సింగపూర్ కాదు శ్మశానం చేస్తాడు | Sobha Nagi Reddy takes on Chandrababu naidu | Sakshi
Sakshi News home page

సింగపూర్ కాదు శ్మశానం చేస్తాడు

Published Sat, Apr 5 2014 9:18 AM | Last Updated on Mon, Oct 22 2018 5:46 PM

సింగపూర్ కాదు శ్మశానం చేస్తాడు - Sakshi

సింగపూర్ కాదు శ్మశానం చేస్తాడు

టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే సీమాంధ్రను సింగపూర్ చేయడం కాదు కానీ శ్మశానంగా మార్చడం ఖాయమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆరేళ్లలోపు పాలన సాగించిన వైఎస్సార్‌ను ప్రజలు ఆయన ఫొటోల్లో చూసుకుంటూ పూజలు చేస్తున్నారని, అలాంటిది తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు ఫొటో కూడా ఏ పేదవాడి ఇంట్లో లేదన్నారు. ఇందుకు ఆయన సాగించిన ప్రజావ్యతిరేక పాలనే నిదర్శనమన్నారు. దొర్నిపాడులో శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రజలు ఘనస్వాగతం పలికారు.
 
స్థానిక పార్టీ కార్యాలయం నుంచి అంకాలమ్మ గుడి వరకు నిర్వహించిన రోడ్‌షోకు జనం బ్రహ్మరథం పట్టారు. అంకాలమ్మ సెంటర్‌లో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్సార్ ప్రజా సంక్షేమానికి పాటుపడితే చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 1999లో గుజరాత్‌లో ముస్లింలపై దాడులు జరిగిన సమయంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న చంద్రబాబు అందుకు సంబంధించి రాష్ట్ర ముస్లింలకు క్షమాపణ చెప్పారని, నరేంద్రమోడీని రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వబోనని ప్రకటించారన్నారు. అయితే అందుకు విరుద్ధంగా ప్రస్తుతం అదే పార్టీతో పొత్తుకు కాళ్లబేరానికి వెళ్తున్నాడన్నారు.
 
 కేసీసీకి నీరు రాజశేఖరెడ్డి చలవే : కేసీ కాల్వకు సమృద్ధిగా నీరు పారుతూ ఇరుగారు పంటలు పండుతున్నాయంటే అందుకు వైఎస్సార్ కృషే కారణమని ఎమ్మెల్యే అన్నారు. పొతిరెడ్డిపాడు విస్తరణ పనులను వైఎస్సార్ చేపట్టడం వల్లే పంటలకు సాగునీటి సమస్య లేకుండా పోయిందన్నారు. వైఎస్సార్ ఆశయాలు సాధిస్తూ ప్రజారంజక పాలన అందించడమే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని, ఓదార్పు యాత్ర ద్వారా పేదలను ప్రత్యక్షంగా కలుసుకున్న ఆయనకు వారి కష్టాలేంటో తెలుసని, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.
 
 వరుసగా జరిగే అన్ని రకాల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చాకరాజువేముల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తులసీరాముడు, మరో 150 మంది వైఎస్సార్‌సీపీలో చేరారు.
  ఆయా కార్యక్రమాల్లో డెయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి, నాయకులు రామకృష్ణారెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు భూమా వీరభద్రారెడ్డి, వేమయ్య తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement