తొలిసారిగా..
సాక్షి, గుంటూరు: సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా గెలిచి జిల్లా నుంచి తొమ్మిది మంది మొట్టమొదటిసారిగా చట్టసభల్లో అడుగుపెట్టనున్నారు. జిల్లాలో మొత్తం మూడు పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా, రెండు స్థానాల నుంచి కొత్తవ్యక్తులు గెలుపొంది మొట్టమొదటిసారి పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. బాపట్ల ఎంపీగా గెలిచిన శ్రీరామ్ మాల్యాద్రి 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలైనప్పటికీ ఈసారి టికెట్టు పొంది విజయం సాధించగలిగారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి గల్లా అరుణ కుమారుడు గల్లా జయదేవ్ టీడీపీ తరఫున మొట్టమొదటిసారి ఎన్నికై పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు.
అసెంబ్లీకి ఏడుగురు కొత్తవారు..
జిల్లాలో ఏడుగురు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. వీరిలో నలుగురు
వైఎస్సార్‌సీపీ తరఫున, ముగ్గురు టీడీపీ తరఫున గెలుపొందారు. నరసరావుపేట నుంచి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి బీజేపీ అభ్యర్థి నలబోతు వెంకట్రావుపై 15576 ఓట్ల భారీ మెజార్టీ సాధించారు. ఆర్థోపెడిక్ వైద్యుడిగా ప్రజలకు సుపరిచితుడైన గోపిరెడ్డి మొట్టమొదటిసారిగా పోటీ చేసినప్పటికీ ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో ఎవరికీ రానంత మెజార్టీని అక్కడి ప్రజలు ఆయనకు కట్టబెట్టారు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని మంగళగిరి నుంచి వైఎస్సార్ సీపీ తరుపున పోటీ చేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఇక్కడ ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకం, జగన్‌పై ఉన్న అభిమానంతో హోరాహోరీ పోరు జరిగినప్పటికీ ఆ ప్రాంత ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి వెంట మొదటి నుంచి నడిచి కష్టనష్టాలకు వెరవకుండా ఆయన చేపట్టిన ప్రతి పోరాటంలోనూ ఆళ్ళ ముందు వరుసలో ఉంటూ వచ్చారు. గుంటూరు తూర్పు నుంచి వైఎస్సార్‌సీపీ తరుపున పోటీ చేసిన షేక్ మొహమ్మద్ ముస్తఫా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముస్తఫా తాడికొండ సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీలో చేరి తూర్పు టిక్కెట్ సాధించి 3,150 ఓట్ల మెజార్టీతో గెలిచి, మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.
బాపట్ల నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరుపున పోటీ చేసిన కోన రఘుపతి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోన రఘుపతికి ఉన్న కుటుంబ నేపథ్యం, ప్రజల్లో జగన్‌పై ఉన్న అభిమానంతో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయనకు 5,813 ఓట్ల మెజార్టీ వచ్చింది. తాడికొండ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన తెనాలి శ్రావణ్‌కుమార్, ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన రావెల కిశోర్‌బాబు, రేపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన అనగాని సత్యప్రసాద్ కూడా తొలిసారి ఎమ్మెల్యేలుగా చట్టసభల్లో అడుగిడనున్నారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎంపీలు ప్రజాసమస్యలపై చట్ట సభల్లో ఏమేరకు పోరాటం చేస్తారో వేచి చూడాలి.