
'టికెట్లు ఇస్తామంటే పార్టీలో చేరేందుకు నేతలు సిద్ధం'
వైఎస్సార్ జిల్లా: పార్టీ టిక్కెట్లు ఇస్తామంటే టీడీపీ ముఖ్య నేతలు, కాంగ్రెస్ మంత్రులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శోభానాగిరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నాయని శోభానాగిరెడ్డి విమర్శించారు.
ఇక్కడ పార్టీలో అవకాశం లేనివారే ఇతర పార్టీలవైపు చూస్తున్నారని ఆమె చెప్పారు. విభజనపై అసెంబ్లీలో చర్చ సమయంలో చంద్రబాబు మాట్లాడకపోవడం ఒక డ్రామా అని శోభానాగిరెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా అఫిడవిట్లు ఇచ్చారని ఆమె చెప్పారు. చంద్రబాబు మాత్రం లేఖ గానీ, అఫిడవిట్లు గానీ ఇవ్వలేదని శోభానాగిరెడ్డి విమర్శించారు.