టీడీపీలో చేరిన రాయపాటి సోదరులు
సాక్షి, హైదరాబాద్: గుంటూరు లోక్‌సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు, ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ తమ అనుచరులతో కలిసి సోమవారం టీడీపీలో చేరారు. వీరందరికీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్‌ను తన్నాలని ప్రజలకు అనిపిస్తోందన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తీరు దారుణమని వ్యాఖ్యానించారు.
రాయపాటి వాస్తవానికి 1996 లోక్‌సభ ఎన్నికలప్పుడే టీడీపీలో చేరాలనుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నుంచీ ఆయనతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇలావుండగా ఎన్‌టీఆర్ భవన్‌లో జరిగిన జయనామ సంవత్సర ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. పలువురు కవులను ఆయన సత్కరించారు. తెలుగు ప్రజలకు పూర్వ వైభవం తెస్తానని ఈ సందర్భంగా అన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేయటంతో పాటు సామాజిక తెలంగాణ నిర్మాణం టీడీపీ వల్లే సాధ్యమని చెప్పారు. పంచాంగ శ్రవణం చేసిన పొన్నలూరి శ్రీనివాస గార్గేయ.. రాజు, మంత్రి ఒకరే అయినందున పరిపాలనలో సమస్యలుండవని చెప్పారు. గార్గేయ గతంలో కూడా టీడీపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం చేశారు. అప్పుడు వచ్చే ఎన్నికల అనంతరం చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ఈసారి మాత్రం ఆయన అలాంటి విషయాల జోలికి పోలేదు.