Rayapati Srinivas
-
'సీమాంధ్ర అభివృద్ధికి కసిగా ఆలోచిస్తున్నా'
రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రను అభివృద్ధి చేసేందుకు కసిగా ఆలోచిస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సోమవారం చంద్రబాబు నాయుడు నివాసంలో గుంటూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాయపాటి సాంబశివరావు, రాయపాటి శ్రీనివాస్‌లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఇద్దరు నేతలు వారి అనుచరులను చంద్రబాబు పచ్చ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. సీమాంధ్రను అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నారు. తెలుగుజాతిని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో గెలవదని ఆయన జోస్యం చెప్పారు. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పేరు చెబితే తన్నే పరిస్థితి నెలకొందన్నారు. సీమాంధ్ర అభివృద్ధి కోసం రాయపాటి సాంబశివరావు తీవ్ర పోరాటం చేశారని ఈ సందర్బంగా చంద్రబాబు ప్రశంసించారు. -
తెలుగుదేశంలోకి రాయపాటి కుటుంబం
గుంటూరు: గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు, కుటుంబ సభ్యులంతా తెలుగుదేశం పార్టీలో చేరనున్నామని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ వెల్లడించారు. స్థానిక గోగినేని కనకయ్య అతిథిగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ వర్గీయులుగానే ముద్రపడి, ఆ పార్టీకి ఎనలేని సేవచేసిన తమను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు సైతం తమ కుటుంబం పార్టీకోసం ఎంతో పాటుపడిందనీ, కానీ తమ సోదరుడు సాంబశివరావుకు సరైన ప్రాధాన్యమివ్వలేదు సరికదా సమైక్యవాదం వినిపించినందుకు సస్పెన్షన్ వేటు వేసిందని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ పదవి కూడా ఇవ్వకుండా అవమానించిందని చెప్పారు. తొలుత రాజకీయాల నుంచే తప్పుకుందామనుకున్నామనీ, అభిమానుల కోరిక మేరకు ఈనెల 31నగానీ, వచ్చేనెల 4వ తేదీన గానీ టీడీపీలో చేరనున్నామని వివరించారు. తమతోపాటు రాయపాటి మోహనకృష్ణ కూడా టీడీపీలో చేరనున్నట్లు వెల్లడించారు. -
అజ్ఞాతంలో ఎంపీ రాయపాటి
గుంటూరు: గుంటూరు జిల్లాలో సీని యర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావు వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెస్ అధిష్టానానికి విధేయుడిగా ఉన్న ఆయన రాష్ట్ర విభజన సమయంలో పార్టీ నిర్ణయాన్ని నిరసిస్తూ యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టారు. అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో, ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, మరి కొందరు పార్టీ నేతలు, అభిమానులు కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరతారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే, ఆయన అందులో చేరకుండా అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇదిలాఉండగా, టీడీపీ నుంచి నరసరావుపేట ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు యత్నిస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇదే సమయంలో బీజేపీ తరపున కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ లేదా నరసరావుపేట నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో రాయపాటి వ్యూహం ఎమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎవరికీ చెప్పకుండా, ఫోన్ సైతం అందుబాటులో లేకుండా జాగ్రత్త పడ్డారు.