ఓటరు నమోదుపై ప్రచారం నిర్వహించండి
– 11న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం
– వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్ వెల్లడి
కర్నూలు(అగ్రికల్చర్): జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటర్ల జాబితా సవరణ, ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తయారీపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి స్పందన అంతంతమాత్రంగానే ఉందని, దీనిపై అన్ని వృత్తి విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా ప్రోత్సహించాలన్నారు. అన్ని విద్యా సంస్థల్లో ఫారం–6 దరఖాస్తులను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ నెల 11వ తేదీని ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఓటరు నమోదు దినంగా ప్రకటించిందని, ఆ రోజునా అన్ని పోలింగ్ కేంద్రాలను తెరచి ఉంచి ఓటరు నమోదుకు దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. ఎంఎల్‌సీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయులు, పట్టభద్రుల నుంచి ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, దరఖాస్తులను గురువారం సాయంత్రం వరకు స్వీకరించాలని తెలిపారు. బీఎల్‌ఓలకు గౌరవ వేతనాలు చెల్లించేందుకు విడుదల చేసిన బడ్జెట్ ల్యాప్స్ కాకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కర్నూలు నుంచి జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఫారం–6 దరఖాస్తులు 22605, ఫారం–7 దరఖాస్తులు 415, ఫారం–8 దరఖాస్తులు 7570, ఫారం–8ఎ దరఖాస్తులు 355 వచ్చాయన్నారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నట్లు వివరించారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ హరికిరణ్, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, అన్ని నియోజకవర్గాల ఈఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.