
రాష్ట్రం రగిలిపోతుంటే నోరెత్తరేం ? : శోభా నాగిరెడ్డి
కిరణ్, చంద్రబాబులపై శోభా నాగిరెడ్డి ధ్వజం
బాధ్యతను మరచి మొహం చాటేస్తున్నారు
నోరెత్తితే సీటు లాగేస్తారని కిరణ్‌కు భయం
కేసులు రాకుండా ఉండేందుకే బాబు మౌనం
ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన కేంద్ర మంత్రులు
సెంటిమెంట్ ఒక ప్రాంతానికే పరిమితం కాదు
తెలుగువారి భవిష్యత్తు ఆంటోనీ, దిగ్గీల చేతిలోనా?
ఇదేమీ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం కాదు
జగన్‌ను అభిమానిస్తున్నారని చిచ్చు పెట్టారు
కేసీఆర్ విద్వేష ప్రసంగాలు హరీశ్‌కు గుర్తు రాలేదా?
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతం ఉద్యమాలతో రగిలిపోతున్నా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబునాయుడు మాత్రం ప్రజలకు ముఖం చాటేశారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఈ ఇద్దరూ ‘కనబడుటలేదు’ అని ప్రకటనలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కిరణ్, బాబు వైఖరిపై మండిపడ్డారు. ‘‘సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే... ఆ ప్రాంతానికే చెందిన కిరణ్, బాబు ప్రజల ముందుకు వచ్చి వారిని సమాధానపర్చకుండా అజ్ఞాతం (అండర్‌గ్రౌండ్)లోకి వెళ్లి పోయారు. నోరెత్తి మాట్లాడితే ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తొలగిస్తారని కిరణ్ భయపడుతున్నారు. తనపై కేసులు రాకుండా చూసుకునేందుకు, ఆస్తులు కాపాడుకునేందుకే బాబు కిమ్మనడం లేదు.
సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతున్నా వీరు పట్టించుకోవడం లేదు’’ అని దుయ్యబట్టారు. ప్రతి చిన్న విషయానికి వేలు చూపుతూ, ఎదుటివారిని బెదిరించే విధంగా ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడే చంద్రబాబు ఇంత పెద్ద సమస్య రాష్ట్రంలో రగులుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన ఆవేశం ఏమైంది? వేలెత్తి ఎందుకు మాట్లాడ్డంలేదని శోభ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించి పోలవరంకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించినప్పుడు, రాయలసీమ ప్రాంతానికి ఏమిచ్చారని బాబు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఇవన్నీ ఆ ప్రాంత ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇక సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు తమ ప్రాంతానికి ఎంత అన్యాయం జరుగుతున్నా ఏమీ మాట్లాడకుండా బొమ్మల్లాగా కూర్చున్నారని దుయ్యబట్టారు. మరో ఆరు నెలలు మాత్రమే ఉండే పదవుల కోసం తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని నిప్పులు చెరిగారు. సమైక్యంగా ఉంచాలన్న వాంఛ ప్రజల్లో ఇంత బలీయంగా ఉంటుందని విభజన నిర్ణయం వెలువడిన తరువాతనే తమకు తెలిసిందని పళ్లంరాజు చెప్పడం దారుణమన్నారు. ‘‘సెంటిమెంట్ ఒక ప్రాంతానికే పరిమితమనుకున్నారా... మరో ప్రాంతంలో ఉండదనుకున్నారా? మంత్రి పదవి పోతుందనే భయంవల్ల మీకు సెంటిమెంట్ లేకపోవచ్చు, కానీ సామాన్య ప్రజలకు మనోభావాలు బలీయంగా ఉంటాయి’’ అని చెప్పారు.
పార్లమెంట్‌లో కాంగ్రెస్, టీడీపీ ఎంపీలది డ్రామా
కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు పార్లమెంటులో చేస్తున్న హడావుడిని ఒక డ్రామా అని శోభా నాగిరెడ్డి అభివర్ణించారు. సీమాంధ్రులకు అన్యాయం చేస్తూ నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలే ఉద్యమాలంటూ డ్రామాలు చేయడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విభజన నిర్ణయం వెలువడిన రెండోరోజే 4, 5 లక్షల కోట్ల రూపాయలు ఇస్తే మరో రాజధాని నిర్మించుకుంటామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారని, మళ్లీ ఆ పార్టీకి చెందిన ఎంపీలే పార్లమెంటులో నిరసన డ్రామా చేస్తున్నారని విమర్శించారు.
