రాయపాటి మోసాల్లో ఘనాపాటి.. | rayapati sambasiva rao Aggression in Guntur | Sakshi
Sakshi News home page

రాయపాటి మోసాల్లో ఘనాపాటి..

Published Sun, May 4 2014 12:52 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

rayapati sambasiva rao Aggression in Guntur

గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్నదని గ్రహించారు. నాలుగుసార్లు ఎంపీగా గెలిచేలా చేసిన కాంగ్రెస్‌ను వదలి టీడీపీలో చేరిపోయారు. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మోదుగుల వేణుగోపాలరెడ్డిని పక్కకు నెట్టి చంద్రబాబు ఈయనకు వెంటనే నరసరావుపేట పార్లమెంట్ టికెట్ ఇచ్చేశారు. రాయపాటి గతంలో పొగాకు రైతులకు డబ్బు ఎగ్గొట్టారని, పొగాకు బేళ్లలో పనికిరాని చెత్తను కుక్కి ఇతరదేశాలకు రవాణా చేయగా అప్పట్లో ఆయనను ఇందిరాగాంధీ కాపాడారని పుకార్లు ఇప్పటికీ షికారు చేస్తున్నాయి. ఇటీవల చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేశారంటూ బాధితుడు నాంపల్లి కోర్టును ఆశ్రయించగా కోర్టు రాయపాటికి మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. ఇలాంటి రాయపాటికి టీడీపీ టికెట్ కేటాయించడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
 
 వడ్డీలతో పేదల నడ్డివిరిచిన చలమారెడ్డి
 మాచర్ల టీడీపీ అభ్యర్థి కొమ్మారెడ్డి చలమారెడ్డి విషయానికి వస్తే ఈయన నిరుపేదలకు అధిక వడ్డీలకు అప్పులిచ్చి చక్రవడ్డీలతో వారి రక్తాన్ని పీల్చేవారనే నియోజకవర్గ ప్రజలు కథలుగా చెప్పుకుంటున్నారు. టీడీపీ అధినేత ఈయనకు టికెట్ కేటాయించడం చూస్తే పేదలపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్ధమౌతుంది.
 
  గురజాల సిట్టింగ్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వ్యవహారానికి వస్తే ఈయన గతంలో ఏపీ సీడ్స్‌కు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. 1992లో యరపతినేని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి గుంటూరు, నల్గొండ జిల్లాల డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. డిపాజిట్ డబ్బు చెల్లించకుండా భూములు తాకట్టుపెట్టి అప్పు తెచ్చుకున్నారు. రూ.60 లక్షలు వారికి చెల్లించకుండా ఎగనామం పెట్టారు. దీంతో వారు హైదరాబాద్ సిటీ సివిల్‌కోర్టులో దావా వేయగా రూ. 1.70 కోట్లకు కోర్టు డిక్రీ ఇచ్చింది. అనంతరం 1999లో యరపతినేని టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన భూములను జప్తు చేయకుండా ఆపించుకున్నారు. ఇప్పటికీ ఏపీఎస్‌ఎస్‌డీసీ వారు ఆ భూములను జప్తు చేసుకోలేకపోయారు.
 
 దీనికితోడు గుంటూరులో స్నేహచరిత చిట్‌ఫండ్ కంపెనీ పెట్టి టోపీ పెట్టి ఐపీ దాఖలు చేయడంతో అప్పట్లో బాధితులు నరసరావుపేట కోర్టును ఆశ్రయించారు. దీనికితోడు ఈయన ఉన్నం నరేంద్ర హత్య కేసులో నిందితునిగా ఉండి పోలీసుల కళ్లుగప్పి పరారై ఎట్టకేలకు వారి చేతికి చిక్కి జైలుకెళ్లారు. అదేవిధంగా వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు సైతం 2004లో ఓ హత్య కేసులో నిందితునిగా ఉండి అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ పొందారని, ఆ తరువాత వారితో రాజీ కుదుర్చుకుని కేసు కొట్టివేయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్య కేసులో మరో నిందితుడు కామేశ్వరరావును ఆ తరువాత పోలీసులు ఎన్‌కౌంటర్ కూడా చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఓ హత్య కేసులో నిందితునిగా ఉండి అరెస్ట్ అయి ఆ తరువాత వారితో రాజీ కుదుర్చుకుని కేసు కొట్టివేయించుకున్నారని చెబుతున్నారు. ఈ హత్య కేసులో మరో నిందితుడు కామేశ్వరరావును ఆ తరువాత పోలీసులు ఎన్‌కౌంటర్ కూడా చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
 
 కోడెల సంగతి సరేసరి..
 ఇక సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి మాజీమంత్రి కోడెల శివప్రసాదరావు  రాజకీయ జీవితం మొత్తం నేరచరిత్రతో ముడిపడి ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన హోంమంత్రిగా ఉన్న సమయంలో వంగవీటి మోహనరంగా హత్య జరిగింది. ఈ హత్యలో కోడెల హస్తం ఉందని అప్పట్లో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తడంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈయన్ను మంత్రి పదవి నుంచి తప్పించారు. 1999 ఎన్నికల సమయంలో తన ఇంటిలో బాంబులు పేలి తన అనుచరులు నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి నేర చరిత్ర కలిగిన వారికి టీడీపీలో ప్రత్యేక స్థానం ఉంది. ఈయన నరసరావుపేట నుంచి గెలవలేరని తెలిసి ఆయనకు సత్తెనపల్లి టికెట్ కేటాయించడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
 
 చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు అన్నీ పార్టీల నాయకులతో వ్యాపార సంబంధాలు నడుపుతూ ఏపార్టీ అధికారంలో ఉన్నా ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. హైదరాబాద్‌లో భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం అక్కడి పత్రికల్లో రావడంతో ఈయన బండారం బయటపడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజల నుంచి డబ్బు తీసుకుని వారికి భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా, డబ్బూ ఇవ్వకుండా మోసగించారనే ఆరోపణలు ఉన్నాయి. నరసరావుపేట బీజేపీ అభ్యర్థి నలబోతు వెంకట్రావ్ కార్మికశాఖకు సెస్ బకాయి ఉన్నప్పటికీ తన అఫిడవిట్‌లో లేనట్లుగా చూపి అధికారులను తప్పుదోవ పట్టించారు. ఇలాంటి ఘనమైన చరిత్ర ఉన్న వీళ్లా మన నాయకులంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వీరికా మనం ఓటు వేసేది అంటూ ఛీత్కరించుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు సిద్ధమౌతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement