
'సీమాంధ్ర అభివృద్ధికి కసిగా ఆలోచిస్తున్నా'
రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రను అభివృద్ధి చేసేందుకు కసిగా ఆలోచిస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం చంద్రబాబు నాయుడు నివాసంలో గుంటూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాయపాటి సాంబశివరావు, రాయపాటి శ్రీనివాస్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఇద్దరు నేతలు వారి అనుచరులను చంద్రబాబు పచ్చ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. సీమాంధ్రను అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నారు. తెలుగుజాతిని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో గెలవదని ఆయన జోస్యం చెప్పారు. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పేరు చెబితే తన్నే పరిస్థితి నెలకొందన్నారు. సీమాంధ్ర అభివృద్ధి కోసం రాయపాటి సాంబశివరావు తీవ్ర పోరాటం చేశారని ఈ సందర్బంగా చంద్రబాబు ప్రశంసించారు.