వీరంతా ఇపుడు డ్రామాలు చేసే కంటే విభజన ప్రకటన వెలువడటానికి ముందే రాజీనామాలు చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చి ఉండేది కాదు కదా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. తమతో చర్చించడానికి ఏకే ఆంటోనీ, దిగ్విజయ్‌సింగ్‌లతో ఒక హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రులు చెబుతుంటే చాలా బాధ కలుగుతోందన్నారు. 12 కోట్ల మంది తెలుగు ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది వీళ్లిద్దరా? వాళ్లెవరు... మనపై నిర్ణయం తీసుకోవడానికి? ఇదేమీ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం కాదని, కోట్లమంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని చెప్పారు. సమన్యాయం చేయకుండా రాష్ట్ర విభజన చేస్తామనడం సరికాదన్నారు. రాష్ట్రంలో నదీజలాలతో పాటుగా ఉన్న అనేక జటిలమైన సమస్యలను పట్టించుకోకుండా కేవలం 15, 16 లోక్‌సభ స్థానాల కోసం, రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ ఈ విభజన నిర్ణయం తీసుకోవడం సబబేనా అని ప్రశ్నించారు.
రాహుల్‌ని ప్రధాని చేయడంకోసమే విభజన: వైఎస్
రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత మూడు ప్రాంతాల ప్రజలు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఆదరిస్తున్నారన్న నిజాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోయిందని, కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా వైఎస్‌పై ఉన్న అభిమానాన్ని జగన్‌పై చూపిస్తున్నారనే కోపంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసిందని శోభా నాగిరెడ్డి దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేయడం కోసం రెండు ప్రాంతాల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెట్టిందని చెప్పారు. సీమాంధ్రులకు హైదరాబాద్‌లో ఏమీ జరక్కుండా రక్షణ కల్పిస్తామని కొందరు తెలంగాణ మంత్రులు చెప్పడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ‘‘మీరెవరు మాకు రక్షణ కల్పించడానికి? మిమ్మల్ని సీమాంధ్రులేమైనా అడుక్కున్నారా రక్షణ కల్పించమని? మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం సీమాంధ్రులకు లేదు. ఇక్కడ మీకు ఎంత హక్కు ఉందో మాకూ అంతే హక్కుంది. మా హక్కును పోరాడి సాధిస్తాం’’ అని స్పష్టంచేశారు. సీమాంధ్రను అభివృద్ధి చేస్తామని ఢిల్లీ నేతలు చెబుతున్నారని, కొత్తగా ఏర్పడిన జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఎంత అభివృద్ధి చేశారో అందరికీ తెలిసిందేనని ఆక్షేపించారు. రాజకీయ లబ్ధికోసం రాష్ట్రంలో చిచ్చుపెట్టిన కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
షర్మిల ఇచ్ఛాపురం సభలో మాట్లాడిన మాటలను తప్పుపడుతున్న టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావుకు అంతకుముందు కేసీఆర్ రెచ్చగొడుతూ చేసిన ప్రసంగాలు గుర్తుకు రాలేదా? అని శోభ ప్రశ్నించారు. ‘‘సీమాంధ్రులను అవమానిస్తూ కేసీఆర్ ఎన్నిసార్లు మాట్లాడలేదు? ఎవరికి తల్లి అని తెలుగుతల్లిని కూడా కించపరిచింది మరిచారా? జాగో, భాగో అని మాట్లాడలేదా? మీ మాటల్లో తప్పు లేదు కానీ, షర్మిల మాట్లాడితేనే తప్పుగా కనిపించిందా?’’ అని నిలదీశారు. తెలంగాణ రాకముందే ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగానే షర్మిల ప్రజలకు భరోసాగా అలా మాట్లాడారు తప్ప ఇతర ఉద్దేశాలు ఏమీ లేవని ఆమె వివరించారు.