ఎన్‌టీఆర్ జిల్లా ఏర్పాటుచేస్తా
నరసరావుపేట వెస్ట్, న్యూస్‌లైన్ :నరసరావుపేట కేంద్రంగా పలనాడు ప్రాంతాన్ని కలుపుకొని ఎన్‌టీఆర్ జిల్లా ఏర్పాటుకు కృషిచేస్తానని నరసరావుపేట ఎంపీగా ఎన్నికైన రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఎంపీగా విజయం సాధించిన అనంతరం శనివారం ఆయన నరసరావుపేటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను రాజకీయాలు చేయనని, అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్పారు. వారానికి రెండురోజులపాటు నరసరావుపేట పార్లమెంటు ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.
పలనాడులోని ప్రజలు ఫ్లోరైడ్, వెనుకబాటుతనం, నిరుద్యోగం లాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ఎంపీ నిధులతో గ్రామాల్లో సోలార్, మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు చేస్తామని చెప్పారు. నరసరావుపేటలో కాపులకోసం కమ్యూనిటీహాలు, ముస్లింలకు రెండవ షాదీఖానా, ఖబర్‌స్తాన్‌లు ఏర్పాటుచేస్తామన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన పోలీసులు, రెవెన్యూ అధికారులను గుర్తించామని చెప్పారు. వారిని సరైన సమయంలో శిక్షిస్తామన్నారు. చంద్రబాబు నాయకత్వం, పవన్ కల్యాణ్ ప్రచారం తన విజయానికి కారణమని చెప్పారు.
వాస్తవానికి ఇంకా ఎక్కువ మెజార్టీ రావలసి ఉందని అంటూ, నియోజకవర్గంలో తనకు వచ్చిన మెజార్టీపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.2 లక్షలతో గృహనిర్మాణాలను చేపట్టి మూడుగదులతో నిర్మించి ఇస్తామని, ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. నరసరావుపేట-పిడుగురాళ్ళ రైల్వేలైను నిర్మాణానికి కృషిచేస్తామని, డబుల్ డెక్కర్ రైలు జిల్లాలో ప్రయాణించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో నాయకులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, టీడీపీ చైర్మన్ అభ్యర్థి నాగసరపు సుబ్బరాయగుప్తా, కనపర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు.