సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌పై యుద్ధంలో డీఆర్‌డీవో మరో ముందడుగు వేసింది. వేర్వేరు ఉపరితలాల నుంచి వైరస్‌లను తొలగించేందుకు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో శానిటైజింగ్ యంత్రాలను అభివృద్ధి చేసింది. ఢిల్లీలోని డీఆర్‌డీవో సంస్థ ‘ద సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ మేనేజ్‌మెంట్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (సీఎఫ్‌ఈఈఎస్)’అభివృద్ధి చేసిన ఈ యంత్రాల్లో ఒకటి అవసరమైన చోటుకు మోసుకెళ్లేది కాగా, రెండోది చక్రాలపై ఉంచి తరలించగలిగేది. మంటలు ఆర్పేందుకు పనికొచ్చే యంత్రాలను రీడిజైనింగ్ చేయడం ద్వారా తాము ఈ శానిటైజింగ్ యంత్రాలను అభివృద్ధి చేసినట్లు డీఆర్‌డీవో ఒక ప్రకటనలో తెలిపింది.
పోర్టబుల్ యంత్రం ద్వారా ఒక శాతం హైపోక్లోరైట్ ద్రావణాన్ని చల్లవచ్చని, బ్యాక్‌ప్యాక్ ద్వారా తీసుకెళ్లగలమని వివరించింది. గాలితోపాటు ద్రావణాన్ని కూడా చేర్చి స్ప్రే చేయడం దీని ప్రత్యేకతని తెలిపింది. ఒక యంత్రం ద్వారా దాదాపు 300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో శానిటైజేషన్ చేపట్టవచ్చని పేర్కొంది. చక్రాలపై ఉంచి తరలించగల రెండో యంత్రంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని మాత్రమే పొగమంచు మాదిరిగా మార్చి పిచికారీ చేసేందుకు ఏర్పాట్లు ఉంటాయని తెలిపింది. ఒక్కోటి 3,000 చదరపు మీటర్ల విస్తీర్ణాన్నిశుభ్రం చేయగలదని వివరించింది. 50 లీటర్ల ద్రావణాన్ని నింపుకోగల ట్యాంకు ఇందులో ఉంటుందని.. 12నుంచి 15 మీటర్ల దూరం వరకూ పిచికారీ చేయవచ్చని తెలిపింది. ఢిల్లీ పోలీసులకు ఇప్పటికే ఈ యంత్రాలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment