
అజ్ఞాతంలో ఎంపీ రాయపాటి
గుంటూరు జిల్లాలో సీని యర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావు వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లారు.
గుంటూరు: గుంటూరు జిల్లాలో సీని యర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావు వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెస్ అధిష్టానానికి విధేయుడిగా ఉన్న ఆయన రాష్ట్ర విభజన సమయంలో పార్టీ నిర్ణయాన్ని నిరసిస్తూ యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టారు. అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో, ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, మరి కొందరు పార్టీ నేతలు, అభిమానులు కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.
అనంతరం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరతారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే, ఆయన అందులో చేరకుండా అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇదిలాఉండగా, టీడీపీ నుంచి నరసరావుపేట ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు యత్నిస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి.
ఇదే సమయంలో బీజేపీ తరపున కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ లేదా నరసరావుపేట నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో రాయపాటి వ్యూహం ఎమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎవరికీ చెప్పకుండా, ఫోన్ సైతం అందుబాటులో లేకుండా జాగ్రత్త పడ్డారు.