కౌలురైతులకు కష్టం: రాయపాటి
విజయవాడ: రాజధాని కోసం భూసేకరణ ప్రక్రియ వల్ల కౌలురైతులు, వ్యవసాయ కూలీలకు తీరని నష్టం జరుగుతుందని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశిరావు చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కౌలురైతుల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. రాజధాని కోసం భూసేకరణ జరిగే ప్రాంతాల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల ఎంపీలకు భూములు లేవని స్పష్టంచేశారు. భూములు సేకరించనున్న గుంటూరు జిల్లా తుళ్లూరు, అమరావతి, మంగళగిరి, తాడికొండ ప్రాంత భూముల్లో ఏడాదికి మూడు పంటలు పండిస్త్తారని, దీంతో ఏడాది పొడవునా రైతులతోపాటు రైతుల కూలీలకు ఉపాధి ఉంటుందని, భూసేకరణతో అదంతా పోతుందన్నారు. రైతులకు ప్యాకేజీ ప్రకటించిన తరహాలోనే రైతుకూలీలకు కూడా న్యాయం చేయాలని సీఎంకు వివరిస్తానన్నారు.
తుళ్లూరు ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్, రెవెన్యూ కార్యాలయాల్లో అర్ధరాత్రిళ్లు బినామీ లావాదేవీలు జరుగుతున్నాయని చెప్పారు. భూసేకరణతో సంబంధం లేకుండా కృష్ణా నదిపైనే రాజధాని నిర్మాణం చేసేందుకు చెన్నై ఆర్కిటెక్చర్ కంపెనీ సిద్ధంగా ఉందని, రెండు రోజుల క్రితం ఆ కంపెనీ ప్రతినిధులు తనకు ఫోన్ చేశారని తెలిపారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరడం వల్ల ఆ పార్టీకి ఎటువంటి లాభం లేదని వ్యాఖ్యానించారు.