
తెలుగుదేశంలోకి రాయపాటి కుటుంబం
గుంటూరు: గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు, కుటుంబ సభ్యులంతా తెలుగుదేశం పార్టీలో చేరనున్నామని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ వెల్లడించారు. స్థానిక గోగినేని కనకయ్య అతిథిగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ వర్గీయులుగానే ముద్రపడి, ఆ పార్టీకి ఎనలేని సేవచేసిన తమను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు సైతం తమ కుటుంబం పార్టీకోసం ఎంతో పాటుపడిందనీ, కానీ తమ సోదరుడు సాంబశివరావుకు సరైన ప్రాధాన్యమివ్వలేదు సరికదా సమైక్యవాదం వినిపించినందుకు సస్పెన్షన్ వేటు వేసిందని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ పదవి కూడా ఇవ్వకుండా అవమానించిందని చెప్పారు. తొలుత రాజకీయాల నుంచే తప్పుకుందామనుకున్నామనీ, అభిమానుల కోరిక మేరకు ఈనెల 31నగానీ, వచ్చేనెల 4వ తేదీన గానీ టీడీపీలో చేరనున్నామని వివరించారు. తమతోపాటు రాయపాటి మోహనకృష్ణ కూడా టీడీపీలో చేరనున్నట్లు వెల్లడించారు.