సైకిల్‌దే పైచేయి..
సాక్షి, గుంటూరు :పది రోజుల ఉత్కంఠకు తెరపడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య నువ్వా.. నేనా అన్నట్లు సాగిన పోటీలో టీడీపీ పైచేయి సాధించింది. జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాల్లో 12 టీడీపీ కైవసం చేసుకోగా ఐదు స్థానాలను వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. మూడు పార్లమెంట్ స్థానాల్లోనూ సైకిల్‌నే విజయం వరించింది. దేశవ్యాప్తంగా సాగిన మోడీ ప్రభంజనంతో రాష్ట్రంలో సైతం టీడీపీ అనూహ్యంగా సీట్లు సాధించింది. జిల్లాలో మాత్రం ఫ్యాన్, సైకిల్ మధ్య ఉత్కంఠపోరు సాగింది. చివరి రౌండ్ వరకూ విజయం చాలా చోట్ల ఇరుపార్టీ నేతల మధ్య దోబూచులాడింది.
ప్రత్తిపాడు, వేమూరు, సత్తెనపల్లి, పొన్నూరు, పెదకూరపాడు నియోజకవర్గాల లెక్కింపు జరిగినంత సేపు ఇరుపార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు విజయం ఎవరి పక్షమో తేలక ఆఖరు నిమిషం వరకు ఉత్కంఠగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ స్థానాలను స్వల్ప ఆధిక్యాలతో టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. ఇదేవిధంగా గుంటూరు తూర్పు, మంగళగిరి అసెంబ్లీ స్థానాల్లో అంతకు మించి ఉత్కంఠ నెలకొనగా ఈ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెల్చుకుంది. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో రెండు, గుంటూరుపార్లమెంట్ పరిధిలో రెండు, బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని వైఎస్సార్ సీపీ గెలుచుకోగలిగింది. జిల్లాలో ఉన్న మూడు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్థులకు పరాభవం..
2004, 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి సీట్ల మాట అటుంచి, కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయింది. నిన్న మొన్నటి వరకు కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన మంత్రులకు సైతం డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2009లో బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొంది కేంద్రమంత్రి పదవిని దక్కించుకున్న పనబాక లక్ష్మికి కేవలం 17,563 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్
ఠమొదటిపేజీ తరువాయి
పార్టీ తరఫున ఐదుసార్లు వరుసగా గెలుపొంది అనేక మంత్రి పదవులు పొందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు కేవలం 23,275 ఓట్లురాగా, తెనాలి నుంచి పోటీ చేసిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు 15,511 ఓట్లు దక్కాయి. రేపల్లె నుంచి పోటీ చేసిన మోపిదేవి శ్రీనివాసరావుకు 12,981 ఓట్లు రాగా మిగిలిన 14 నియోజకవర్గాలో ఆ పార్టీ అభ్యర్థులకు రెండు వేల ఓట్లు దక్కడమే గగనమైంది. గుంటూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన షేక్ వహీద్‌కు 45,633 ఓట్లు, నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వర్లుకు 21,583 ఓట్లు వచ్చాయి. మాజీ కేంద్రమంత్రి కంటే కొత్తగా పోటీ చేసిన ఇరువురు పార్లమెంట్ సభ్యులకు అధిక ఓట్లు రావడం గమనార్హం.
గెలుపొందిన అభ్యర్థులు, మెజార్టీల వివరాలు
పార్లమెంట్
1. గల్లా జయదేవ్, గుంటూరు (టీడీపీ) - 70,328
2. రాయపాటి సాంబశివరావు, నరసరావుపేట (టీడీపీ) - 29,686
3. శ్రీరామ్ మాల్యాద్రి, బాపట్ల(టీడీపీ) - 32,301
అసెంబ్లీ
1. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల (వైఎస్సార్‌సీపీ) - 3,535
2. డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట(వైఎస్సార్‌సీపీ)- 15,556
3. ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే), మంగళగిరి(వైఎస్సార్‌సీపీ) - 12
4. కోన రఘుపతి, బాపట్ల(వైఎస్సార్‌సీపీ) - 5,813
5. మహ్మద్ ముస్తఫా, గుంటూరు తూర్పు(వైఎస్సార్‌సీపీ) - 3,151
6. మోదుగుల వేణుగోపాలరెడ్డి, గుంటూరు పశ్చిమ(టీడీపీ) - 17,913
7. అనగాని సత్యప్రసాద్, రేపల్లె (టీడీపీ) - 14,355
8. దూళిపాళ్ళ నరేంద్ర, పొన్నూరు(టీడీపీ) - 7,761
9. ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి(టీడీపీ) - 19,065
10. ప్రత్తిపాటి పుల్లారావు, చిలకలూరిపేట(టీడీపీ) - 10,684
11. యరపతినేని శ్రీనివాసరావు, గురజాల(టీడీపీ) - 7,187
12. జి.వి.ఆంజనేయులు, వినుకొండ(టీడీపీ) - 21, 407
13. కొమ్మాలపాటి శ్రీధర్, పెదకూరపాడు(టీడీపీ) - 5,992
14. తెనాలి శ్రావణ్‌కుమార్, తాడికొండ(టీడీపీ) - 7,542
15. నక్కా ఆనంద్‌బాబు, వేమూరు(టీడీపీ) - 2,109
16. రావెల కిషోర్‌బాబు, ప్రత్తిపాడు (టీడీపీ) - 7,405
17. కోడెల శివప్రసాదరావు, సత్తెనపల్లి(టీడీపీ) - 984