ప్రతీకాత్మక చిత్రం
చెన్నారావుపేట: రెవెన్యూ అధికారుల కళ్లు గప్పి, వారికే టోకరా ఇచ్చి.. ఇద్దరు రైతులకు చెందిన రెండు ఎకరాల భూమిని ఓ యువకుడు తన పేరు మీదికి మార్చుకుని పట్టా పాస్ పుస్తకం పొందిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలతోపాటు ప్రభుత్వం అందించిన పెట్టుబడి సాయం రూ.8 వేలు కూడా తీసుకోవడం గమనార్హం.
స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కూరపాటి అబ్బయ్య, కూరపాటి వీరస్వామికి సర్వే నంబర్ 219లో చెరో ఎకరం ఉంది. ఈ క్రమంలో నెక్కొండ మండలం ముదిగొండకు చెందిన కూరపాటి రాజు చెన్నారావుపేట తహసీల్దార్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ తెలుసుకొని అబ్బయ్య, వీరస్వామి పేరు మీద ఉన్న రెండు ఎకరాల భూమిని తన పేరు మీద చేసుకున్నాడు. రైతు బంధు పథకంలో పాస్‌బుక్, వచ్చిన డబ్బులు రూ.8 వేలు తీసుకున్నాడు.
అబ్బయ్య, వీరస్వామి తమ భూమికి పట్టాలు, డబ్బులు రాలేదని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టగా వారిద్దరి భూమి రాజు పేరుమీద ఉన్నట్లు తెలిసింది. దీంతో ఇద్దరు రైతులు లబోది బోమంటూ తమకు న్యాయం చేయాలని తహసీల్దార్‌ను కోరారు. ఈ వ్యవహారంపై బాధిత రైతులు స్థానిక పెద్దలను కలిసి మొరపెట్టుకోవడంతో వారు రాజును పిలిచి విచారించగా అసలు విషయం బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment