రాయపాటి...కలిసొచ్చేది ఏ పాటి !
Published Wed, Apr 2 2014 3:47 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
సాక్షి, గుంటూరు :జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన ఎంపీ రాయపాటి కుటుంబం సైకిల్ ఎక్కడంతో తమకు అదనంగా కలిసొచ్చే ఓటు బ్యాంకు ఏమీ లేదని టీడీపీ కేడర్ పెదవి విరుస్తోంది. ఎంపీ రాయపాటి సాంబశివరావు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో తమకు కొత్తగా లాభించేదేమీ ఉండదని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. గ్రామాల్లో మొన్నటి వరకు తమతో పోరాడిన వారితో ఇప్పుడు ‘చేతులు’ కలపాల్సి రావడం ‘దేశం’ కార్యకర్తలకు ఏ మాత్రం రుచించడం లేదు. ముఖ్యంగా రాయపాటి సొంత నియోజకవర్గం తాడికొండలోనే ఆయనవర్గానికి, టీడీపీ కేడర్‌కు నడుమ గొడవలున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రాయ పాటి వెన్నుదన్నుతో నామినేటెడ్ పోస్టులు అనుభవించిన నేతలకు, టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలకు మధ్య తీవ్ర పొరపొచ్చాలున్నాయి. అయితే రాయపాటి చేరికతో ముఖ్యంగా తాడికొండ నియోజకవర్గంలో ఆయన వర్గం టీడీపీకి జై కొట్టింది. ఇప్పుడు వారితో టీడీపీ కేడర్ ఎలా మసలుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఏది ఏమైనా ఎన్నికలు ముగిసే వరకు కడుపులో కత్తులు పెట్టుకుని పైకి కౌగిలింతలే అన్నట్లు వ్యవహరించాల్సి ఉంటుందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. రాయపాటి సాంబశివరావుకు దాదాపు నరసరావుపేట ఎంపీ టికెట్ ఖాయమైనట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే నరసరావుపేటలో అడుగుపెట్టేందుకు రాయపాటి ముహూర్తాలు చూసుకుంటున్నారని వినిపిస్తుంది.రాయపాటి రాకతో టీడీపీలో కొత్త తలనొప్పులు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. గ్రూపుల గోల మొదలవుతుందా లేక రాయపాటి వర్గంతో టీడీపీ జెండా భుజానికెత్తుకుని ఆపత్కాలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు కలసి నడుస్తారా అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే రాయపాటి వర్గం ఇవన్నీ కొట్టి పారేయడం గమనార్హం. టీడీపీలో స్థిరమైన గ్రూపులు లేవని, అన్నీ సీజనల్ గ్రూపులేనని వ్యాఖ్యానిస్తున్నారు.
గతంలో టీడీపీలో చేరి
వెనక్కు వెళ్లిన శ్రీనివాస్...
రాయపాటి సాంబశివరావు సోదరుడు రాయపాటి శ్రీనివాస్ గతంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కొద్ది నెలలకే టీడీపీలో ఇమడలేక బయటకు వచ్చి మళ్లీ సొంత గూటికి చేరారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం టీడీపీలో లేదని బహిరంగంగానే వ్యాఖ్యానించి టీడీపీకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భూ స్థాపితం కావడంతో మళ్లీ తన కుమారుడు రాయపాటి మోహన సాయికృష్ణ సహా టీడీపీలో చేరారు. అయితే ఇప్పుడు శ్రీనివాస్ సైకిల్‌ను స్పీడుగా తొక్కగలరా లేదా అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Advertisement