టీడీపీలోకి వస్తే ప్రాధాన్యమేదీ?
మంగళగిరి: గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన మంగళవారం గుంటూరు జిల్లా కాజ గ్రామంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాయపాటి విలేకరులతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కొందరు నేతలు తనతోపాటు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారని గుర్తుచేశారు. కాంగ్రెస్ వీడిన తాము ప్రస్తుతం టీడీపీలో జూనియర్లమేనని, ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నామని చమత్కరించారు. తెలుగుదేశం పార్టీలోనూ గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయని, ఒక్కో ఎమ్మెల్యే వద్ద నాలుగైదు గ్రూపులు ఉన్నాయని చెప్పారు.
కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన నేతలు ఇబ్బంది పడుతున్నారని రాయపాటి పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవచేయాలే తప్ప గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించకూడదని ఆయన హితవు పలికారు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్లానన్నారు. గుంటూరు-విజయవాడ మధ్యే రాజధాని ఉంటుందన్నారు.