రమాలకు తాము పూర్తిగా బాధ్యులం కాదని ఎంపీడీఓ, ఎంఈఓలు వాపోయారు. రెవెన్యూ అధికారులను పథకం ప్రకారం తప్పించేందుకే ఎంపీడీఓ, ఎంఈఓలకు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారన్న ప్రచారమూ జరిగింది. కోర్టు, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో బోగస్ ఓట్ల నమోదు వ్యవహారంపై జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక సైతం కలెక్టర్‌కు చేరినట్లు తెలుస్తోంది. ఇంత వరకు చర్యల్లేవు.
బోగస్ ఓట్ల నమోదు వ్యవహారంలో ఒక రెవెన్యూ డివిజనల్ స్థాయి అధికారే కీలకపాత్ర పోషించిన నేపథ్యంలో ఆ అధికారిపై చర్యలు తీసుకోకూడదంటూ కలెక్టర్‌పైనే ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సదరు అధికారి నగరానికి చెందిన ముఖ్యనేత వద్దకు పరుగులు పెట్టి కలెక్టర్ చర్యలు తీసుకోకుండా కాపాడాలంటూ వేడుకున్నట్లు సమాచారం. దీంతో సదరు నేత సీఎం పేషీ స్థాయిలో కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం కోసమే సదరు అధికారులు బోగస్ ఓట్లను నమోదు చేయించారని, అతనిపై చర్యలు తీసుకోవడం సరికాదని ముఖ్యనేత ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో రెవెన్యూ డివిజనల్ అధికారిపై ప్రస్తుత పరిస్థితుల్లో చర్యలుండే అవకాశం లేదని అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాదూ కూడదని కలెక్టర్ చర్యలు తీసుకునే పక్షంలో తప్పు చేసే అధికారులకు ఇదో గుణపాఠంలా ఉంటుందని కొందరు జిల్లా స్థాయి అధికారులు వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తంగా ప్రస్తుతం ఫైలు కలెక్టర్ వద్దే ఉంది. ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఏం చేస్తారు..? నివేదికలో ఏముంది..? అసలు అక్రమాలకు బాధ్యులెవరు..? ప్రధాన పాత్ర పోషించిన ఉన్నతాధికారి ఎవరు...? నిజంగానే వారిపై చర్యలుంటాయా..? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే కలెక్టర్ నిర్ణయం కోసం వేచి చూడాల్సిందే..!
బోగస్‌పై చర్యలేవీ..?
Published Tue, Feb 28 2017 6:40 PM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
Advertisement